పట్టుదలతో పర్వతమెక్కిండు

పట్టుదలతో పర్వతమెక్కిండు

అన్నీ ఉన్నా అనుకున్నది సాధించలేరు కొందరు. ఏమీ లేకున్నా కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో తడబడుతుంటారు మరికొందరు. కానీ, ఇంకొందరు మాత్రం కృషి.. పట్టుదలతో ఎంత కష్టమైనా సరే గోల్‌ ను రీచ్‌ అవుతుంటారు. ఈ కేటగిరీలో వైకల్యం ఉన్నా అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన వాళ్లు ఎందరో. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి వ్యక్తి కథే. ఒంటికాలితో విజయపు శిఖరాగ్రానికి చేరిన నీరజ్‌ జార్జ్ జర్నీ ఇది…

అక్టోబర్‌ 16.. నీరజ్‌ లైఫ్‌ లో మరిచిపోలేని రోజు. ఐదేళ్ల కల నెరవేరిన క్షణాలవి. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు నీరజ్. ఆ కలను నెరవేర్చుకునేందుకు పడ్డ కష్టం ఇంకా అతని కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ సంతోషంలో రెక్కలు విచ్చుకున్న పక్షిలా తన చేతికర్రలను గాల్లో ఎత్తి విజయసంకేతాన్ని చూపించాడతను. ‘‘నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఈ క్షణాల కోసం ఎన్నో బాధలకి ఓర్చాను. ప్రభుత్వాలు, కృత్రిమ అవయవాలపై ట్యాక్స్‌‌ విధిస్తేనేం .. కాళ్లు చేతులు లేకపోయినా కలలు నెరవేర్చుకోవచ్చని నిరూపించా’ అని ఫేస్‌ బుక్‌‌లో తన గెలుపు గురించి ప్రస్తావించాడతను.

మొండిఘటం

ఆల్వా ప్రాంతానికి చెందిన ముప్ఫై రెండేళ్ల జార్జ్‌‌కి ట్రెక్కింగ్‌‌ కొత్తేం కాదు. వాయనాడ్‌ కి వెళ్లే దారిలో ఉన్న పక్షిపాతాళం, తమిళనాడులోని కురింజిని శ్రేణి, మున్నార్‌ –కొడైకెనాల్‌ మధ్య ట్రెక్కింగ్‌‌ చేశాడు. ఆ టైంలో కుటుంబ సభ్యులు పెద్దగా టెన్షన్‌ పడలేదు. అయితే ఎక్కడో దూర దేశం.. అదీ దాదాపు ఆరు వేల మీటర్ల ఎత్తున్న ప్రమాదకరమైన కిలిమంజారో పర్వతం. అందుకే వాళ్లు అస్సలు ఒప్పుకోలేదు. అదొక చాలెంజింగ్ టాస్క్‌‌ అని అర్థమైంది వాళ్లకు. అయినా కూడా జార్జ్‌‌ వెనక్కి తగ్గలేదు. పట్టుబట్టి వాళ్లను ఒప్పించాడు. కిలిమంజారో ఎక్కడానికి అతనికి వారం పట్టింది. ఆ వారం రోజులు ఇంట్లో వాళ్లకు టెన్షనే. చివరికి వీడియో కాల్​ చేసి అతని సక్సెస్‌ ని చూశాకే జార్జ్‌‌ తల్లిదండ్రుల మనసు స్థిమిత పడింది. ఆ ఆనందంలోనే జార్జ్‌‌కి గ్రాండ్‌ గా వెల్‌ కమ్‌ చెప్పి సెలబ్రేషన్స్‌‌ చేసుకున్నారు అతని కుటుంబ సభ్యులు.

ప్రోస్తటిక్‌ వద్దన్నాడు

‘వేర్‌ దేర్‌ ఈజ్‌ ఏ విల్‌ .. దేర్‌ ఈజ్‌ ఏ వే’..ఈ మాట నీరజ్‌ కి సరిగ్గా సరిపోతుంది. చిన్నతనంలో ప్రోస్తటిక్‌‌ కాలు కొనలేని స్తోమత అతని తండ్రిది. ఆ టైంలో కర్రల సాయంతో కష్టంగా నడక నేర్చుకున్నాడు. అందుకే తర్వాతి రోజుల్లో కూడా అదే కొనసాగించాడు. అతని కోరికెల చిట్టా చాలా పెద్దది. ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరకు అవకాశం దక్కింది. డైట్‌ .. ట్రెయినింగ్‌‌ కష్టం గా అనిపించి నా ప్రయత్నం వీడలేదు. పర్వతాన్ని అధిరోహించే టైంలో ప్రోస్తటిక్‌‌ కాలు వాడాల్సిందిగా అతని టీం ఇన్‌స్ ట్రక్టర్‌ సూచించాడు. జార్జ్‌‌  ససేమిరా అన్నాడు. వెనక్కి పంపిస్తామని బెదిరించారు. చివరకు కొన్ని కండిషన్స్‌‌తో కొన్ని పాయింట్స్ వద్ద ప్రోస్తటిక్‌‌ కాలు వేసుకునేందుకు ఒప్పుకున్నాడు.

జత చేతి కర్రలు, వాటి కింద ఉండే క్లిప్పులు(బుషెస్‌ ) కొన్ని లగేజీలో వేసుకున్నాడు. ఇంతలో భారీ వర్షం .. అయినా అతని బృందం ఆగలేదు. ఈ జర్నీలో ప్రోస్తటిక్‌‌ను వాడింది నాలుగైదు సార్లే. పైగా అంత జారుడు బండలపై అతనికి క్రచెస్‌ (ఊతకర్రలు) గ్రిప్‌ ఇచ్చాయి. వారంపాటు ప్రమాదకరమైన ప్రయాణం తర్వాత శిఖర భాగాన్ని చేరుకున్నారు. ‘ బాధల్ని కొన్ని సార్లు ఓపికగా భరించాలి. అప్పుడే అనుకున్నది నెరవేరుతుంద’ని అంటున్నాడు నీరజ్‌ జార్జ్‌‌. లైఫ్‌ లో ఊత కర్రల సాయం లేకపోతే అతను నడవలేడేమో. కానీ, అతని విల్ పవర్ మాత్రం చాలా స్ట్రాంగ్‌‌. అందుకే దానికి ఎలాంటి సాయం అవసరం లేకుండా పోయింది.

ఖతర్నాక్‌ ప్లేయర్‌ కూడా

తొమ్మిదేళ్ల వయసులో క్యాన్సర్‌ ట్యూమర్‌ కారణంగా నీరజ్‌ ఎడమ కాలిని తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి చేతి కర్రల సాయంతోనే నడుస్తున్నా డతను. చదువులో యావరేజ్‌ స్టూ డెంట్‌ అయిన నీరజ్‌.. బ్యాడ్మింటన్‌ లో మాత్రం చాంపియన్‌. నేషనల్ లెవల్‌ టోర్నమెంట్స్‌‌లో ఎన్నో పతకాలు సాధించాడు. 2008 ఏషియన్‌ పారాఒలంపిక్స్‌‌ పోటీల్లో డబుల్స్‌‌ విభాగంలో గోల్డ్‌‌, సింగిల్స్‌‌ కేటగిరీలో సిల్వర్‌ మెడల్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతను కొచ్చిలోని అడ్వకేట్‌ జనరల్‌ ఆఫీస్‌ లో ఉద్యోగి. అయినా కూడా ట్రెక్కింగ్‌‌ను మాత్రం వదల్లేదు.