హైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ సింపోజియం ప్రారంభం

హైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ సింపోజియం ప్రారంభం

హైదరాబాద్‌‌, వెలుగు: కాంపౌండ్ లైవ్‌‌స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎల్ఎఫ్ఎంఏ) 58వ ఏజీఎం, 66వ జాతీయ సింపోజియం హైదరాబాద్‌‌లో శుక్రవారం ( ఆగస్టు 22) మొదలయింది. “భారతదేశంలో పశు వ్యవసాయం: - ముందుకు సాగే మార్గం” అనే థీమ్‌‌తో జరుగుతున్న ఈ రెండు రోజుల కార్యక్రమం శనివారం ముగుస్తుంది. 

పశుసంపద, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ భవిష్యత్తుపై లీడర్లు, పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు చర్చించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, తెలంగాణ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎల్​ఎఫ్​ఎంఏ ఛైర్మన్ దివ్య కుమార్ గులాటి మాట్లాడుతూ, భారతదేశ పశుసంవర్ధక రంగానికి ప్రపంచ పాల ఉత్పత్తిలో 13శాతం, వ్యవసాయ జీవీఏలో 30.23శాతం, జాతీయ ఆర్థిక వ్యవస్థలో 5.5శాతం వాటా ఉందని తెలిపారు.  మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ మాట్లాడుతూ, ఈ రంగాలను ప్రోత్సహించడం, పశువుల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని పేర్కొన్నారు.