కేంద్రంతో లడాయి చేయండి..టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ డైరెక్షన్

కేంద్రంతో లడాయి చేయండి..టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ డైరెక్షన్
  • అనేక విషయాల్లో  సహకరించినావివక్ష చూపుతోంది
  • ఇంతకాలం ఓపికతో ఎదురుచూసినం.. ఇక సహనం పోయింది
  • జల వివాదాలను పరిష్కరించాలని కోరినా స్పందన లేదని విమర్శ

హైదరాబాద్, వెలుగుపార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయాలని టీఆర్​ఎస్​ ఎంపీలకు పార్టీ చీఫ్​, సీఎం కేసీఆర్  పిలుపునిచ్చారు. కేంద్రానికి అనేక విషయాల్లో సహకరించినా వివక్ష చూపుతోందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీలతో గురువారం కేసీఆర్  ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఏఏ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలో ఆయన వివరించారు. నిధుల విడుదలలో, హామీల అమలులో కేంద్రం వివక్ష చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఇంతకాలం ఓపికతో ఎదురు చూసినం. ఇక సహనం పోయింది. అందుకే పార్లమెంట్​లో ధ్వజమెత్తాలి. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అనేకసార్లు లెటర్లు రాసినా కేంద్రం నుంచి స్పందన లేదు. అందువల్లే కృష్ణా జల వివాదానికి  పరిష్కారం లభించడం లేదు” అని సీఎం అన్నారు. జీఎస్టీలో చేరడం వల్ల ఏటా రాష్ట్రం రూ. 10 వేల కోట్లు నష్టపోతున్నదని చెప్పారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, జీఎస్టీ బకాయిల విడుదల కోసం పార్లమెంట్​లో గట్టిగా అడుగాలని ఎంపీలను ఆదేశించారు.

పార్లమెంట్​లో హంగామా చేస్తం: కేకే

ఇంతకాలం ఓపికతో ఉన్నామని, ఇప్పట్నించి పార్లమెంట్ లో హంగామా చేస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రకటించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారాన్ని కేంద్రం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను కేకే మీడియాకు వివరించారు. కేంద్రంతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాల్సి ఉంటుందని,  దీన్ని రాష్ట్ర బీజేపీ స్వాగతిస్తుందా? అని కేకే ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్​లో తాము చేసే పోరాటానికి రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసి రావాలని ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో  క్వశ్చన్​ అవర్​ను తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు.