32 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిండు

32 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిండు

భద్రాచలం, వెలుగు: సీఎం కేసీఆర్​ నేనే పెద్ద ఇంజనీర్ ను అని చెప్పుకునే పెద్ద మూర్ఖుడు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రూ.32 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రీడిజైన్ పేరుతో రూ.1.50 లక్షల కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం కట్టేందుకు ఇప్పటికే రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు వరదనీటిలో మునిగిన పంప్​హౌస్​లు, మోటార్ల బాగు కోసం మరింత ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అన్నారు. భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎల్పీ బృందం పర్యటన మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. పోలీసుల నిర్బంధం కొనసాగినా వారి కళ్లుగప్పి అడవుల నుంచి దుమ్ముగూడెం వెళ్లిన సీఎల్పీ బృందం కాన్వాయ్​కు పోలీసులు జీపులు, ట్రాక్టర్లు, కార్లు అడ్డంగా పెట్టి ఆపారు. పోలీసుల తీరుపై నిరసన తెలిపి దుమ్ముగూడెం మండలంలోని సీతమ్మసాగర్​ బ్యారేజీ నిర్మాణ పనులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్​రెడ్డి, సీతక్క, పోరిక బలరాంనాయక్​, పొదెం వీరయ్య, శ్రీధర్​బాబు పరిశీలించారు. తర్వాత భద్రాచలంలో వారు మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించే హక్కు తమకుందని, పోలీసులతో తమను అడ్డుకున్నారని భట్టి విమర్శించారు. ‘కాంగ్రెస్ ఏమైనా నిషేధిత పార్టీయా? జాతీయ పార్టీని, ప్రతిపక్ష పార్టీ లీడర్లను నిర్బంధించడం ఏంటి” అని అన్నారు. తమను అవమానించిన పోలీసుల తీరుపై శాసనసభ, శాసనమండలిలో ఎండగడతామని హెచ్చరించారు. మానవతప్పిదం వల్లనే గోదావరి వరదల్లో అత్యధిక నష్టం జరిగిందని.. సర్కార్​ఫెయిల్యూర్లు బయటపడతాయనే భయంతోనే పోలీసుల సాయంతో తమను అడ్డుకున్నారని చెప్పారు. సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల్లో అవినీతి బయటపడుతుందనే భయంతోనే సీఎల్పీ బృందాన్ని పోలీసుల సాయంతో ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. భద్రాచలం పట్టణం మునగడానికి ప్రధాన కారణం సరైన డ్రైన్ వ్యవస్థ లేకపోవడమేనని, మోటార్లు బిగించి ఎత్తిపోస్తే ముంపు ఉండేది కాదన్నారు. బాధితులకు రాష్ట్ర సర్కార్ పరిహారం ఇవ్వలేదని, పంట నష్టంపై నేటికీ సమగ్ర సర్వే చేయలేదని విమర్శించారు. కేంద్రం కూడా సెంట్రల్ టీంను పంపించి చేతులు దులుపుకుందని ఎటువంటి సాయం మంజూరు చేయలేదని అన్నారు.

రోడ్డుపై సీఎల్పీ ధర్నా.. భారీ ట్రాఫిక్ ​జామ్

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాచలం నుంచి తిరిగి వెళ్తూ.. పోలీసుల తీరుకు నిరసనగా సీఎల్పీ బృందం బూర్గంపహాడ్ మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. పోలీసుల దౌర్జన్యం నశించాలని, సీఎం కేసీఆర్ డౌన్​డౌన్​ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై ధర్నాతో ఖమ్మం–భద్రాచలం, ఖమ్మం–మణుగూరు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పినా శాంతించకపోవడంతో సీఎల్పీ టీంను అదుపులోకి తీసుకొని పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకొని అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.