మధిర, వెలుగు: రెండవ విడత సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఆదివారం మధిర నియోజకవర్గంలో పలు క్లస్టర్లలో ఉత్సాహంగా పోటీలు నిర్వహించారు. మధిర పట్టణం, ఎర్రుపాలెం, చింతకాని మండలం కొదుమూరు కేంద్రాల్లో మొదటి విడత గ్రామీణ క్లస్టర్ పోటీలు జరిగాయి.
మధిరలో జరిగిన పోటీలను జిల్లా యువజన సంక్షేమ అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తాహసీల్దారు రాళ్ల బండి రాంబాబు, ఎంఈఓ ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడలు యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఐదు అంచల్లో గ్రామీణ , మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పోటీలు నిర్వహిస్తోందన్నారు.
ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులను గ్రామీణ క్లస్టర్ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించాక జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా స్థాయి పోటీలు అనంతరం వారిని రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పారు. కార్యక్రమంలోస్పోర్ట్స్ అథారిటీ అధికారి రాజ్ వీర్, ప్రజా సంబంధాల అధికారి సురేశ్, ఎస్ జీఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి చిన్ని, ఫిజికల్ డైరెక్టర్లు చైతన్య , రవి, నరసింహారావు, సైదులు, స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు గౌస్ దీపక్, శ్రీనివాస్ సోహెల్, నిరీక్షన్, సునీల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
