
కడుపుబ్బ నవ్వించగలడు. కళ్లనిండా నీరు తెప్పించగలడు. సౌమ్యంగా మనసును స్పృశించగలడు. క్రూరంగా కంగారుపెట్టనూ గలడు. ఎంత పెద్ద పాత్రనైనా అవలీలగా పండించగలడు. ఎంత చిన్న పాత్రకైనా తన నటనా పటిమతో కొండంత గౌరవాన్ని తెచ్చిపెట్టగలడు. ఆ మేటి నటుడు ఎవరో కాదు.. కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం (2025 జూలై 13న) తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తాను పోషించిన పాత్రల వైవిధ్యాన్ని గుర్తుచేసుకుంటూ..
నటుడు కోట శ్రీనివాసరావు ఓ నటనా శిఖరం. కోట తన నటనలో వైవిధ్యం చూపించేవారు. పాత్ర ఏదైనా సరే అందులో లీనమైపోయేవారు. ఆయన పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని, హావభావాలను మార్చుకోవడంలో దిట్టా. కోట విలన్ పాత్రలతో పాటు హాస్య పాత్రలలో కూడా తనదైన శైలిని చూపించారు. ఆయన డైలాగులు చెప్పే విధానం చాలా ప్రత్యేకం, 'ఈ డెవడ్రా బాబూ...' 'నాకేంటి ..మరి నాకేంటి' వంటి ఆయన డైలాగులను ప్రేక్షకులు తెగ ఇష్టపడతారు. అలా తాము పోషించిన పాత్రలో ఇమిడిపోగల అతికొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు.
వందేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో ఒక ఎస్వీ రంగారావు, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ వంటి నటదిగ్గజాల తర్వాత కోట అని చెప్పొచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హాస్యనటుడిగా ఆయన ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే, కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఆ పాత్రలను చేయలేరేమో అనిపిస్తుంది.
అలా కోట శ్రీనివాసరావు ఎన్నో గొప్ప సినిమాలలో నటించి మెప్పించారు. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో ‘అహ నా పెళ్ళంట’లోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. ప్రతిఘటన సినిమాలో యాదగిరి, గణేష్ లో సాంబశివుడు, గాయం మూవీలో గురు నారాయణ్, ఆమ్మో ఒకటో తారీఖు సినిమాలో ఎల్. బి. శ్రీరాం తండ్రిగా ఆంజనేయులుగా పాత్ర, మామగారు సినిమాలో పోతురాజుగా కోట నటించగా బిచ్చగాడిగా బాబు మోహన్, ఆ నలుగురులో డబ్బు అప్పిచ్చే కోటయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం కైవసం చేసుకున్నాడు కోట.
అలాగే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా కామెడీ, భావోద్వేగ పాత్రల్లో మెప్పించాడు. ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే సినిమాలో సైతం వెంకటేష్ కు నాన్నగా నటించి గుర్తిండిపోయాడు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ తాతగా నటించి ఎమోషనల్ పండించాడు. ఇలా తన సినీ ప్రస్థానంలో ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించి సినీ ప్రియులను అలరించారు.
సుమారు 40ఏళ్ల పాటు సినీ, నాటక రంగాల్లో కోటా ఎంతో సేవచేశారు. ఆయన నటనకు గుర్తింపుగా ఎన్ని ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. ఆయన అత్యధిక నంది పురస్కారాలు అందుకున్న వారిలో మొదటిస్థానంలో ఉంటాడు. ప్రతిఘటన(1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్(1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ(2002) చిత్రాలకు 9 నంది అవార్డులు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
కోటా నటించిన వాటిలో కొన్ని ముఖ్యమైన సినిమాలు చూసుకుంటే:
1978లో చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’తో సినీ ఎంట్రీ ఇచ్చాడు. కోటా 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు.
రేపాటి పౌరులు (1986),ప్రతిఘటన (1986), అహ నా పెళ్లంట (1987), శివ (1989), శత్రువు (1990), డబ్బు (1993), గాయం (1993), గోవింద గోవింద (1993), తీర్పు (1994), హలో బ్రదర్ (1994), ఆమె (1994), లిటిల్ సోల్జర్స్ (1996), అనగనగా ఒక రోజు (1997), గణేష్ (1998), చిన్నా (2000), పృధ్వి నారాయణ (2002), ఇడియట్ (2002), మల్లీశ్వరి (2004), ఆ నలుగురు (2004), అతడు (2005), ఛత్రపతి (2005), బొమ్మరిల్లు (2006), సర్కార్ (2006), పెళ్లైన కొత్తలో (2006), రెడీ (2008), లీడర్ (2010), రక్త చరిత్ర (2010), అత్తారింటికి దారేది (2013), S/O సత్యమూర్తి (2015), హీరో (2022) వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2003లో, అతను సామి మూవీతో తమిళ పరిశ్రమలో విలన్‌గా అరంగేట్రం చేశాడు.