సభలో సీఎం సభ్యత లేకుండా మాట్లాడుతున్నరు

సభలో సీఎం సభ్యత లేకుండా మాట్లాడుతున్నరు
  • గవర్నర్​నూ అవమానిస్తున్నరు.. ఇదేనా మీ సంస్కారం? 
  • మీరు మాట్లాడితే మంచి భాష.. ఇతరులైతే చెడు భాషనా? 
  • ఈటలను సభలోకి రానివ్వకుండా ఫాసిస్టులా వ్యవహరిస్తున్నరు 
  • నేను రాష్ట్ర సర్కారుకు ఎన్ని లేఖలు రాసినా జవాబియ్యలె 
  • నీకు దురద పెడితే గోక్కో.. ఇతరులను గోకొద్దంటూ సెటైర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నుంచి ఎవరినైనా సస్పెండ్ చేయాల్సి వస్తే ముందుగా సీఎం కేసీఆర్ నే చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నందుకు ఆయనను సభ నుంచి శాశ్వతంగా పంపించివేయాలన్నారు. కేసీఆర్ ఏమాత్రం శాసన సభ సంప్రదాయాలను పాటించడం లేదని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు మాట్లాడితే మంచి భాష.. ఈటల రాజేందర్, బండి సంజయ్ మాట్లాడితే చెడు భాషనా?” అంటూ కేసీఆర్​ను కిషన్​రెడ్డి ప్రశ్నించారు. ఈటలను సభలో రానివ్వకుండా, మాట్లాడనివ్వకుండా ఫాసిస్టులా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈటలను చూడడం ఇష్టం లేకపోతే కేసీఆరే సభను బహిష్కరించాలన్నారు. ఈటల ఆత్మగౌరవాన్ని, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈటల కుటుంబసభ్యులను ఇబ్బందులు పెట్టేందుకు, ఆయన వ్యాపారాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సభలో ఎవరేం మాట్లాడారో సమీక్షించి చర్యలు తీసుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన  కేసీఆర్ ను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు.

కేసీఆర్ ను మించిన ఫాసిస్టు లేరు.. 

కేసీఆర్​ను మించిన ఫాసిస్టు, నియంత, అప్రజాస్వామికవాది మరొకరు లేరని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ముందు మీరు సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గవర్నర్​ను అవమానిస్తున్నారు. మీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఇదేనా మీ సభ్యత, సంస్కారం?” అని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘‘అధికార దాహంతో అందరినీ గోకుతున్నావు. నీకు దురద పెడితే  గోక్కో. అంతే తప్ప ఇతరులను గోకే ప్రయత్నం చేయవద్దు” అంటూ సెటైర్ వేశారు. టీఆర్ఎస్ సర్కార్ చర్యలు కక్ష సాధింపులకు నిదర్శనమని విమర్శించారు. ‘‘ఈడీ, సీబీఐ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు, దీంతో సానుభూతి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వేల కోట్ల అప్పులు, అధికార దుర్వినియోగం చేస్తూ పాలన చేస్తున్నారు. తెలంగాణ ఏమైనా నీ జాగీరా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ.. ఎందులో మోడల్?

ఏ విషయంలో దేశానికి తెలంగాణ మోడల్ అని కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పులపాలు చేయడం, మద్యం ఏరులై పారడం, ప్రధానిని, గవర్నర్ ను అవమానించడం, కుటుంబ పాలన చేయడం తెలంగాణ మోడలా? అని ప్రశ్నించారు. ‘‘హాస్టళ్లలో ఉండాల్సిన విద్యార్థులు హాస్పిటళ్లలో ఉంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది” అని అడిగారు. 75 ఏండ్ల తర్వాత కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. ఈ నెల 15,16,17 తేదీల్లో గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 

అధికారం కోసమే కేంద్రంపై అబద్ధాలు.. 

‘‘బీజేపీని దేశం నుంచి తరిమికొట్టే అధికారం మీకెక్కడిది? దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ మాది. మీరు మమ్మల్ని దేశం నుంచి పంపించివేస్తారా?” అంటూ కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం వచ్చిన వెంటనే దళితులకు వెన్నుపోటు పొడిచారని, మోటార్లకు మీటర్లంటూ కేంద్రంపై అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర గెజిట్ లో మోటార్ల కు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. డిస్కంలు బాగుండాలని, బకాయిల లెక్కలు తేల్చాలనే కేంద్రం గెజిట్ ఇచ్చిందన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తుంటే, తామెందుకు వద్దంటామని ప్రశ్నించారు.  మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం.. కేసీఆర్ 
స్వార్థానికి దివాలా తీసిందని, ఆయన ఇంకొన్ని రోజులు సీఎంగా ఉంటే ఉద్యోగులకు జీతాలు కూడా రావని విమర్శించారు.