
- 3 జిల్లాల్లో బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీతో సరి
- మిగతా జిల్లాల్లో బియ్యం కూడా ఇయ్యలే
- ఇండ్లు కూలి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు
- రెండు వారాలైనా అమలు కాని సీఎం హామీ
జయశంకర్ భూపాలపల్లి/భద్రాచలం, వెలుగు: ఇటీవలి భారీ వర్షాలకు వరదలు పోటెత్తి సర్వం పోగొట్టుకున్న బాధితులు సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా అండగా ఉంటామన్న ప్రభుత్వం రెండు వారాలు గడుస్తున్నా పత్తా లేదు. జులై 18న వరద బాధితులను పరామర్శించేందుకు భద్రాచలం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, రూ.10 వేల నగదు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీతో ఆఫీసర్లు సైతం గ్రామాల్లో పర్యటించి 25,955 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. వారి బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకున్నారు. ప్రభుత్వ సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. ముంపు బాధితులపై సర్వే చేసి సర్కారుకు నివేదికలు పంపారు. కానీ పైసలు మాత్రం జమ కాలేదు.
సీఎం హామీ మూడు జిల్లాలకేనట!
సీఎం ఇచ్చిన హామీ కేవలం భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అకాల వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం, మంథని పట్టణాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 30 గ్రామాలు నీట మునగ్గా.. 5 వేల మందికి పైగా ప్రజలు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అయినా ఇక్కడ 25 కేజీల బియ్యం సాయం అందించలేదు. రూ.10 వేల నగదు సాయం విషయం అడిగితే రెవెన్యూ ఆఫీసర్లు బాధితులను ఈసడించుకుంటున్నారు. ‘సీఎం ఇచ్చిన హామీ మీకు వర్తించదు’ అంటూ దబాయిస్తున్నారు.
ప్రభుత్వం దగ్గర రూ.26 కోట్లు లేవా?
కేసీఆర్ పర్యటన తర్వాత భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల కలెక్టర్లు బాధిత కుటుంబాల లెక్కలు తీశారు. వారికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు చొప్పున అందించారు. భూపాలపల్లి జిల్లాలో 4,192 కుటుంబాలకు ఇచ్చారు. ములుగు జిల్లాలో మొత్తం 3,850 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు అందజేశారు. భద్రాచలం జిల్లాలో బూర్గంపాడులో 7 వేలు, అశ్వాపురంలో 1,458, పినపాకలో 1,341, మణుగూరులో 392, దుమ్ముగూడెంలో 1,920, చర్లలో 2,889, భద్రాచలంలో 2,913 ఇళ్లు మునిగినట్లుగా రెవెన్యూ ఆఫీసర్లు లెక్కలు తీసి 25 కేజీల రైస్, కేజీ కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. బాధిత కుటుంబాల నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ తీసుకున్నారు. కేసీఆర్ హామీ మేరకు వరద సాయం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.26 కోట్లు మాత్రమే అవసరమవుతాయి. అయినా ఈ సొమ్మును బాధితుల అకౌంట్లలో జమ చేయడానికి రెండు వారాలు దాటడంపై బాధితులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆఫీసర్లు గుర్తించని వాళ్లు ఇంకా వేలల్లో ఉన్నట్లు సమాచారం.
ఒక్కో ఇంట్లో రూ.50 వేలకు పైగా నష్టం
భూపాలపల్లి జిల్లాలో 955 ఇండ్లు పాక్షికంగా, 51 ఇండ్లు పూర్తిగా.. ములుగు జిల్లాలో 184 ఇండ్లు పాక్షికంగా, 25 ఇండ్లు పూర్తిస్థాయిలో నేల మట్టం అయినట్లు ఆఫీసర్లు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు. భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల నీట మునిగిన ప్రతి ఇంట్లో రూ.50 వేలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. పాడైపోయిన వాటిని సమకూర్చుకోవాలంటే బడుగు జీవులకు కష్టమే. ఎనిమిదేండ్లలో ఇక్కడ సుమారు ఐదుసార్లు వరదలు వచ్చాయి. పప్పులు, ఉప్పులు తప్ప పరిహారం ఇచ్చింది లేదు. కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు నగదు కూడా వచ్చేదాక నమ్మకం లేదంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా సీతానగర్ లో..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగర్ గ్రామానికి చెందిన జయమ్మ.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌లో తన అల్లుడు నీలకంఠ సత్యనారాయణ ఉంటున్న ఇంటికి వచ్చింది. 2రోజుల పాటు ములుగు ఏజెన్సీలో కురిసిన వర్షానికి గోడలు నానిపోయి.. జులై 9న తెల్లవారుజామున ఇల్లు నేలమట్టమయింది. ఇంట్లో నిద్రిస్తున్న జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గోవిందరావుపేట డిప్యూటీ తహసీల్దార్ మమత ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయినా ప్రభుత్వం నుంచి నయాపైసా రాలేదు.
భద్రాచలం టౌన్‌లోని సుభాష్‌నగర్ కాలనీలో..
భద్రాచలం టౌన్‌లోని సుభాష్‌నగర్ కాలనీలో ఇమ్మడి రాములు, మంగమ్మ తమ మనువడితో కలిసి గుడిసెలో ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు వారి ఇంటి గోడలు పడిపోయినయ్. కరెంటు మీటర్ కాలిపోయింది. ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఇంట్లో కరెంట్ లేదు. మంగమ్మకు రెండు రోజులుగా జ్వరం వస్తోంది. ఇంటిని బాగు చేసుకునే స్థోమత లేదు. పరిహారం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ‘సర్వం కోల్పోయాం. ఆదుకోండి సారూ.. గూడు చెదిరి దిక్కులేకున్నం’ అని బాధితులు వేడుకుంటున్నారు.
ఇల్లు కూలింది..
వరదలకు ఇల్లు కూలిపోయింది. ఇంట్లో సామాన్లన్నీ పాడయ్యాయి. కట్టుబట్టలతో వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలిన ఇంటిని బాగు చేయించుకోవాలంటే రూ.50 వేలకు పైగా అవుతుంది. నా భర్త హమాలీ పని చేస్తారు. కూలి డబ్బులు కుటుంబ పోషణకే సరిపోతున్నాయి. వరదలు వచ్చి పోయినా సాయం ఇవ్వలే. మా ఇల్లు బాగు చేసుకునే దారి లేదు. ప్రభుత్వ సాయం చేస్తేనే నిలబడతం.
- బొల్లా సునీత, సుభాష్ నగర్ కాలనీ, భద్రాచలం
బియ్యం రాలే.. పది వేలు అత్తయో రావో
కేసీఆర్ ఇస్తానన్న పరిహారం కోసం మా ఊర్లో కొంతమంది పేర్లు రాసుకొని పోయిన్రు. బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకున్నరు. ఇప్పటిదాకా బియ్యం, పప్పులు రాలే. ఇక పదివేలు అత్తయో రావో తెలుస్తలేదు. ఎమ్మార్వో ఆఫీస్ పోయి దండం పెట్టిన. ఎమ్మార్వో సారు ‘ఎవరినన్నా పంపిస్త’ అన్నడు. ఇప్పటిదాకా ఇటు వచ్చినోళ్లు లేరు.
- హనుమాండ్ల కిషోర్, సూరారం, మహదేవ్‌పూర్, భూపాలపల్లి జిల్లా