
ఒక్కో రీల్, వీడియో చూస్తుంటే.. ‘అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో?’ అనిపిస్తుంటుంది. కానీ ‘మెరిసేదంతా బంగారం కాదు’.. సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజమూ కాదు అని గుర్తుంచుకోవాలి. చాలామంది పైకి బాగా కనపడినా వాళ్ల మనసు లోతుల్లో ఏదో తెలియని నిజం దాగి ఉంటుంది. వాళ్లకు మాత్రమే తెలిసిన ఆ నిజాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమవు తుంటారు. అలాంటప్పుడు ‘మిమ్మల్ని మేం అర్థం చేసుకుంటాం’ అంటున్నారు మానసిక నిపుణులు. ప్రస్తుతం పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ ఎంత తీవ్రంగా ఉందో చెప్తూనే.. దానికి పరిష్కారమూ ఉందంటున్నారు సైకాలజిస్ట్ సోఫీ మ్యాథ్యూ.
ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రైమ్ వార్తలే. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వాస్తవానికి సమాజంలో క్రైమ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఒకటి. ఆల్రెడీ చాలామంది ఎమోషనల్ బ్యాలెన్స్ లేక, ఒత్తిడితో బాధపడుతుంటారు. అలాంటివాళ్లు డిజిటల్ ప్లాట్‌ఫాంకి అలవాటైతే వాళ్ల బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది. దాంతో విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు సొసైటీలో ఎందుకు ఇలా జరుగుతోంది? అని పరిశీలిస్తే...
సోషల్ మీడియా.. అదో మాయ: ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ఫ్లాట్‌ఫాంకి అలవాటైపోయారు. దాంతో వాళ్ల బిహేవియర్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్తోపాటు ఇతర విషయాలు కూడా ఉంటాయి. వాటిలో ఇతరులకు హానిచేసేలా ప్రేరేపించే కంటెంట్ ఉండొచ్చు. అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చెడు అని తెలిసినప్పటికీ అవి ఇంట్రెస్టింగ్గా ఉండడంతో కంటిన్యూ చేస్తారు. ఏ డిజిటల్ ప్లాట్‌ఫాం అయినా యూజర్‌కు నచ్చే కంటెంట్‌నే రెకమెండ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తుంటాయి. అవి చూస్తూ ఒక రకమైన మైకంలో పడిపోతుంటారు. ఉదాహరణకు ఇద్దరు మనుషులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటి అంశాలతో వీడియో చేసి, థంబ్నెయిల్లో కూడా అట్రాక్ట్ చేసేలా.. టైటిల్స్ పెడుతుంటారు. దానికి తగ్గట్టే ఫొటోలు ఎడిట్ చేస్తారు. సాధారణంగా కాసేపు కాలక్షేపానికో, కొత్త విషయం తెలుసుకోవడానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఓపెన్ చేస్తారు. అంతే... ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్‌తో ఫొటోలు, వీడియోలు అట్రాక్ట్ చేస్తుంటాయి. దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతుంటారు. అలాంటి వీడియోలను షేర్ కూడా చేస్తుంటారు. అలా అవి వైరల్ అవుతుంటాయి. అలాంటి కంటెంట్‌కి బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు.
డిజిటల్ అగ్రెషన్: ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్నో విషయాలకు సోషల్ మీడియా కూడా ముఖ్య కారణం అవుతోంది. అందులో మంచీ.. చెడూ తేడా లేకుండా వైరల్ అవుతోంది. ఒకరు మంచి మెసేజ్ ఇచ్చే వీడియో చేస్తే.. అది చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వడం మంచి విషయం. కానీ, అదే ఒక క్రైమ్‌ని ప్రోత్సహించే వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్ అయితే..? ఇప్పుడు మీడియాలో వస్తోన్న క్రైమ్ న్యూస్‌లో ఎక్కువశాతం కేసులు ఇవే ఉన్నాయి. సోషల్ మీడియాలోనో, ఓటీటీ, సినిమాలు.. వంటి మాధ్యమాలలో కనిపించే క్రైమ్‌ని నిజజీవితంలో అన్వయిస్తున్నారు. ముఖ్యంగా యూత్.. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్‌లో వాళ్లే ఎక్కువ ఉన్నారు. వీళ్లంతా డిజిటల్ అగ్రెషన్‌కు గురైనవాళ్లు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసిన క్రైమ్‌కి ప్రభావితం అయి, అవే ఆలోచనలతో ఉంటారు. అవకాశం రాగానే వాళ్లలో ఉన్న అగ్రెషన్‌ని బయటకు తీస్తారు.
టాక్సిక్ రోల్ మోడల్: థియేటర్లో సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియాలో వీడియోలు.. ప్లాట్‌ఫామ్స్ ఎలాగైతే వేర్వేరుగా ఉన్నాయో.. అలానే వాటిని చూసేవాళ్లంతా ఒకే ఉద్దేశంతో లేరు. కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే, మరికొందరు ఏదైనా మెసేజ్ లేదా ఒక స్టోరీ చూడాలనే ఆసక్తితో ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఎప్పుడూ ఏదో కొత్త విషయం ఉంటుంది కాబట్టి పదే పదే ఆ ప్లాట్‌ఫామ్స్‌కి వెళ్తుంటారు. అయితే కొందరు వాటిలోని క్యారెక్టర్స్‌కి ప్రభావితం అవుతుంటారు. మంచి క్యారెక్టర్ అయితే ఇన్స్పైర్ అవ్వడం మంచిదే. కానీ మరోవైపు చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. ఇప్పుడు సొసైటీలో చాలామంది క్రైమ్ ఎలిమెంట్స్‌కు అంటే.. సీరియల్స్, సినిమాలు లేదా సిరీస్‌ల్లో క్రైమ్ సీన్స్, విలన్ పాత్రలకు కనెక్ట్ అవుతున్నారు. వాటిలో రక్తపాతం, ఫైట్స్, గొడవలు, ద్వేషం.. వంటివాటిని గొప్ప విషయంగా చూపించడంతో ఆటోమెటిక్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. అదంతా చాలా నార్మల్ అని, అలా చేస్తే మనల్ని కూడా గొప్పవాళ్లుగా చూస్తారని అనుకుంటున్నారు. ఆ పాత్రలను రోల్ మోడల్‌గా తీసుకుని వాళ్లలా బిహేవ్ చేయాలి అనుకుంటున్నారు. మరికొందరు వాళ్లలోని ఎమోషన్స్‌ని బయటకు చూపించలేక డిజిటల్ ప్లాట్‌ఫాంలో క్రైమ్ చూసి, విలన్ పాత్రల్లో వాళ్లను ఊహించుకుని మానసిక సంతృప్తి పొందుతుంటారు. ఎందుకంటే వాళ్లకు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియదు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది వాళ్ల ఫేస్ చూపించకుండా చెడును పెంచే కంటెంట్ చేస్తుంటారు. పాపులారిటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ మొరాలిటీకి ఇవ్వట్లేదు.
సోషల్ కంపారిజన్ : సోషల్ కంపారిజన్.. వీడియోల్లో రిలేషన్షిప్, పేరెంట్స్, ఫ్యామిలీ.. ఏది చూసినా ప్రతి ఒక్కరూ నూటికినూరు శాతం ఆనందంగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. రియల్ లైఫ్‌లో మాత్రం అలా ఉండేవాళ్లను వేళ్లపై లెక్కించొచ్చు. కానీ వాళ్లను చూసి వ్యూయర్స్..‘‘వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. మన లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు’’ అని వాళ్లలో వాళ్లు ఫీలయిపోతున్నారు. వాళ్ల నిజజీవితంలో ఎలా ఉందో వీళ్లకు తెలియదు. వాళ్లు చెప్పేదాంట్లో ఎంత నిజం ఉందో గ్రహించట్లేదు. మన ఇంట్లో వాళ్లు మనల్ని ఎలా చూస్తున్నారో అనేది పక్కన పెట్టి.. ఇతరులతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నా వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటారు. మనసులో ఏదో పెట్టుకుని మథనపడిపోతుంటారు. ఎవరికీ చెప్పుకోలేని మానసిక వేదన అనుభవిస్తుంటారు.
ఎమోషనల్ బ్యాలెన్స్: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషుల ఆలోచనల్లో కూడా తేడా వచ్చింది. ఇతరుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే కోరుకుంటున్నారు. అలా వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్‌ని బట్టి వాళ్లు ‘ఎంత గ్రేట్, టాలెంటెడ్’ అనే వ్యాలిడిటీ ఇచ్చుకుంటారు. పైగా వీళ్లకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీళ్లు ఊహించినదానికి భిన్నంగా రెస్పాన్స్ వస్తే అస్సలు తట్టుకోలేరు. ప్రతిదానికీ రియాక్ట్ అవ్వాలనుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, ట్రోల్స్‌కు చాలామంది వెంటనే రివర్స్ అవుతుంటారు. అవతలి వాళ్లను ఏదో ఒకటి అనేంతవరకు వాళ్లకు నిద్రపట్టదు. వాళ్ల ఎమోషన్ని ఏదో ఒక రూపంలో బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అయితే వ్యూయర్స్, క్రియేటర్స్‌కి మధ్య ఉండేది వర్చువల్ రిలేషన్ కాబట్టి కామెంట్స్, వీడియోలతో రిప్లయ్ ఇస్తారు. కానీ, అదే నిజజీవితంలోనూ అప్లయ్ చేయాలనుకోవడం తప్పు. ఎందుకంటే వాస్తవానికి మనవాళ్లతోనే మనకు ఇబ్బందులు ఉంటాయి. కొన్ని మనకు నచ్చవు.. అలాగని, వెంటనే ఎమోషనల్ అయిపోవడం వల్ల నలుగురిలో చులకన అవుతారే తప్ప గౌరవాన్ని పొందలేరు. అయితే అందరూ ఇలా ఉంటారని కాదు.. అలా ఉండేవాళ్లు వాళ్ల తీరు మార్చుకోవాల్సిందే అని. కాకపోతే, ఇక్కడ మరో విషయం.. ఎమోషనల్ బ్యాలెన్స్ చేయలేనివాళ్ల వెనక మరో కథ ఉంటుంది. అదేంటంటే.. వాళ్లు అప్పటికే మనసులో ఏదో ఒక బరువును మోస్తూ ఉంటారు. నిరుదోగ్యం, నిరాశ, అసంతృప్తి, ఒత్తిడి ఇలా ఏదో ఒక సమస్యతో నలిగిపోతుంటారు. అలాంటివాళ్లు సడెన్‌గా ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అవ్వడం సహజం. అలాంటివాళ్లను అర్థం చేసుకోవాలే తప్ప, చిన్నచూపు చూడకూడదు.
నో బాండింగ్: ఈ మధ్యకాలంలో వచ్చిన కేసుల్లో ఎక్కువగా యువతే ఉన్నారు. వాళ్లకు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ ఉండట్లేదు. ఫ్యామిలీ అంతా ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరికి సత్సంబంధాలు లేవు. ‘పిల్లలు ఏదో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు అని పేరెంట్స్.. మా ఎంజాయ్మెంట్ మాదే’ అని పిల్లలు.. ‘ఎవరికివారే యుమునాతీరే’ అన్నట్టుంది నేటి సొసైటీ. కానీ, వాళ్లు ఆడే గేమ్స్‌లో గన్స్, ఫైర్, ఫైట్స్ చూసి తెలియకుండానే అగ్రెసివ్ అవుతున్నారు. మాటామాటా పెరిగిందంటే.. చిన్నా పెద్దా అని చూడకుండా అటాక్ చేసేస్తున్నారు. గేమ్స్ ఆడితే అంత అగ్రెసివ్ అవుతారా? అంటే.. అవును. అవతలివాళ్లు గెలుస్తారేమోనని టెన్షన్, తనే గెలవాలి అని కసి.. తనే గ్రేట్ అనిపించుకోవాలి. రివార్డ్స్ అన్నీ తనకే రావాలి అని.. ఇలా ఆలోచిస్తూ గేమ్ ఆడుతుంటారు. అలాంటప్పుడు వాళ్లని నార్మల్‌గా పిలిచినా కోప్పడిపోతుంటారు. ఎందుకు ఇలా? అంటే.. ఇంట్లోవాళ్లు తమ ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవట్లేదు.. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ముందే జడ్జ్ చేసేస్తున్నారని చెప్తారు. ఇదంతా.. పేరెంట్స్‌తో పిల్లలు టైం స్పెండ్ చేయకపోవడం వల్లే!
డిజిటల్ నిరక్షరాస్యత: కొంతమంది పేరెంట్స్‌కి పిల్లల ప్రవర్తన అర్థమైనా.. దాన్నెలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. కారణం ఏంటంటే వాళ్లకు టెక్నాలజీ పట్ల సరైన అవగాహన లేకపోవడమే. టెక్నాలజీని వాడొద్దు అని చెప్పలేరు. ఏది మంచిదో ఏది కాదో చెప్పే బాధ్యత వాళ్లదే కాబట్టి.. ఎలా, ఎందుకు వాడాలో చెప్పొచ్చు. అలాగే ఎప్పుడూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి అతుక్కుపోకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లమనాలి. ఎప్పుడో ఒక సందర్భం ఉంటేనే కలుసుకోవడం కాకుండా.. ఫ్యామిలీ గెట్ టు గెదర్స్ తరచూ జరగాలి. ఇలాంటివన్నీ అలవాటు చేయకపోతే.. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పలేం. అసలే ఈ కాలం పిల్లలకు ఇతరులను హర్ట్ చేయకూడదు అనే ఆలోచన ఉండట్లేదు. ఎవరైనా బాధ పడినా, అందుకు కారణం వాళ్లే అని రిగ్రెట్ ఫీలవ్వట్లేదు.
ఇలా ఉంటే..: ఎప్పుడూ ఏదో బాధలో ఉండడం, ఏదో కోల్పోయినట్టు భావించడం, చిరాకు, రెండు వారాలపాటు ఏమీ తోచని స్థితిలో ఉండడం, తరచూ ఏడవడం, భయపడడం, రోజుల తరబడి ఆకలి లేకపోవడం, నిద్రలేమి, ఎక్కువగా తినడం, నేనెందుకు ఇలా ఉన్నాను? అనే ఆలోచనలు, చేయడం. ఎవరినీ కలవాలని, ఏ పనీ చేయాలని లేకపోవడం. కొందరు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చేస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఏ ఎమోషన్ అయినా తమ చేయి దాటి పోతుంది అనిపించినప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలి. నార్మల్‌గా ఉండేవాళ్ల ఎమోషన్స్‌లో ఒక్కసారిగా భిన్నమైన మార్పు కనిపిస్తే అది మానసిక సమస్య అయ్యే చాన్స్ ఉంది. ఒక్కసారి సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే మీ మనసు ఏం కోరుకుం టుందో తెలుసుకుని దానికి తగ్గట్టు పరిష్కారం చూపిస్తారు. అందుకోసం ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు.
మనసు బాగుంటేనే..: మానసికంగా హెల్దీగా లేకపోతే చాలామందికి అది ఫిజికల్ ప్రాబ్లమ్స్‌కి దారితీయొచ్చు. వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఎవరికీ చెప్పుకోలేక మనసులో పెట్టుకుని బాధపడిపోతుంటారు. అలాంటివాళ్లు మనసువిప్పి మాట్లాడేందుకు కౌన్సిలర్ సిద్ధంగా ఉంటారు. మీలో మీరు ఏదేదో ఆలోచించుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఒక సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ దగ్గర కాసేపు కూర్చుంటే చాలు. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా.. మనకు మనం ఇంపార్టెంట్.
ఇలా చేయాలి: రోజూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. అవతలి వాళ్ల ఎమోషన్ ఏదైనా కానీ, ముందు వినాలి. ఏ రోజు విషయాన్ని ఆరోజే మాట్లాడి తేల్చుకోవాలి. లేదంటే ఆ ఎమోషన్ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. చాలామందికి మెడికేషన్ అవసరం పడకపోవచ్చు. కానీ, ఎవరికైనా ఆ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే.. సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకోవడం మంచిది.
- డా.సోఫీ మాథ్యూ
(పీహెచ్డీ ఇన్ సైకాలజీ) కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, రెనోవా హాస్పిటల్స్
హైదరాబాద్