హుజురాబాద్ కు రూ.1500కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు

హుజురాబాద్ కు రూ.1500కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు
  • ‘దళిత బంధు’ స్కీంను ప్రకటించిన సీఎం కేసీఆర్​
  • పైలట్​ ప్రాజెక్టుగా హుజూరాబాద్​ నియోజకవర్గం ఎంపిక
  • ఈ సెగ్మెంట్​లో 20,929 కుటుంబాలకు రూ. 2 వేల కోట్లు
  • పథకం అమల్లో అలసత్వం వహిస్తే సహించబోమని అధికారులకు హెచ్చరిక

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..

ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే  ఆధారంగా దళిత బంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. తమ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4346,  వీణవంకలో 3678 , జమ్మికుంటలో 4996 , ఇల్లందకుంట మండలం లో 2586 కుటుంబాలు..  మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లను ప్రకటించామని, పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్​ నియోజకవర్గానికి రూ. 1500 కోట్ల నుంచి 2 వేల కోట్లు ఇస్తామని ఆయన చెప్పారు. దీని ప్రకారం 20,929 కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులను తీసేస్తే ప్రతి ఫ్యామిలీకి రూ.10 లక్షల చొప్పున లబ్ధి చేకూరనుంది.

హుజూరాబాద్​కు ఇప్పటికే రూ. 365 కోట్లు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న రూలింగ్​పార్టీ  నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్నేళ్లుగా మూలనపడ్డ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు ఇటీవలే ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఇక హుజూరాబాద్ పట్టణానికి రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.30 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​ మంజూరు చేశారు. ఇప్పటికే సీసీరోడ్లు, డివైడర్లు, చౌరస్తాల బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు వివిధ గ్రామాల్లో తిరిగి కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాల భవనాలు, ఫంక్షన్​హాళ్లు,  సీసీ రోడ్లు శాంక్షన్​ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయా అభివృద్ధి పనులకు సుమారు రూ. 300 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు. దీంతోపాటు అత్యధిక మందిని ప్రభావితం చేసేలా కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు మరోసారి అప్లికేషన్లు తీసుకుంటున్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1,200 కోట్లతో అమలైతది. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా ఈ స్కీమ్​ను అమలు చేస్తం. ఇందుకోసం అదనంగా మరో రూ. 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు  హుజూరాబాద్​లో ఖర్చు చేస్తం.
- సీఎం కేసీఆర్