శిథిలావస్థలో క్లాస్‌‌‌‌రూమ్స్‌‌‌‌.. చెట్ల కింద స్టూడెంట్స్‌‌‌‌

శిథిలావస్థలో క్లాస్‌‌‌‌రూమ్స్‌‌‌‌.. చెట్ల కింద స్టూడెంట్స్‌‌‌‌
  • శిలాఫలకాలకే పరిమితమైన మన ఊరు మన బడి పనులు
  • సర్కార్‌‌‌‌ నుంచి అందని నిధులు, ఫైనల్‌‌‌‌ కాని టెండర్లు
  • శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటున్న లీడర్లు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్‌‌‌‌కు దీటుగా తయారు చేస్తున్నామని, ఇందుకోసం సర్కార్‌‌‌‌ భారీగా నిధులు విడుదల చేస్తోందని అధికారపార్టీ లీడర్లు పదే పదే చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ‘మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి’తో స్కూళ్ల రూపురేఖలే మారుతాయని ప్రచారం చేసిన ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. 

ఎంపికైన కొన్ని స్కూళ్లలో ఇంకా టెండర్లు ఫైనల్‌‌‌‌ కాకపోగా, మరికొన్ని స్కూళ్లలో శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో అధ్వానంగా ఉన్న స్కూళ్లలోనే స్టూడెంట్లు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. 

ఫైనల్‌‌‌‌ కాని టెండర్లు

సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు ఉండగా జిల్లావ్యాప్తంగా 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మన బడి కింద మొదటి విడతగా 329 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో రూ. 30 లక్షల అంచనా వ్యయం దాటిన పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉంది. అలాంటి స్కూళ్లు జిల్లాలో 43 ఉన్నాయి. కానీ ఆయా స్కూళ్లలో టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఈజీఎస్‌‌‌‌ కింద కిచెన్‌‌‌‌ షెడ్స్‌‌‌‌, సైడ్‌‌‌‌ వాల్స్‌‌‌‌, కరెంట్‌‌‌‌ పనులు మాత్రమే చేస్తున్నారు. 

అరకొర గదుల్లోనే...

  • సూర్యాపేట జిల్లాలోని చాలా స్కూళ్లలో తరగతి గదుల కొరత వేధిస్తోంది. కొన్ని స్కూళ్లలో అయితే గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు నెర్రెలు బారడం, పైకప్పు ఊడి పడుతుండడంతో ఎప్పుడు కూలిపోతాయోనని ఇటు స్టూడెంట్లు, అటు టీచర్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మన ఊరు మన బడి కింద క్లాస్‌‌‌‌రూమ్స్‌‌‌‌ను కట్టేందుకు హడావుడిగా శంకుస్థాపనలు చేయడంతో అప్పటివరకు ఉన్న రూమ్స్‌‌‌‌ను కూలగొట్టారు. కానీ నిధుల మంజూరు కాకపోవడంతో కొత్త రూమ్స్‌‌‌‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. అటు పాత గదులు లేకపోవడం, ఇటు కొత్త రూమ్స్‌‌‌‌ కట్టకపోవడంతో స్టూడెంట్లను చెట్ల కింద కూర్చొబెట్టి పాఠాలు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో రెండు, మూడు క్లాస్‌‌‌‌రూమ్స్‌‌‌‌ను క్లబ్‌‌‌‌ చేసి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. 
  • హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం అమరవరం ప్రైమరీ స్కూల్‌‌‌‌లో రూ. 29.99 లక్షలతో రెండు క్లాస్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ నిర్మించేందుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. రూమ్స్‌‌‌‌ నిర్మాణానికి మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి శంకుస్థాపన సైతం చేశారు. కానీ ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఎస్‌‌‌‌ఎంసీ చైర్మన్‌‌‌‌, సర్పంచ్‌‌‌‌ కలిసి తమ సొంత పనులతో విద్యుద్దీకరణ పనులను మొదలుపెట్టారు. స్కూల్‌‌‌‌ ఆవరణలోని రెండు క్లాస్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కురుస్తుండడంతో వాటిని కూల్చివేశారు. ప్రస్తుతం స్కూల్‌‌‌‌ వరండాలోనే క్లాస్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు.
  • చింతలపాలెం మండలం తమ్మవరం హరిజనవాడ స్కూల్‌‌‌‌లో 20 మంది స్టూడెంట్లు ఉన్నారు. ప్రస్తుతం రేకులతో వేసిన షెడ్డులోనే క్లాస్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఉన్న ఈ ఊరుని పాక్షిక ముంపు గ్రామంగా గుర్తించారు. దీంతో ఇక్క కొత్త క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లు కట్టేందుకు నిధులు మంజూరు కావడం లేదు. హైస్కూల్‌‌‌‌లో ఓ రూమ్‌‌‌‌ అందుబాటులో ఉన్నా అది దూరంగా ఉండడంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. 
  • తుంగతుర్తి జడ్పీ హైస్కూల్‌‌‌‌లో సుమారు 320 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇక్కడ కొన్ని రూమ్స్‌‌‌‌లో పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండడంతో స్టూడెంట్లు స్కూల్‌‌‌‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఆవరణలోని చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు. వర్షాలు పడే టైంలో క్లాస్‌‌‌‌లను క్లబ్‌‌‌‌ చేస్తున్నారు. మన ఊరు మన బడి కింద ఈ స్కూల్‌‌‌‌ను ఎంపికచేసినప్పటికీ పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారు. 
  • గరిడేపల్లి మండలం గానుగుబండ జడ్పీ హైస్కూల్‌‌‌‌లో గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అంతకుముందు సర్వశిక్ష అభియాన్‌‌‌‌ ద్వారా ఒక రూమ్‌‌‌‌ నిర్మించడం మొదలుపెట్టగా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. ఈ స్కూల్‌‌‌‌కు మొత్తం నాలుగు క్లాస్‌‌‌‌రూమ్స్‌‌‌‌ అవసరం ఉండగా మన ఊరు మన బడి ప్రోగ్రాంలో కేవలం ఒక రూమ్‌‌‌‌నే మంజూరు చేశారు. ఈ బడికి మొత్తం రూ. 29 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ప్రస్తుతంత స్టూడెంట్లు చెట్ల కిందే విద్యాభ్యాసం చేస్తున్నారు.

టెక్నికల్‌‌‌‌ ప్రాబ్లం వల్లే టెండర్లు ఆలస్యం 

మన ఊరు మన బడి కింద మొత్తం 329 స్కూళ్లను ఎంపిక చేశాం. 43 స్కూళ్లలో పనుల కోసం రూ.30 లక్షలపైన ఖర్చు అవుతుండడంతో టెండర్లు పిలిచాం. టెక్నికల్‌‌‌‌ ప్రాబ్లం వల్ల లేట్‌‌‌‌ అయ్యాయి. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. మిగిలిన స్కూళ్లలో పనులు కొనసాగుతున్నాయి.

– అశోక్, డీఈవో, సూర్యాపేట