సిసోడియా సేవలను తల్చుకున్న సీఎం.. కంటతడి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్

సిసోడియా సేవలను తల్చుకున్న సీఎం.. కంటతడి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌‍లెన్స్ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వోగానికి గురయ్యారు. విద్యారంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని ఆయన కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలులో పెట్టించిందని, ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే బీజేపీ జైలులో పెట్టించేది కాదని కేజ్రీవాల్ అన్నారు. విద్యారంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారన్న ఆయన..  విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తాము తెరపడనీయమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విద్యారంగానికి సిసోడియా చేసిన  సేవలను, కృషిని గుర్తుచేసుకుంటూ ఒక్కసారిగా సీఎం ఉద్వేగానికి లోనయ్యారు. విద్యారంగాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలనేది మనీష్ కల అని, దేశరాజధానిలోని పిల్లలందరికీ మంది విద్యను అందించాలని ఆయన కోరుకునే వారని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలజీ కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును సైతం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్యా బెయిలుకు నిరాకరించింది.

https://twitter.com/ANI/status/1666351967537623041