హైదరాబాద్కు క్లైమేట్ చేంజ్ కష్టాలు ! అతి వర్షాలు, అకాల వర్షాలు 43 శాతం పెరుగుతయ్

హైదరాబాద్కు క్లైమేట్ చేంజ్ కష్టాలు ! అతి వర్షాలు, అకాల వర్షాలు  43 శాతం పెరుగుతయ్
  • దేశంలోని మరో ఏడు సిటీలకూ తప్పని ముప్పు 
  • పదేండ్లలో 19 రెట్లు పెరిగిన హీట్​వేవ్స్.. 2030 నాటికి రెట్టింపు 
  • అతి వర్షాలు, అకాల వర్షాలు  43% పెరుగుతయ్ 
  • ఐపీఈ, ఈఎస్ఆర్ఐ నివేదికలో తేలినట్టు లోక్ సభకు కేంద్రం వెల్లడి   
  • ఎల్​నినో, లానినాల ప్రభావం మరింత తీవ్రం  
  • హాట్​స్పాట్ జిల్లాల రూపురేఖలు మారుతాయని హెచ్చరికలు

హైదరాబాద్, వెలుగు: పొద్దునంతా తీవ్రమైన ఎండలు.. సాయంత్రం కాగానే నల్లటి మబ్బులు కమ్మేసి కుండపోత వానలు. ఈ వానాకాలంలో హైదరాబాద్ సిటీలో నెలకొన్న పరిస్థితి ఇది. మరోవైపు ఎండాకాలంలో హీట్ వేవ్స్ తీవ్రత కూడా మరింతగా పెరిగింది. అయితే, రాబోయే ఐదేండ్లలో ఈ ‘క్లైమేట్ చేంజ్(వాతావరణ మార్పు)’ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని, 2030 నాటికి ఆ కష్టాలు రెట్టింపవుతాయని.. ఇటీవల ఐపీఈ గ్లోబల్, ఈఎస్ఆర్ఐ ఇండియా సంస్థలో స్టడీలో వెల్లడైంది. ఇదే విషయాన్ని ఈ నెల 20న లోక్​సభలో కేంద్ర ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం ఈ మేరకు సమాధానమిచ్చింది. ఐపీఈ, ఈఎస్ఆర్ఐ కలిసి గత జూన్​లో ‘వెదరింగ్ ది స్టార్మ్: మేనేజింగ్ మాన్సూన్స్ ఇన్ వార్మింగ్ క్లైమేట్’ పేరిట నివేదికను విడుదల చేశాయి. 

క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ టూల్ ఉపయోగించి దేశంలోని వివిధ నగరాల్లో వాతావరణ మార్పులపై ఆయా సంస్థల పరిశోధకులు అధ్యయనం చేశారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, సూరత్, ఠాణే, పాట్నా, భువనేశ్వర్ వంటి 8 నగరాల్లో వాతావరణ మార్పుల ప్రమాదం 2030 నాటికి రెట్టింపవుతుందని హెచ్చరించారు. వాతావరణ మార్పులతో హీట్​వేవ్స్ భారీగా పెరుగుతాయని, దాని మూలంగా అకాల వర్షాలు, అతి వర్షపాతం, ఉన్నట్టుండి భారీ వర్షాలు పడడం ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఈ అకాల వర్షాలు, అతి వర్షపాతాలు 43 శాతం పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ ఇక ఏ మాత్రమూ అరుదుగా జరిగే సంఘటనలు కాబోవని, తరచూ జరుగుతుంటాయని హెచ్చరించారు.

పదేండ్లలో వడగాడ్పుల ముప్పు19 రెట్లు..
ఈ 8 నగరాలతో పాటు దేశంలోని మరికొన్ని జిల్లాల్లో 1993 నుంచి 2024 మధ్య 30 ఏండ్లలో వడగాడ్పుల ముప్పు 15 రెట్లు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంలోనే ఈ ముప్పు 19 రెట్లు ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎండాకాలం రోజులూ పెరుగుతున్నట్టు రిపోర్టులో పేర్కొంది. వర్షాకాలంలోనూ ఎండ మంట తీవ్రమవుతున్నదని వెల్లడించింది. మొత్తంగా దేశంలోని 75 శాతం జిల్లాల్లో క్లైమేట్ చేంజ్ ప్రభావం 2030 నాటికి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక్కసారైనా వడగాడ్పుల ప్రభావం నమోదవుతుందని పేర్కొంది. ఎల్​నినో, లానినా వంటి వాతావరణ పరిస్థితులు ఉధృతం అవుతాయని, తద్వారా వరదలు, తుఫాన్లు, అతిభారీ వర్షాలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. 2030 నాటికి 69% .. 2040 నాటికి 79 శాతం తీర ప్రాంతాలు వడగాడ్పుల సుడుల్లో చిక్కుకుంటాయని హెచ్చరించారు. 

అన్నింటి పైనా ఎఫెక్ట్..
క్లైమేట్ చేంజ్ వల్ల భూమి, అడవి, చిత్తడి నేలలు, ఆవాసాలు, పంట భూములు సహా అన్నీ ప్రభావితం అవుతాయని హెచ్చరించింది. హాట్​స్పాట్​లో ఉన్న జిల్లాల్లో 63% జిల్లాల రూపు రేఖలు మారిపోతాయని చెప్పింది. ఇప్పటికే అధిక వేడి ఉంటున్న రాష్ట్రాలపై మరింత ప్రభావం ఉంటుందంది. అడవుల నరికివేత, ప్రణాళిక లేని పట్టణీకరణ, చిత్తడి నేలల కనుమరుగు, మడ అడవులు తగ్గడం వంటివి పర్యావరణ నష్టానికి మరింత కారణమవుతున్నట్టు రిపోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముప్పును నివారించేందుకు క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీలను కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని నివేదిక సూచించింది.

క్లైమేట్ చేంజ్​తో కలిగే ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. కాగా, ఇవే సంస్థలు కొద్ది నెలల క్రితం మరో రిపోర్టునూ పబ్లిష్ చేశాయి. దాని ప్రకారం తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో వరదల ముప్పు నాలుగింతలు పెరుగుతుందని హెచ్చరించాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కరువు తీవ్రత రెట్టింపైందని పేర్కొన్నాయి. తుఫాన్లు ఒకటిన్నర రెట్లు పెరిగాయని, తూర్పు తీర ప్రాంతాలతో పాటు ఇప్పుడు పశ్చిమ తీర ప్రాంతాల్లోకి తుఫాన్ల ప్రభావం విస్తరించిందని తెలిపాయి.

తెలంగాణలో 2024లో 12 హీట్ వేవ్స్.. 
కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. తెలంగాణలో 2023లో 14 హీట్​వేవ్స్ ఘటనలు, 2024లో 12 హీట్​వేవ్స్ ఘటనలు నమోదయ్యాయి. 2025లో మాత్రం ఒకే ఒక్కసారి హీట్​వేవ్ ఇన్సీడెంట్​ జరిగినట్టు పేర్కొంది. 2019లోనూ 14 హీట్​వేవ్స్​పరిస్థితులు నమోదయ్యాయి. ఆ తర్వాత మూడేండ్లు (2020, 2021, 2022)లలో హీట్​వేవ్స్ లేవు. మళ్లీ గత రెండేండ్లుగా హీట్ వేవ్స్ రికార్డ్ అయ్యాయి.