
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరిట క్రౌడ్ ఫండింగ్‌ను ప్రారంభించింది. అదే పేరుతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి డొనేట్ చేద్దామని వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పేరుతో కనిపించే డొమైన్‌పై క్లిక్ చేస్తే బీజేపీ వెబ్‌సైట్‌కు వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ డొనేట్ ఫర్ ఐఎన్‌సీ (www.donateinc.in) పేరుతో విరాళాలు సేకరిస్తోంది.
విరాళాల సేకరణను కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 18న ప్రారంభించింది. ముందస్తుగా క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి డొమైన్‌ను కాంగ్రెస్ కొనుగోలు చేయకపోవడంతో బీజేపీ మద్దతుదారులు ఎవరో అదే పేరుతో డొమైన్‌ను కొనుగోలు చేశారు. www.donatefordesh.org డొమైన్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే బీజేపీ డొనేషన్ పేజీకి రీడైరెక్ట్ అవుతోంది. ఆన్‌లైన్‌లో కొన్ని టూల్స్ ద్వారా చెక్ చేసినప్పుడు కొన్ని గంటల ముందే ఈ సైట్ అందుబాటులోకి వచ్చినట్లు తెలిసింది.
అదే సమయంలో డొనేట్ ఫర్ దేశ్.కామ్ డొమైన్‌పై క్లిక్ చేస్తే బీజేపీకి అనుకూల వెబ్‌సైట్ సపోర్ట్ పేజీకి వెళుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వెంటనే www.donateinc.in పేరిట డొమైన్‌తో కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాంగ్రెస్ మద్దతుదారులకు స్పష్టతను ఇచ్చేందుకు రాహుల్ గాంధీ స్వయంగా డొమైన్ పేరుతో ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం (డిసెంబర్ 18న) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. దేశం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కాంగ్రెస్ పార్టీ ఇదే తొలిసారి అని, ధనవంతులపై ఆధారపడి పని చేస్తే, వారి విధానాలను అనుసరించాలని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ కూడా ప్రజల నుంచి విరాళాలు తీసుకున్నారు అని తెలిపారు.
ఫండింగ్ పై కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది. ‘‘138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల నంచి రూ.138, రూ.1,380, రూ.13,800... చొప్పున విరాళాలు సేకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది’’ అని ట్వీట్ చేశారు.