గల్లీ గల్లే..ఢిల్లీ ఢిల్లే!..కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్​ ప్రభుత్వం

గల్లీ గల్లే..ఢిల్లీ ఢిల్లే!..కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్​ ప్రభుత్వం
  • ఎన్నికల వరకే రాజకీయం.. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం
  • గత బీఆర్​ఎస్​​ సర్కార్​కు భిన్నంగా ముందుకు
  • రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్న సీఎం, మంత్రులు
  • ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు వినతులు 
  • మొన్న రోడ్లు.. నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్టులు
  • కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం.. తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు : రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని చెప్పిన రేవంత్‌‌ సర్కార్​.. ఆ దిశగానే ముందుకుపోతున్నది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నది. వివిధ రంగాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వీలుచేసుకొని మరీ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను సీఎం, రాష్ట్ర మంత్రులు కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడి పరిస్థితులను వివరించి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా విషయంలో గత బీఆర్​ఎస్​ సర్కార్‌‌‌‌కు భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 

భేషజాలు పక్కనపెట్టి..

ఇటీవల సుమారు వారం రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి పార్టీ వ్యవహారాల కంటే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చారు. జూన్​ 24న రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ను కలిసిన ఆయన..  హైదరాబాద్‌‌లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‌‌లో సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. అదేరోజు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌‌‌‌లాల్ ఖట్టర్‌‌‌‌ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి..

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.7 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. తమ ప్రభుత్వానికి భేషజాలేమీ లేవని, కేంద్రం పెట్టిన రూల్స్‌‌కు తగ్గట్టుగానే ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామని కేంద్ర మంత్రిని కన్విన్స్ చేయడానికి సీఎం ప్రయత్నించారు. గతంలో కేటాయించిన నిధుల్లో నుంచి రూ. 1,605 కోట్లు రావాల్సి ఉన్నదని, వాటిని కూడా విడుదల చేయాలన్నారు. 

ఇక స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందున వచ్చే ఏడాది జూన్ వరకూ మిషన్ కాలపరిమితిని పొడిగించాలని ఖట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రేవంత్‌‌‌‌‌‌‌‌ విన్నవించారు. ఈ మిషన్ కింద కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌లో చేపడ్తున్న పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఆ తర్వాత రోజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాను కలిసిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌.. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్​హెచ్​ఎం) కింద రావాల్సిన రూ.693 కోట్ల బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం హాస్పిటళ్లకు బ్రాండింగ్ చేశామని మంత్రికి రేవంత్‌‌‌‌‌‌‌‌ వివరించారు.

గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం నిబంధనలను పాటించకపోవడం, కేంద్ర నిధులతో చేపట్టిన పనులను కూడా నాడు రాష్ట్ర సర్కార్ ఖాతాలో వేసుకోవడంతో రావాల్సిన నిధులను కేంద్రం ఆపేసింది. అయితే.. ఈ నిధులు ఆగిపోవడంపై సీఎం రేవంత్  ఆరా తీసి.. ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం నిబంధనల మేరకు హాస్పిటళ్లకు బ్రాండింగ్ చేశారు. కాగా,  జూన్​ 27న కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిల బృందం కలిసింది.  

రిజినల్​ రింగ్​ రోడ్డు (ఆర్​ఆర్​ఆర్​)‌‌‌‌‌‌‌‌ సౌత్ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌–విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించాలని.. జగిత్యాల–పెద్దపల్లి–కాటారం రోడ్డును నేషనల్‌‌‌‌‌‌‌‌గా హైవేగా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న హైవేల నిర్మాణానికి, కొత్త హైవేల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా..!

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ తొలి టర్మ్‌‌‌‌‌‌‌‌లో కేంద్రంలోని బీజేపీతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆ తర్వాత పొలిటికల్‌‌‌‌‌‌‌‌గా యూటర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. కేంద్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల లీడర్లను కలిశారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లేని కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే, ఈ రాజకీయాలను పాలనతో కేసీఆర్​ ముడిపెట్టారు. తొలి టర్మ్‌‌‌‌‌‌‌‌లో మోదీతోనే మిషన్ భగీరథ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభింపచేసిన కేసీఆర్.. రెండో టర్మ్‌‌‌‌‌‌‌‌లో మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఆయన ముఖం చాటేశారు.

ఇందుకు రకరకాల కారణాలను కేసీఆర్​ చెప్పుకొచ్చారు. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వాళ్లు కూడా ప్రధాని తమ రాష్ట్రాలకు వస్తే ఆయన్ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనులపై విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ, నాడు సీఎం హోదాలో కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం నిర్వహించిన వివిధ సమావేశాలకు కూడా ఆయన వెళ్లలేదు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సీఎం రేవంత్​రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రధాని రాష్ట్ర పర్యటనకు రాగా.. ఆయనను కలవడంతో పాటు, రాష్ట్రాలకు ప్రధాని పెద్దన్నలాంటి(బడేభాయ్​) వారని సీఎం రేవంత్​రెడ్డి సంబోధించారు. అయితే.. దీన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసింది. రేవంత్‌‌‌‌‌‌‌‌ బీజేపీలోకి వెళ్తున్నారంటూ, అందుకే మోదీని బడే భాయ్ అని సంబోధించారంటూ బీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్​ నేతలు స్ట్రాంగ్​గా తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాల్సిందేనని, ఈ విధానానికి ఒంటెత్తుపోకడలతో గత బీఆర్​ఎస్​ సర్కార్​ స్వస్తి చెప్పడంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని అన్నారు.

కనీసం కేంద్రం నిర్వహించే మీటింగ్​లకు కూడా నాడు సీఎం హోదాలో కేసీఆర్​ వెళ్లేవారు కాదని, ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని తెలిపారు. అలాంటి నష్టం రానివ్వబోమని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మర్యాదపూర్వకంగా కలుస్తామని, అదీ కాకపోతే  కొట్లాడేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, మిగిలిన సమయంలో కేంద్రంతో పాలనపరమైన సంబంధాలను కొనసాగిస్తామని మొదటి నుంచి చెప్తున్న సీఎం రేవంత్​రెడ్డి..  లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తెలంగాణతోపాటు, అనేక రాష్ట్రాల్లో మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఎన్నికల ప్రచారంలో ఆయన నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పక్కనబెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలుస్తూ అభివృద్ధి పనులను, నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఫలిస్తున్న ప్రయత్నాలు

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. జీహెచ్‌‌ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనానికి ఆమోదం తెలుపుతూ రెండ్రోజుల కిందట్నే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కంటోన్మెంట్ విలీన ప్రక్రియపై సీఎం రేవంత్ వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత రక్షణశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశారు. ఈ ఎఫర్ట్స్‌‌తో..

ఎంతోకాలంగా పెండింగ్‌‌లో ఉన్న విలీన ప్రక్రియకు శుభంకార్డు పడింది. సీఎం రేవంత్‌‌ విజ్ఞప్తితో స్మార్ట్ సిటీ పనుల గడువును కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. హైవేల విస్తరణ, కొత్త హైవేల గుర్తింపుపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తితో బొగ్గు గనులను నేరుగా సింగరేణికే కేటాయించే విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డి హామీ ఇచ్చారు.

సీఎంగా పగ్గాలు చేపట్టిన 20 రోజుల నుంచే

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 20 రోజుల్లోనే ప్రధాని మోదీని రేవంత్​రెడ్డి కలిశారు. నిరుడు డిసెంబర్ 26న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో గంటపాటు భేటీ అయ్యారు.  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని...

అందులో భాగంగా పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. ఐఐఎం, సైనిక్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని అడిగారు.  నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేస్‌‌‌‌‌‌‌‌ అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ కోసం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని.. వాటి కూడా వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రులు కూడా..!

రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల వెంట పడుతున్నారు. జూన్​ 24న కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కలిశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్‌‌‌‌‌‌‌‌రోడ్డు, హైదరాబాద్–విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించడం కోసం నిధులు విడుదల చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉప్పల్–ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్ ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసి, కొత్త టెండర్లు పిలిచి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరగా.. గడ్కరీ ఇందుకు వెంటనే ఓకే చెప్పారు. అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్​ 26న కేంద్ర పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి సీతక్క.. రాష్ట్రంలోని 6,176 గ్రామ పంచాయతీ భవనాలకు గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీమ్ కింద రూ.1,544 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ కింద పది లక్షల ఇండ్లకు మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు.

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సిమెంట్ ఫాక్టరీని పునరుద్ధరించి, స్థానికులకు ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కోరారు. జూన్​ 28న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్​బాబు విజ్ఞప్తి చేశారు.