- బల్దియా ఎన్నికలకు రెడీ
- ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 410 వార్డులకు ఎన్నికలు
- సిద్దిపేట బల్దియాకు మరో 5 నెలల గడువు
- పావులు కదుపుతున్న పొలిటికల్పార్టీలు
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారుకు మున్సిపల్ కమిషనర్లు కసరత్తు మొదలుపెట్టారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం19 మున్సిపాలిటీలు 410 వార్డులకు ఎన్నికలు జరగనుండగా సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు, 263 వార్డులు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 75 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు 72 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఒక్క సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గానికి మాత్రమే మరో ఐదు నెలల గడువు ఉండడంతో ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 మున్సిపాలిటీలు ఉండగా, 11 బల్దియాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మిగతా మూడు అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీపరిధిలో విలీనం చేయడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, అందోల్-జోగిపేట, నారాయణఖేడ్, ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
జహీరాబాద్ మునిసిపాలిటీకి 8 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు ఐదేళ్లు ఆ మున్సిపాలిటీలో గ్రామాల విలీన సమస్య ఏర్పడి ఆ ఇష్యూ కోర్టు పరిధిలో ఉండడంతో ఎన్నికలు నిర్వహించలేదు. మొదటి రెండేళ్లు ప్రస్తుత ఏడాది కలిపి మూడేళ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. వార్డుల వారీగా పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావాహులు ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ఉండగా వాటి పరిధిలో మొత్తం 75 వార్డులు ఉన్నాయి.
ఎన్నికల సంఘం మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణాల్లో ఎన్నికల సందడి షురూ అయింది. కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఓటర్ లిస్టులపై దృష్టిపెట్టారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట మినహా మిగిలిన 4 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగనున్నాయి. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉన్నాయి. సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం మే 2026 వరకు ఉంది. దీంతో జిల్లాలో సిద్దిపేట మినహా మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, మున్సిపాలిటీలో 20 చొప్పున చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుండడంతో రాజకీయ పార్టీలతోపాటు ఆశావహుల్లో సందడి మొదలైంది.
గజ్వేల్ లో పెరగని వార్డులు
గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరుగుతుందని భావించినా చివరకు ప్రస్తుతమున్న 20 వార్డుల్లోనే కొనసాగిస్తున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించారు. తొగుట, కుకునూరు పల్లి మండలాలకు చెందిన ఎనిమిది నిర్వాసిత గ్రామాల్లో దాదాపు 12,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించడంతో వీరంతా ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు.
ఇప్పటివరకు గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా నిర్వాసిత ఓటర్లతో వార్డుల సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ ప్రభుత్వం నిర్వాసిత గ్రామాలకు చెందిన ఓటర్లను ఆరు వార్డుల్లో సర్దుబాటు చేయడంతో వార్డుల సంఖ్య పెంపునకు బ్రేక్ పడింది.
