
కడపలో టీడీపీ మహానాడు ప్రతినిధుల సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సంచలన డిమాండ్ చేశారు. రూ. 500 నోట్లను రద్దు చేయాలని అన్నారు చంద్రబాబు. డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగిన నేపథ్యంలో అన్ని పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. గతంలో కేంద్రం డీమానెటైజేషన్ చేపట్టిన సందర్భంలో డిజిటల్ కరెన్సీపై ప్రధాని మోడీకి ఒక రిపోర్ట్ సమర్పించానని.. రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని.. కొత్తగా తెచ్చిన రూ. 2 వేల నోట్లను కూడా రద్దు చేయాలని సూచించానని అన్నారు చంద్రబాబు.
ఏపీలో అవినీతిని అరికట్టేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని.. ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్ తో పని జరుగుతోందని అన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా నివేదిక ఇస్తున్నారని అన్నారు. దేశ ఆర్థిక విధానంలో పారదర్శకత అవసరమని అన్నారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని.. వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలని మహానాడు వేదికగా కేంద్రాన్ని మరోసారి కోరుతున్నానని అన్నారు.
►ALSO READ | తిరుమల కొండ కిటకిట: మెట్లమార్గం భక్తులకు మజ్జిగ పంపిణి
అలా జరిగితే.. పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని.. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం కూడా ఉండదని అన్నారు. ప్రజాసేవే పరమావధిగా పని చేయాలని సూచిస్తూ పెద్ద నోట్ల రద్దు విషయంలో అందరూ తనతో ఏకీభవించాలని కోరారు. అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్దనోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగిపోతుందని, దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలని కోరారు చంద్రబాబు.