ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఉత్తర ద్వారం గుండా విష్ణు, వేంకటేశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి, మన్నెంకొండ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహబూబ్ నగర్ నగరంలోని పిల్లల మర్రి రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు.
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బండయ్య గుట్టలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధరూర్ మండలం పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పూజలు చేశారు. - నెట్ వర్క్, వెలుగు
