పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..1,000 కిలోమీటర్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..1,000 కిలోమీటర్లు
  • పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..1,000 కిలోమీటర్లు
  • 30 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరణ
  • అభినందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ/దేవరకొండ( కొండమల్లేపల్లి), వెలుగు:  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భట్టి ఈ యాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజార్​హత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామంలో ప్రారంభించారు. ఆదివారం నాటికి యాత్ర 87 రోజులు పూర్తి చేసుకుంది. దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లికి చేరడంతో వెయ్యి కిలో మీటర్ల మైలురాయిని దాటింది. దీనికి గుర్తుగా గుమ్మడివెల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు.

14 జిల్లాల్లో సాగిన యాత్ర  

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 14 జిల్లాల గుండా సాగింది. బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, ఆలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీన‌గ‌ర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్​నగర్, ప‌రిగి, జడ్చర్ల, నాగర్​కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర కొనసాగింది. మొత్తం 29 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయ్యింది. 

ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న సోయి లేదు

‘‘నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్​బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయించాలన్న సోయిలేని మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి లాంటి లీడర్లు మనకు అవసరమా?”అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రజలను ప్రశ్నించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం రాత్రి కొండమల్లేపల్లికి చేరుకోవడంతో ప్రజలనుద్దేశించి భట్టి మాట్లాడారు. ‘‘బడ్జెట్​లో వెయ్యి కోట్లు కేటాయిస్తే నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్ఎల్​బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. ఒకేసారి రూ.2లక్షల అప్పును మాఫీ చేస్తాం”అని భట్టి అన్నారు. తెలంగాణ ప్రజలు దొరల పాలన నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు. మండుటెండలో భట్టి పాదయాత్ర చేయడం మాములు విషయం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘ఒకప్పుడు తినడానికి తిండి లేని జగదీశ్వర్ రెడ్డి.. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు వెనకేసుకున్నడు. భూములు కబ్జా చేసే నీచమైన బతుకు నీది”అని వెంకట్​రెడ్డి ఆరోపించారు.