
- సీబీఐ వివరాలివ్వకుంటే ఏం చేద్దాం?
- వరుసగా రెండో రోజు లీగల్ ఎక్స్ పర్ట్ ల సూచనలు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐకి వివరణ ఇచ్చేటప్పుడు ఇరుక్కోకుండా ఎలా సమాధానాలు చెప్పాలి? కేసును బలోపేతం చేసే సాక్ష్యాలు సీబీఐ చేతికి చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలి? అనే దానిపై ఎమ్మెల్సీ కవితకు న్యాయ నిపుణులు మళ్లీ సలహాలిచ్చారు. కేసులో వివరణ అంశంపై కేసీఆర్, కవిత ఆదివారం ఉద యం మళ్లీ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. లిక్కర్ స్కాంతో ముడిపడి ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని, సెల్‌ఫోన్‌లు, సిమ్‌ల ధ్వం సంపై సీబీఐకి ఆధారాలు చిక్కకుండా సమాధా నాలు ఇవ్వాలని లీగల్ ఎక్స్‌పర్ట్‌లు సూచించినట్లు తెలిసింది. సీబీఐ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదు రుకావచ్చు? వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పవచ్చు? అనేవి తెలియజేసినట్లు సమాచారం. గతంలో ఉన్న ఇలాంటి కేసులు, వాటి రిఫరెన్స్‌లు ఇతర సమాచారం సైతం కవితకు అందజేశారని తెలిసింది. అలాగే రాష్ట్రంలో సీబీఐ కట్టడికి జారీ చేసిన జీవో కవితను విచారించకుండా అడ్డుకోలేదని.. అరెస్టు, ఇతర చర్యలను మాత్రం నిరోధించగలదని చెప్పారు. ఒకవేళ సీబీఐ కనుక ఢిల్లీ కోర్టు అనుమతి తీసుకుని అరెస్ట్ లేదా ఇతర చర్యల విషయంలో ప్రొసీడ్ అయ్యేట్టు ఉంటే హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం ఒక్కటే మార్గమని చెప్పినట్టు సమాచారం.
ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యకుంటే?
కంప్లయింట్, ఎఫ్‌ఐఆర్ కాపీలను ఇవ్వకుండా ఆరో తేదీననే వివరణ ఇవ్వాలని సీబీఐ కోరితే ఏం చేద్దామనే దానిపై కూడా న్యాయ నిపుణులతో కవిత, కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ‘‘సీఆర్పీసీ సెక్షన్160 కింద సాక్షిగా వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్ కాపీ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ కంప్లయింట్‌లోని అన్ని వివరాలు అందులో ఉన్నాయి. అందువల్ల ఆ డాక్యుమెంట్లు ఇవ్వలేదన్న కారణంతో విచారణ వాయిదాకు సీబీఐ అధికారులు అంగీకరించకపోవచ్చు” అని ఎక్స్ పర్ట్ లు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ సోమవారం సీబీఐ నుంచి మళ్లీ కమ్యూనికేట్ చేసి మంగళవారమే వివరణ ఇవ్వాలని కోరితే ఏం చేద్దామనే దానిపై కూడా చర్చించారు. వివరణ ఇవ్వాలని కోరుతూ సీబీఐ సోమవారం మళ్లీ సంప్రదిస్తే మరోసారి దీనిపై చర్చిద్దామని కేసీఆర్ చెప్పినట్టుగా తెలిసింది.