పణజి: గోవాలో అగ్నిప్రమాదం జరిగి 25 మంది చనిపోయిన అర్పోరా నైట్‌క్లబ్ యజమానులు లూథ్రా సోదరులకు చెందిన మరో క్లబ్‌ను ప్రభుత్వం కూల్చేసింది. వాగటోర్ బీచ్‌లోని రోమియో లేన్ క్లబ్‌ను మంగళవారం మధ్యాహ్నం అధికారులు బుల్‌డోజర్‌తో నేలమట్టం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. లూథ్రా సోదరులు వారికున్న రాజకీయ సంబంధాలు, ఉన్నతాధికారులతో సాన్నిహిత్యంతో వీటిని అక్రమంగా నిర్మించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్లబ్‌ను ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మించారని, ఫైర్ సేఫ్టీ పర్మిషన్, నిర్మాణ అనుమతులు కూడా లేవని అధికారులు ప్రకటించారు.
సోమవారం లూథ్రా బ్రదర్స్‌కు చెందిన అస్సాగావ్‌లోని ఒక ఆస్తిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం ఘటన తర్వాత గోవా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు 25 మంది మృతికి కారణమైన నైట్క్లబ్అగ్నిప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే దాని ఓనర్లు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా థాయ్‌లాండ్‌కు పరారయ్యారు. దీంతో వీరిపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయింది.

