జీపీ ఎన్నికల నామినేషన్లకు రెడీ

జీపీ ఎన్నికల నామినేషన్లకు రెడీ
  • క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ
  • ఏర్పాట్లు చేసిన అధికారులు

కరీంనగర్‌‌‌‌/ జగిత్యాల,వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రివ్యూలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌‌లో కలెక్టర్ పమేలా సత్పతి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ అధికారులతో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై జగిత్యాల కలెక్టరేట్‌‌లో కలెక్టర్ సత్యప్రసాద్‌‌, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్​ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా నోడల్ అధికారులతో ప్రెస్‌‌మీట్‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల పరిధిలోని 122 జీపీలు, 1,172 వార్డులకు డిసెంబర్11న, డిసెంబర్14న రెండో విడతలో మరో  ఏడు మండలాల పరిధిలోని 144 గ్రామపంచాయతీలు, 1, 276 వార్డులపై, డిసెంబర్‌‌‌‌ 17న మూడో విడతలో ఆరు మండలాలకు చెందిన 119గ్రామపంచాయతీలు, 1, 088 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ప్రభుత్వ ఆఫీసులలో, గ్రామ పంచాయతీల్లో పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. 75సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద మైక్రో అబ్జర్వర్లు నియమించి, సీసీటీవీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 6,07,263 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 2,89,702, మహిళలు 3,17,552 మంది, ఇతరులు 9మంది ఉన్నారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ..

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జీపీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ చెప్పారు. మొదటి ఫేజ్ లో రుద్రంగి మండలంలోని 10 సర్పంచ్ స్థానాలు, 86 వార్డులు, వేములవాడ అర్బన్‌‌లో 11 సర్పంచ్, 104 వార్డులు, 
వేములవాడ రూరల్‌‌లో 17 సర్పంచ్, 146 వార్డులు, కోనరావుపేటలో 28 సర్పంచ్, 238 వార్డులు, చందుర్తిలో19 సర్పంచ్, 174 వార్డులకు.. మొత్తంగా 85 సర్పంచ్, 748 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఈ మండలాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు శిక్షణ, రవాణా, మోడల్ కోడ్ కండక్ట్, ఖర్చు పర్యవేక్షణ, పోస్టల్ బ్యాలెట్, ఎలక్టోరల్ రోల్స్,  ఎన్నికల పరిశీలకులు విషయమై నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం రాజకీయ పార్టీల లీడర్లతో కోడ్ ఆఫ్ కండక్ట్ పై మీటింగ్ నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లాలో.. 

పెద్దపల్లి, వెలుగు: పంచాయితీ ఎన్నికలకు గాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి జిల్లా అధికారులు తెలిపారు. కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతలో 99 సర్పంచ్ స్థానాలకు, 896 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వీటికి సంబంధించి ఈనెల 27న  ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.