
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ( అక్టోబర్ 23 ) రాష్ట్రలో కురుస్తున్న వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు ఎస్పిలతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని అధికారులకు సూచించారు.ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని అన్నారు. దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు వివరించారు కలెక్టర్లు.
కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని అన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని.. పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.