కరీంనగర్, వెలుగు: బట్టల షాప్ లో అగ్నిప్రమాద ఘటన కేసులో ముగ్గురిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్రీ టౌన్ సీఐ జాన్ రెడ్డి కథనం ప్రకారం.. సంగం రాజేశ్కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మహాలక్ష్మి ఫ్యాషల్ మాల్ నిర్వహిస్తున్నాడు. బిజినెస్ లో నష్టాలు రాగా అప్పుల సమస్య ఎక్కువైంది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. తన వద్ద పని చేసే వర్కర్ రాకేశ్, గుమస్తా మధుతో కలిసి ఈనెల17న ముందు షాపులోని విలువైన బట్టలను బయటకు తరలించారు.
అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఏం తెలియనట్లు రాజేశ్ డయల్100కు ఫోన్ చేసి అగ్నిప్రమాదం జరిగిందని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసినట్టు తేల్చారు. గురువారం రాజేశ్, రాకేశ్,మధును అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.
