మోరీలు తీస్తలేరు..ఫాగింగ్​ చేస్తలేరు..!

మోరీలు తీస్తలేరు..ఫాగింగ్​ చేస్తలేరు..!
  • ఎండలు దంచికొడుతున్నా వదలని దోమల బెడద
  • డ్రైనేజీల క్లీనింగ్, ఫాగింగ్ లేక అవస్థలు
  • సిబ్బంది తీరుపై విమర్శలు
  • లైట్ తీసుకుంటున్న జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు
  • ఇబ్బందులు పడుతున్న గ్రేటర్ వరంగల్ జనాలు

హనుమకొండ, వెలుగు : వరంగల్ నగరంలో దోమల బెడద ఎక్కువైంది. సాధారణంగా వానకాలంలో దోమల విజృంభణకు అవకాశం ఉండగా, ఎండకాలంలోనూ తిప్పలు తప్పడం లేదు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగించడం, మురుగునీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ముఖ్యకారణంగా తెలుస్తున్నది. నగరంలోని చాలా కాలనీల్లో మురుగుకాల్వలు దోమలకు నిలయంగా మారాయి. సిబ్బంది డ్రైనేజీలు క్లీన్​ చేయకపోవడంతో ప్రజలే ఆ పని చేసుకోకతప్పడం లేదు. 

వదలని దోమ బెడద..

గ్రేటర్ వరంగల్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, డ్రైనేజీలు క్లీన్ చేయడం, చెత్త సేకరణ, తరలింపు, శానిటేషన్ పనుల కోసం జీడబ్ల్యూఎంసీలో మొత్తం 2 వేల మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో అర్బన్​ మలేరియా డిపార్ట్​మెంట్​లో 150 మంది ఔట్​ సోర్సింగ్, డైలీ వైజ్ సిబ్బంది, 20 మంది రెగ్యులర్ స్టాఫ్​తోపాటు 10 పబ్లిక్ హెల్త్ వింగ్ కు సంబంధించిన సిబ్బంది  ఉన్నారు. వారంతా దోమల నివారణకు పని చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది సక్రమంగా పని చేయకపోవడంతో దోమల తీవ్రత ఎక్కువవుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రయిందంటే చాలు దోమలతో యుద్ధం చేయాల్సి వస్తోందని నగర జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగర పరిధిలో ఏటా శానిటేషన్, దోమల నియంత్రణకు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రధానంగా ఫాగింగ్​ చేసేందుకు కెమికల్స్, వెహికిల్ పెట్రోల్, డీజిల్ విక్రయాలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. అయినా, క్షేత్రస్థాయిలో ఫాగింగ్ మాత్రం చేయడం లేదని, కానీ రికార్డుల్లో మాత్రం రాసుకుపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ఫిర్యాదులు చేస్తే, లేదా పైరవీలు చేస్తేనో నామమాత్రంగా ఫాగింగ్​ చేసి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ ఆఫీసర్లు దోమల నియంత్రణకు చర్యలు చేపట్టి, సక్రమంగా డ్రైన్లు తీయించడంతో పాటు ఫాగింగ్​ చేయించడంపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

అటెండెన్స్ వేసి, విధులకు డుమ్మా..

జీడబ్ల్యూఎంసీలో రెండేండ్ల కిందట 452 మంది మున్సిపల్ శానిటేషన్ వర్కర్లను కొత్తగా తీసుకోగా, అందులో చాలామంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వాళ్లంతా డ్రైన్లు క్లీన్ చేయడం, చెత్త, గడ్డిలాంటివి తొలగించడం, కాల్వల్లో కెమికల్ స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయడంలాంటి పనులు చేయాలి. కానీ, చాలామంది బయోమెట్రిక్​ వేయడం, ఆ తర్వాత ఫొటోలు అధికారుల వాట్సాప్​ గ్రూప్​లో పెట్టడం వరకే పరిమితం అవుతున్నారని తెలిసింది. కొంతమంది అధికారులు సిబ్బంది నుంచి వసూళ్లకు పాల్పడి లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలూ వినిపిసుతన్నాయి.  

ఇది గ్రేటర్ వరంగల్ పరిధి కాజీపేట మండలంలోని సోమిడి. కొంతకాలంగా ఇక్కడ మోరీలు తీసేందుకు ఎవరూ రాకపోవడంతో దోమలు పెరిగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా మున్సిపల్​ సిబ్బంది ఇటు వైపు చూడకపోవడంతో స్థానికులే ఇండ్ల ముందు ఇలా క్లీన్ చేసుకుంటున్నారు. కానీ, ఆఫీసర్లు మాత్రం ప్రతి డివిజన్ మొత్తాన్నీ కవర్ చేస్తున్నట్లుగా రికార్డులు సృష్టించుకుంటున్నారు. 

దోమలతో ఇబ్బంది పడుతున్నం..

మా ఏరియాలో మోరీలు క్లీన్​ చేస్తలేరు. ఆరు నెల్లకో, ఏడాదికో ఓసారి వచ్చి నామమాత్రంగా పనులు చేసి పోతున్నారు. కనీసం దోమల పొగ కూడా కొడుతలేరు. చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వారానికోసారైనా ఫాగింగ్ చేసి, మురుగుకాల్వలు క్లీన్​ చేయిస్తే బాగుంటుంది.

- అబ్బరబోయిన శ్రీవాణి, సుభాశ్​కాలనీ, 62వ డివిజన్​

ప్రతి డివిజన్​ కవర్​ చేస్తున్నం..

దోమల నియంత్రణకు యాక్షన్​ ప్లాన్ అమలు చేస్తున్నాం. ప్రతి డివిజన్​ను కవర్​అయ్యేలా పనులు చేయిస్తున్నం. సిబ్బంది అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నట్టుగా ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం.

- మాధవరెడ్డి, బయాలజిస్ట్, జీడబ్ల్యూఎంసీ