ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం

ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. వరదల వల్ల ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా.. 13 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. మృతులకు సంతాపం తెలిపిన సీఎం జయరాం ఠాకూర్ సహాయకచర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. 

కుండపోత వర్షాల కారణంగా చంబా జిల్లాలోని కొండ చరియ ఇంటిపై విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో మండి జిల్లాలో ఒక  అమ్మాయి మృత్యువాతపడగా.. 13 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇంటి నుంచి అరకిలోమీటర్ దూరంలో అమ్మాయి శవం దొరకగా.. గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వరదల కారణంగా పలువురు పలువురు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. భారీగా వర్షపు నీరు చేరడంతో మండి జిల్లాలోని పలు రోడ్లు తెగిపోయాయి. కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి.

అటు ఉత్తరాఖండ్ లోనూ పరిస్థితి దారుణంగా మారింది. వరద నీరు చేరడంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్ జిల్లాలోని రాయ్ పూర్ కుమాల్దా ప్రాంతంలో వరద ఉద్ధృతికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. ప్రసిద్ధి చెందిన తపకేశ్వర్ఆలయంలోకి వరద నీరు చేరింది. పలు గ్రామాల్లో ఇండ్లలోకి బురద చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరినీ సమీపంలోని స్కూళ్లు, పంచాయతీ భవనాల్లో ఆశ్రయం కల్పించారు.