కేసీఆర్ ఢిల్లీకి పోయేది చీకటి ఒప్పందాలకే

కేసీఆర్ ఢిల్లీకి పోయేది చీకటి ఒప్పందాలకే

జనగామ​, వెలుగు : ఢిల్లీ లిక్కర్ దందాలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఊరికే ఢిల్లీకి పోతే రాజకీయ చర్చ కోసం అనుకున్న. పంజాబ్‌‌కు కూడా పోతే అక్కడ రైతులకు మూడు లక్షలు ఇస్తడనుకున్న.. కానీ ఆయన పోయింది పంజాబ్‌‌ల కూడా లిక్కర్ సిండికేట్‌‌ను ఏర్పాటు చేసి తన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకేననే అనుమానాలు కలుగుతున్నాయి. తన కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపులు ఇప్పించేందుకు.. వాటాలు పొందేందుకే ముఖ్యమంత్రి తరచుగా ఢిల్లీ పర్యటనలు పెట్టుకుంటున్నట్లు అనిపిస్తున్నది” అని ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌‌పూర్ మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ పాయింట్ వద్ద సోమవారం సాయంత్రం మీడియాతో సంజయ్ మాట్లాడారు.

సీఎం తరచుగా ఢిల్లీ, బెంగాల్, పంజాబ్‌‌కు వెళ్లేది చీకటి ఒప్పందాల కోసమేనన్నారు. సీబీఐ విచారణలో అన్ని బయటకు వస్తాయని, లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ మూడో కూటమి ‘లిక్కర్ ఫ్రంట్’ అని ఎద్దేవా చేశారు. లిక్కర్ దందాలో సీఎం ఫ్యామిలీతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయని చెప్పారు. ‘‘ఈడీ అంటేనే కేసీఆర్‌‌‌‌కు భయమైతాంది. రాత్రంతా ఈడీ.. ఈడీ అంటున్నడట.. పది పెగ్గులేసి ఐదు రగ్గులు కప్పుకుని పంటున్నడట. డ్రగ్స్ దందాలో వీళ్లే.. ప్రతి దందాలో వీళ్ల కుటుంబ సభ్యులే”అని  ఆరోపించారు.

కేసీఆర్ సమాధానం చెప్పాలె

‘‘ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్‌‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాను కలిశారా, లేదా? లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయిన్రా లేదా? రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రా రెడ్డి, సృజన్ రెడ్డి, అభిషేక్, చరణ్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిచయమా కాదా? అనే విషయాలపై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలి” అని సంజయ్​ డిమాండ్ చేశారు. దొంగ దందాలన్నీ బినామీల పేరిట చేస్తరని ఆరోపించారు. ‘‘ఇక్కడ లిక్కర్ తయారు చేసి పంజాబ్ పంపుతరు.. అక్కడి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరు. అదలు బదలు లెక్క దొంగ దందా చేస్తున్నరు” అని మండిపడ్డారు. హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కవిత ఇంటిదగ్గర నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసు పెడ్తారా అని ప్రశ్నించారు. దీనిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ లీడర్లకూ సంబంధం

లిక్కర్ దందాలో కాంగ్రెస్ నాయకులకూ సంబంధం ఉందని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్‌‌లో గెలిచి టీఆర్ఎస్‌‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే అల్లుడు ఈ స్కామ్‌‌లో ఉన్నాడని, విచారణ జరిపితే సృజన్ ఎవరో తేలుతుందన్నారు.

అమిత్​షాకు చెప్పులందిస్తే తప్పేంది?

‘‘అమిత్​షా మా గురువు. ఆయనకు చెప్పులందిస్తే తప్పేంది? నాపై చిల్లరగాళ్లు చేసే ఆరోపణలను పట్టించుకోను. మరి కలెక్టర్లు కేసీఆర్ కాళ్లు మొక్కిన్రు కదా.. దాన్ని ఏమనాలి?” అని బండి సంజయ్‌‌ ప్రశ్నించారు. ‘‘గతంలో ప్రణబ్ ముఖర్జీ, నరసింహన్ కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్. దళితుడు అయిన రామ్‌‌నాథ్ కోవింద్ కాళ్లు మాత్రం మొక్కడు. లక్ష్మీపార్వతి కాళ్లు కూడా మొక్కిండు. బయట జయశంకర్ సార్​ కాళ్లు మొక్కి, లోపల మాత్రం తన్నిండు” అని నిలదీశారు. కాగా, రామగుండం ఎన్టీపీసీ కార్మికులపై పోలీసులు చేసిన దాడిని బండి సంజయ్ ఖండించారు. 

ట్విట్టర్ టిల్లు ఎందుకు ట్వీట్లు చేస్తలేడు

‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లిక్కర్ దందాపై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు స్పందిస్తలేడు. కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ట్వీట్ చెయ్. ఎందుకు చేస్తలేవ్” అని సంజయ్ ప్రశ్నించారు. పైగా బినామీలనే ఇరికించేందుకు ఒత్తిడి తెస్తున్నారని, వారిని ప్రలోభపెట్టి జైలుకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

భద్రకాళి అమ్మవారిపై ప్రమాణం చేస్తవా?

‘‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలే. మాయమాటలతో రైతులను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నవు. మోసపు మాటలతో డ్రామాలాడుతున్నవు. కేసీఆర్.. నీ మాటలు తప్పని నిరూపిస్త. బహిరంగ చర్చకు సిద్ధమా? భద్రకాళీ అమ్మవారిపై ప్రమాణం చేస్తవా?” అని సీఎంకు బండి సంజయ్ సవాల్ విసిరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలం మీదికొండ బస పాయింట్ వద్ద ఆయన ప్రెస్‌‌నోట్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కేసీఆర్‌‌ నిరూపించగలరా అని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లంటూ కేసీఆర్‌‌ చేస్తున్న కామెంట్ల వెనక పెద్ద కుట్ర దాగి ఉందని సంజయ్ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడంతో ఫ్రీ కరెంట్ ఇయ్యడం చేతగావడంలేదని, అందుకే ఫ్రీ కరెంటు ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.