సచిన్ పైలెట్ తండ్రిపై బీజేపీ ఆరోపణలు.. ఖండించిన గెహ్లాట్

సచిన్ పైలెట్ తండ్రిపై బీజేపీ ఆరోపణలు.. ఖండించిన గెహ్లాట్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ సోషల్ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ. రాజేష్ పైలెట్, సురేష్ కల్మాడీలపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

ఏయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసే సమయంలో రాజేష్ పైలెట్, సురేష్ కల్మాడీ1966 మార్చి 5వ తేదీన మిజోరాంలోని ఐజ్వాల్ లో బాంబు దాడి జరిపారని అమిత్ ఆరోపించారు. ప్రతిఫలంగా అనాడు ఇందిరాగాంధీ ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలు చేసిన బీజేపీ నేత అమిత్ పై మండిపడ్డారు సచిన్ పైలెట్. 

ఈ ఇష్యూ రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. బీజేపీ నేత అమిత్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.  భారత వైమానిక దళానికి సేవలు చేసినవారిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇలా ఆరోపణలు చేయడమంటే ఏయిర్ ఫోర్స్‌ సేవలను అవమానించడమేనని చెప్పారు.  కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలెట్ ధైర్యవంతుడైన పైలెట్ అని అన్నారు. అమిత్ చేసిన ఆరోపణలను దేశం మొత్తం ఖండించాల్సిన అంశమని చెప్పారు.

సచిన్ పైలెట్ కు మద్దతుగా సీఎం అశోక్ గెహ్లాట్ నిలవడంపై కాంగ్రెస్ లో ఐక్యత స్పష్టంగా కనిపిస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ కలిసిపోయారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో అంతర్గతంగా గొడవలు ఉన్నా.. ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తే మాత్రం ఐక్యంగా పోరాడుతున్నారనే సంకేతాన్ని ఇచ్చారు.