ఈ హెల్దీ ఐస్ క్రీం ఎంతైనా తొనొచ్చు!..రుచిలోనే కాదు..కావాల్సిన పోషకాలు పుష్కలం

ఈ హెల్దీ ఐస్ క్రీం ఎంతైనా తొనొచ్చు!..రుచిలోనే కాదు..కావాల్సిన పోషకాలు పుష్కలం

పిల్లలు ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ తింటామంటే.. వద్దంటే వద్దని చెప్తుంటారు పేరెంట్స్‌‌‌‌. ‘‘అది ఆరోగ్యానికి మంచిది కాదు. అతిగా తినకూడదు” అని హెచ్చరిస్తుంటారు. కానీ.. ఈ హెల్దీ ఐస్ క్రీమ్స్‌‌‌‌ని మాత్రం వద్దన్నా తినిపిస్తుంటారు. ఎందుకంటే.. వాటిని బెంగళూరుకి చెందిన గౌతమ్‌‌‌‌ మిల్లెట్స్‌‌‌‌తో తయారుచేస్తున్నాడు. ఇవి రుచిగా ఉండడమే కాదు.. కావల్సినన్ని పోషకాలను కూడా అందిస్తాయి. మిల్లెట్స్‌‌‌‌తో ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారుచేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే.. ఇది చదివేయండి. 

ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ అంటే ఇష్టమైనా ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది నోరు కట్టేసుకుంటారు. కానీ.. ఈ ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంటున్నాడు గౌతమ్‌‌‌‌ రాయికర్‌‌‌‌‌‌‌‌. ఆయన బెంగళూరులోని మల్లేశ్వరంలో వీటిని అమ్ముతున్నాడు. గౌతమ్‌‌‌‌ శివమొగ్గ(శిమొగ)లో పుట్టి పెరిగాడు. బెంగళూరులో  ఇంజనీరింగ్ చదువుకున్నాడు. వాళ్ల కుటుంబం చాలా ఏండ్ల నుంచి ఎలక్ట్రానిక్స్ సప్లై బిజినెస్‌‌‌‌లో ఉంది. దాంతో గౌతమ్‌‌‌‌ కూడా అందులోనే చేరాడు. కానీ.. ఆ రంగంలో పనిచేయడం అతనికి ఏమాత్రం ఇష్టంలేదు. దాంతో అందులో నుంచి బయటికివచ్చి 2018లో మిల్లెట్ బ్రెడ్లు, రస్క్‌‌‌‌లు, కుకీలను అమ్మే ఒక చిన్న అవుట్‌‌‌‌లెట్‌‌‌‌ పెట్టాడు. అప్పటినుంచి బిజినెస్‌‌‌‌ని డెవలప్‌‌‌‌ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆవు, గేదె పాలు లేకుండా పోషకాలతో నిండిన ఐస్ క్రీం తయారుచేయాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి ‘‘మిల్లెట్ ఐస్ క్రీం” ఐడియా వచ్చింది. దానిపై రీసెర్చ్ చేసినప్పుడు అలాంటిది మార్కెట్లో పెద్దగా అందుబాటులో లేదని తెలుసుకున్నాడు. అందుకే ఆరోగ్యకరమైన డెజర్ట్ తినాలని కోరుకునేవాళ్ల కోసం ఎలాగైనా మిల్లెట్స్‌‌‌‌తో ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు.  

మిల్లెట్స్‌‌‌‌ ఎందుకు? 

మిల్లెట్స్‌‌‌‌లో ఐరన్‌‌‌‌, క్యాల్షియం, పొటాషియం లాంటి ముఖ్యమైన మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కానీ.. పిల్లలు సాధారణంగా మిల్లెట్స్ టేస్ట్‌‌‌‌ని అంతగా ఇష్టపడరు. అలాంటివాళ్లు కూడా ఇష్టంగా తినేలా చేయాలంటే ‘ఐస్ క్రీం’ రూపంలో ఇవ్వడమే మంచి మార్గమని నమ్మాడు గౌతమ్‌‌‌‌. పైగా ఐస్‌‌‌‌ క్రీంని పిల్లలతోపాటు పెద్దలు కూడా ఇష్టంగానే తింటారు. అందుకే 2020లో గౌతమ్ దీనిపై లోతుగా రీసెర్చ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాల్లో జొన్న, కొర్రలు, సజ్జలు, రాగులు లాంటివాటితో ప్రయోగాలు చేశాడు. వాటికి చాక్లెట్, మ్యాంగో, కాఫీలాంటి ఫ్లేవర్స్ యాడ్‌‌‌‌ చేశాడు.  ‘‘మొదట్లో ప్రతి బ్యాచ్ మాకు ఒక కొత్త విషయా  న్ని నేర్పింది. కొన్నిసార్లు టెక్స్చర్ సరిగ్గా ఉండేది కాదు. లేదంటే రుచి బాగుండేది కాదు. అలా ఎన్నో బ్యాచ్‌‌‌‌లు ఫెయిల్‌‌‌‌ అయ్యాం” అంటూ నవ్వుతూ తన జర్నీని చెప్పుకొచ్చాడు గౌతమ్‌‌‌‌. 

మిల్లెట్ మిల్క్‌‌‌‌

‘‘మేము డెయిరీ మిల్క్‌‌‌‌కి బదులుగా ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లో మిల్లెట్‌‌‌‌ మిల్క్‌‌‌‌ని వాడాలి అనుకున్నాం. మిల్లెట్స్‌‌‌‌ నుంచి పాలను తీయడం మా ముందున్న కష్టతరమైన సవాళ్లలో ఒకటి. ఎందుకంటే.. మిల్లెట్స్‌‌‌‌ నుంచి పాలు తయారుచేసి, వడకట్టిన తర్వాత కూడా వాటిలో చిన్న చిన్న పార్టికల్స్ మిగిలిపోతాయి. వాటిని పాలలోని పోషకాలు పోకుండా ఫిల్టర్‌‌‌‌‌‌‌‌ చేయడమే మేజర్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌. అలా ఫిల్టర్ చేసే సరైన విధానం అందుబాటులో లేకపోవడంతో మేమే కొత్త  విధానాన్ని కనిపెట్టాల్సి వచ్చింది. మొదట సహజంగా పండించిన మిల్లెట్స్‌‌‌‌ని స్థానిక రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల నుంచి నేరుగా కొంటాం. జాగ్రత్తగా కడిగి, ఎండబెడతాం. తర్వాత మిల్లింగ్ చేసి పాలను తీసి, ఫిల్టర్ చేస్తాం. వాటిని ఫిల్టర్ చేయడానికి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారుచేయించాం. ఐస్ క్రీం కోసం సాఫ్ట్‌‌‌‌గా, పోషకాలు ఎక్కువగా ఉండే బేస్‌‌‌‌ను తయారుచేడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మిల్లెట్ మిల్క్‌‌‌‌లో ఇంట్లోనే తయారుచేసిన నేచురల్‌‌‌‌ స్టెబిలైజర్‌‌‌‌ని మాత్రమే కలుపుతాం. అందులో వాడే పండ్లను బట్టి 5 నుంచి 12 శాతం వరకు చక్కెర కలుపుతాం. ఆర్టిఫిషియల్‌‌‌‌ కలర్స్‌‌‌‌, ఫ్లేవర్స్‌‌‌‌కి చాలా దూరంగా ఉంటాం. ప్రతి ఫ్లేవర్‌‌‌‌‌‌‌‌ని పండ్ల గుజ్జు, నట్స్‌‌‌‌ నుంచి మాత్రమే తయారుచేస్తాం” అంటున్నాడు గౌతమ్‌‌‌‌. 

లికీ ఫుడ్స్‌‌‌‌

మిల్లెట్స్‌‌‌‌తో తయారుచేసిన ఈ ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లను అమ్మడానికి గౌతమ్‌‌‌‌ 2023లో ‘‘లికీ ఫుడ్స్‌‌‌‌” పేరుతో స్టార్టప్‌‌‌‌ పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను ఐస్ క్రీంలతోపాటు మిల్లెట్ కాఫీలు, స్మూతీలు, షేక్‌‌‌‌లు, రస్క్‌‌‌‌లు, కుకీలు, శాండ్‌‌‌‌విచ్‌‌‌‌లు, పాస్తా లాంటి ఫుడ్స్‌‌‌‌ కూడా తయారుచేశాడు. ‘‘మిల్లెట్స్‌‌‌‌ని రకరకాల రూపాల్లో ఆస్వాదించవచ్చని తెలియజేసేందుకే ఇలాంటి ప్రయోగాలు చేశా” అంటున్నాడు గౌతమ్‌‌‌‌. ప్రస్తుతం ఫ్యాక్టరీలో ప్రతిరోజూ ఎనిమిది మంది పర్మినెంట్‌‌‌‌, మరో నలుగురు టెంపరరీ ఎంప్లాయిస్‌‌‌‌ పనిచేస్తున్నారు. సమ్మర్‌‌‌‌‌‌‌‌ హాలిడేస్‌‌‌‌లో డిమాండ్ బాగా పెరుగుతుంది. మామూలు రోజుల్లో కూడా కొన్నిసార్లు ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు ప్యాకేజింగ్‌‌‌‌లాంటి చిన్న చిన్న పనుల కోసం అదనంగా మరికొంతమంది టెంపరరీ ఎంప్లాయిస్‌‌‌‌ని పనిలో చేర్చుకుంటారు. 

ఇలా చేస్తారు

మిల్లెట్ ఐస్ క్రీం తయారీలోని ప్రతి ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద ట్యాంక్‌‌‌‌లో మిల్లెట్ పాలు, స్టెబిలైజర్, చక్కెరను కలిపిన తర్వాత.. ఆ మిశ్రమాన్ని సన్నని సెగమీద వేడి చేస్తారు. అలా బాగా మరిగేవరకు ఉంచుతారు. తర్వాత ఆ మిశ్రమాన్ని క్రీమ్‌‌‌‌లా మార్చడానికి హోమోజెనిసేషన్‌‌‌‌ ప్రక్రియ ద్వారా కొవ్వు అణువులను విచ్ఛిన్నం చేస్తారు. ఆ తర్వాత అందులో మిగిలిపోయిన హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి పాశ్చరైజేషన్ చేస్తారు. ఆ మిశ్రమాన్ని సుమారు ఎనిమిది గంటలు నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఫ్లేవర్స్‌‌‌‌ని యాడ్ చేసి ఫ్రీజర్‌‌‌‌లో పెడతారు. అప్పుడు అది గడ్డకట్టి ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లా మారుతుంది. 

వేల లీటర్లు

బెంగళూరులోని యెలచెనహళ్లి ప్రాంతంలో 2,500 చదరపు అడుగుల్లో లికీ ఫుడ్స్ తయారీ యూనిట్ ఉంది. దానికి ప్రతి నెలా 50 వేల లీటర్ల మిల్లెట్ ఐస్ క్రీంను ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం నెలకు దాదాపు 35 వేల లీటర్ల ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ని ఉత్పత్తి చేస్తున్నారు. వేసవి నెలల్లో అమ్మకాలు పెరిగినప్పుడు అంటే పీక్ సీజన్‌‌‌‌లో నెలకు 45,000 లీటర్ల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. దీని ద్వారా గౌతమ్‌‌‌‌ నెలకు రూ. 2 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు.