ప్రాజెక్టుల పేరుతో సీఎం ఫ్యామిలీ లక్షల కోట్లు తిన్నది : కోదండరాం

ప్రాజెక్టుల పేరుతో సీఎం ఫ్యామిలీ లక్షల కోట్లు తిన్నది :  కోదండరాం
  • గ్రీన్ ​ఫీల్డ్​ హైవేపై కలెక్టర్​ నివేదిక ఆధారంగా డిజైన్​ మార్చాలని డిమాండ్

పరకాల/హుజూరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్​ విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోపిడీచేసి అప్పుల పాలు చేశారని టీజేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్​ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నదని ఆయన విమర్శించారు. శనివారం హన్మకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్​ అభ్యర్థి రేవూరి ప్రకాష్​రెడ్డితో కలిసి ప్రెస్​మీట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ నాణ్యతాలోపం మూలంగానే కాళేశ్వరం దెబ్బతిన్నదని, నాణ్యతలేని పైపులు వాడడం వల్లే మిషన్​ భగీరథ ఇబ్బందులు పెడుతోందన్నారు. వనరుల దోపిడీ, అడ్డగోలుగా ఇసుక దందా, ధరణి పేరుతో భూ సెటిల్ మెంట్లు రాష్ట్రంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి తెచ్చి సర్కారు తప్పులు చేసిందని, కరెక్షన్​ కోసం ప్రజలను డబ్బులు కట్టాలని అడగడమేందని ఆయన ప్రశ్నించారు. గ్రీన్​ఫీల్డ్​హైవే భూనిర్వాసిత రైతులు ప్రాజెక్టు వద్దని ఫిర్యాదు చేస్తే ఎన్విరాన్​మెంట్​ డిపార్ట్​మెంట్​ కలెక్టరును నివేదిక అడిగిందని, కలెక్టర్​ ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రీన్​ఫీల్డ్​ డిజైన్​ మారుతుందన్నారు. భూ నిర్వాసిత రైతులకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కేసీఆర్​ పాలన నుంచి విముక్తి రావాలనే కాంగ్రెస్​ పార్టీకి తాము మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. పరకాలలో ప్రధాన వ్యవసాయ కేంద్రం విధ్వంసం అవుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు దిక్కులు చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ సర్కారులో  ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని, మంత్రుల చేతిలో ఎలాంటి అధికారాలు లేవన్నారు. నిరుద్యోగ సమస్యపై ర్యాలీకి ప్రయత్నిస్తే తన ఇంటి తలుపులు పగులగొట్టి అర్ధరాత్రి పోలీసులతో అరెస్టు చేశారని ఫైర్  కోదండరాం అయ్యారు.  చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, సీనియర్​ నాయకులు కొలుగూరి రాజేశ్వర్​రావు, టీజేఎస్​ నాయకులు పాల్గొన్నారు.

ఉద్యమ ఆకాంక్షను కేసీఆర్ మరచిపోయిండు

ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్​ ఎప్పుడో మరిచిపోయారని, అధికారం కోసం ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారని కోదండరాం విమర్శించారు. హుజూరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్  అన్నీ తానై వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ భూమిపై ఎవరినైనా కలవచ్చు కానీ కేసీఆర్‌‌ను కలవలేం. రాష్ట్రంలో  మూడువేల స్కూళ్లను బీఆర్ఎస్  సర్కారు మూసేసింది. ఉన్న హాస్పిటళ్లలో సరైన వైద్యం కూడా అందడం లేదు. ఊరూరికి  బెల్ట్ షాప్ లు పెట్టి జనాలకు తాగుడు అలవాటు చేసిన ఘనత కేసీఆర్​ ప్రభుత్వానికే దక్కుతుంది. కేసీఆర్ కుటుంబం ప్రశ్నపత్రాలు అమ్ముకోవడం వల్లే ప్రవళిక ఆత్మహత్యకి పాల్పడింది. ప్రేమ విఫలమై ఆమె ఆత్మహత్యకి పాల్పడిందని కేటీఆర్ చెప్పటం సిగ్గుచేటు” అని కోదండరాం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒడితెల ప్రణవ్ మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ, రద్దు చేస్తూ నిరుద్యోగులను కేసీఆర్  ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. తమకు టీజేఎస్  మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.