తల్లిదండ్రులకు దూరం అయిన రెండేళ్ల అరిహా.. అసలు అరిహా కేసు ఏంటీ

తల్లిదండ్రులకు దూరం అయిన రెండేళ్ల అరిహా.. అసలు అరిహా కేసు ఏంటీ

దేశం కానీ దేశంలో చిక్కుకుపోయిన కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. జర్మనీలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి అరిహా షా కోసం తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. అరిహా షాను దక్కించుకునేందుకు తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా..ఫలితం లేకుండా పోతుంది.  తాజాగా అరిహా షా తమ అప్పగించేలా సాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు  భావేష్ షా, ధారా షా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలిశారు. ఈ కేసును ప్రత్యక్షంగా కలిసి వివరించేందుకు అరిహా షా తల్లిదండ్రులకు  అపాయింట్ మెంట్ ఇవ్వాలని  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్కు షిండే లేఖ రాశారు. మహారాష్ట్ర సీఎం లేఖతో అరిహా షా తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. 

లేఖలో ఏముంది..

జర్మనీ నుంచి 10 రోజుల క్రితం ముంబై చేరుకున్న అరిహా షా తల్లిదండ్రులు భావేష్ షా, ధారా షా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలిశారు. అరిహా షా  కేసు గురించి వివరించారు. అరిహా షా తల్లిదండ్రుల బాధను, ఆవేదనను ఆర్థం చేసుకున్న ఏక్ నాథ్ షిండే విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు. అరిహా షా తల్లిదండ్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు. 

వీసా గడువు ముగియబోతుంది..

జర్మనీలో  అరిహా షా ప్రస్తుతం  అనాథాశ్రమం సంరక్షణలో ఉంది. అయితే అక్కడ తన పాప ఎలాంటి వ్యక్తులతో ఉంటుందో అని భయమేస్తుందని అరిహా షా తల్లి ధారా షా ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో రెండు నెలల్లో తమ జర్మన్ వీసా గడువు ముగుస్తుందని..ఈలోగా అరిహా కేసు ప్రక్రియను వేగవంతం చేయకపోతే అక్కడి ప్రభుత్వం అరిహా శాశ్వతంగా కస్టడీలోనే ఉండిపోతుందంటూ కన్నీరు మున్నీరవుతోంది. అందుకే భారత ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించేందుకు ఇక్కడకు వచ్చామని వెల్లడించింది. 

బేబీ అరిహా కేసు ఏంటి

గుజరాత్  అహ్మదాబాద్ కు  చెందిన  భావేష్ షా, ధారా షా జర్మనీలో ఫోస్టర్ కేర్‌లో నివసిస్తున్నారు. వీరి కూతురు 7 నెలల అరిహా షా.  2021 సెప్టెంబర్ లో  అరిహా ప్రైవేట్ పార్ట్ దగ్గర రక్తం కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు పాపను స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే ఆమెను పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వారి చికిత్స చేసినప్పటికీ..ఇది లైంగిక వేధింపుల కేసు అని పిల్లల సంరక్షణ బృందానికి డాక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో జర్మనీ చెల్డ్ సర్వీసెస్ అధికారులు 7 నెలల అరిహా షాను తల్లిదండ్రుల నుంచి తీసేసుకుని.. బెర్లిన్‌లోని అనాథ శరణాలయానికి పంపారు. 

అరిహా షాను పెంచే సమర్థతో విఫలం..

అరిహా షాను దంపతులు వెనక్కి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. సెంబర్ 2021లో పాపపై లైంగిక వేధింపుల అనుమానాలాను ఆ ఆసుపత్రిలోని వైద్యులు తోసిపుచ్చిన రిపోర్టును  పోలీసులు తీసుకున్నారు. ఈ కేసులో మరింత స్పష్టత కోసం తల్లిదండ్రుల డీఎన్ఏ పరీక్ష, పోలీసు విచారణ, వైద్య నివేదికలు అన్నీ తల్లిదండ్రులకు అనుకూలంగా వచ్చాయి. దీంతో  అరిహా షాపై  లైంగిక వేధింపుల కేసును ఫిబ్రవరి 2022లో అక్కడి పోలీసులు  మూసేశారు. ఈ ఆధారాలతో ఆ దంపతులు జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులను కలిశారు. అయితే వారు ఆ పాపను ఇవ్వకపోగా తిరిగి దంపతులపైనే  కేసు నమోదు చేశారు. దీనిపై అరిహా షా తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. అయితే అరిహా షాను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని న్యాయస్థానం వారిని ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో సైకాలజిస్టు పాప తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడంతో అరిహా షాను తల్లిదండ్రులు పొందలేకపోయారు. 

ప్రతీ నెల గంట పాటు..

జర్మనీలో ఉన్న తమ పాప అరిహా షాను కలిసేందుకు ప్రతి నెల గంట పాటు అనుమతిస్తున్నారు తల్లి ధారా షా పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో అరిహాషాను భారత్‌లోని పేరెంట్ చైల్డ్ కేంద్రానికి తీసుకురావాలని ప్రధాని మోదీకి అరిహాషా తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. మరి అరిహా షా కేసు విషయంలో ఏం జరగనుంది..కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని అరిహాషాను వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటుందా అని ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.