13వేల టీచర్ పోస్టులన్నరు 5 వేలతో నోటిఫికేషన్​ ఏంది?

13వేల టీచర్ పోస్టులన్నరు 5 వేలతో నోటిఫికేషన్​ ఏంది?
  • ప్రస్తుత డీఎస్సీపై అభ్యర్థుల పెదవి విరుపు  
  •  పది జిల్లాల్లో వంద లోపు16 జిల్లాల్లో 200 లోపే పోస్టులు
  •  ఏడు జిల్లాల్లో మాత్రమే 200కు పైగా ఉద్యోగాలు  
  •  జంబో డీఎస్సీ యాలంటున్న నిరుద్యోగులు

మంచిర్యాల / నిజామాబాద్​, వెలుగు : రాష్ర్టంలోని గవర్నమెంట్​స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్​పోస్టుల భర్తీ కోసం ఆరేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి నిరాశ మిగిల్చింది. సీఎం కేసీఆర్​ఏడాదిన్నర కింద అసెంబ్లీలో 13,086 టీచర్​ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి విరుద్ధంగా విద్యాశాఖ కేవలం 5వేల పోస్టులతోనే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పది జిల్లాల్లో వంద లోపు, 16 జిల్లాల్లో 200 లోపు పోస్టులను ప్రకటించగా, ఏడు జిల్లాల్లో మాత్రమే 200కు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ర్టంలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు వంద మంది పోటీ పడనున్నారు. సీఎం కేసీఆర్​ ప్రకటించినట్లే విద్యాశాఖలో మొత్తం 25 వేల నుంచి 30 వేల పోస్టులు ఖాళీలున్నాయి. కానీ, రాష్ర్ట ప్రభుత్వం వాస్తవ ఖాళీలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తాజా డీఎస్సీని ప్రకటించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న వారికి న్యాయం జరగాలంటే మిగతా 8వేల పోస్టులతో కలిపి మొత్తం 13వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్​ రిలీజ్​చేయాలని నిరుద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు.  

పది జిల్లాల్లో వందలోపే..

రాష్ట్రంలోని హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలో 50 లోపే ఎస్జీటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 16 జిల్లాల్లో 50 లోపే ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా విభజిస్తే ఒక్కో సబ్జెక్టుకు పది కంటే తక్కువ పోస్టులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. వేలల్లో అభ్యర్థులుండగా, పోస్టుల సంఖ్య మాత్రం సింగిల్ డిజిట్ దాటడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 300కు పైగా టీచర్​ పోస్టులు ఖాళీగా ఉండగా, సర్కారు 113 పోస్టులను మాత్రమే భర్తీ చేయనుంది. ఇందులో 36 స్కూల్​అసిస్టెంట్, 58 ఎస్జీటీ, 16 లాంగ్వేజ్​పండిట్​, 3 పీఈటీ పోస్టులున్నాయి. 

భగ్గుమంటున్న నిరుద్యోగులు

డీఎస్సీ ద్వారా 13వేలకు పైగా టీచర్​పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5లక్షల మంది ఈ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి 5,089 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించడంతో భగ్గుమంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా 13వేల ‌‌‌‌ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు 5వేలే‌‌‌‌ వేయడం ఏంటని నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన మిగతా అన్ని పోస్టులకు యథావిధిగా నోటిఫికేషన్లు రిలీజ్ చేసి.. కేవలం టీచర్ పోస్టులను తగ్గించడం సర్కారుకు విద్యాశాఖపై ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమంటున్నారు. పీఆర్సీ, బిశ్వాల్ కమిటీలు రాష్ట్రంలో 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని రిపోర్టు ఇచ్చాయని, ఈ మధ్య ప్రధాని మోడీ వరంగల్ పర్యటనలో కూడా రాష్ట్రంలో టీచర్ల ఖాళీలు వెక్కిరిస్తున్నాయని, 15 వేలకు పైగా పోస్టులు వేకెంట్​లో ఉన్నాయని ప్రస్తావించిన విషయం గుర్తు చేస్తున్నారు.  

తెలంగాణ వచ్చాక ఒక్కసారే.... 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు, అయిజ మండలాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లు తమకు టీచర్లు లేరంటూ సుప్రీంకోర్టుకు లెటర్లు రాసిన సంగతి తెలిసిందే. కోర్టు మొట్టికాయలు వేయడంతో 8,792 పోస్టులతో 2017లో టీఆర్టీ నోటిఫికేషన్  రిలీజ్​చేసింది. ఆ తర్వాత ఆరేండ్లయినా ఇప్పటివరకు టీచర్ల భర్తీ విషయం పట్టించుకోలేదు. అటు ఏపీలో ఇప్పటికే మూడుసార్లు టీచర్​ పోస్టులను భర్తీ చేశారు. ప్రతి ఆరు నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉండగా 2016, 2017, 2022 సంవత్సరాల్లో మాత్రమే నిర్వహించారు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మంది స్టూడెంట్స్ కు ఒక టీచర్​ను నియమించాల్సి ఉండగా, తగ్గించిన 8వేల పోస్టులతో సుమారు 2.40 లక్షల మంది స్టూడెంట్లు మెరుగైన విద్యకు దూరమయ్యే అవకాశముంది. 

ఎన్నికలప్పుడే డీఎస్సీ.....

2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాలుగేండ్లలో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా 2017 చివరలో 8వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. 2018లో రెండోసారి అధికారంలో వచ్చినా ఇప్పటివరకు టీచర్ల పోస్టులు భర్తీ చేయలేదు. ఎన్నికలు వస్తున్న తరుణంలో 5వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటుండంతో ఎన్నికలు వచ్చినప్పుడే టీచర్ ఉద్యోగాల భర్తీ గుర్తుకొస్తదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్టులకు ప్రిపేర్​అవుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ.  2022లో సీఎం కేసీఆర్​ప్రకటన తర్వాత అనేక మంది వేలకు వేలు ఖర్చు చేసి హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్లలో తింటూ అర్ధాకలితో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. వారికి సర్కారు ప్రస్తుత నోటిఫికేషన్ ​నిరాశే మిగిల్చింది. 

అసెంబ్లీ సాక్షిగా నేను సంతోషంగా ప్రకటిస్తున్నా. త్వరలోనే 80,039 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నం. దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25వేల నుంచి 30వేల ఉద్యోగాలున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లల్లో ఖాళీగా ఉన్న 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నాం. ఎక్కడా ఖాళీలు లేకుండా చూస్తాం. సంబంధిత శాఖలు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తాయి.
2022, మార్చి 8న అసెంబ్లీలో సీఎం కేసీఆర్​  

13 వేల పోస్టులు భర్తీ చేయాలె 

నేను టీచర్  కావాలని బీఈడీ చదివిన. 2012లో 0.30 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) మిస్సయింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంలో అయినా జాబ్ కొట్టాలని అనుకున్న. అప్పటినుంచి చదువుతూనే ఉన్న. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో ఒక్కసారే టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు జంబో డీఎస్సీ అని చెప్పి 5వేల పోస్టులతో సరిపెట్టాలని చూస్తున్నరు. సీఎం కేసీఆర్​అసెంబ్లీలో ప్రకటించినట్టు 13వేలకు పైగా పోస్టులు భర్తీ చేయాలె.

- బాలయ్య, కామారెడ్డి 

ఎన్నికల్లో లబ్ధి కోసమే.. 

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ర్టంలో సుమారు 20వేల టీచర్​పోస్టులు ఖాళీలున్నాయి. సీఎం కేసీఆర్​13,086 పోస్టులు భర్తీ చేస్తానమని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ, విద్యాశాఖ సీ, డీ కేటగిరీల్లో మాత్రమే 5వేల పోస్టులు భర్తీ చేస్తామంటోంది. ఆర్ట్​, క్రాఫ్ట్​ టీచర్ల ఊసేలేదు. ప్రభుత్వం ఆరేండ్ల నుంచి పోస్టులు భర్తీ చేయలేదు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సర్కారు ఈ డీఎస్సీని ప్రకటించింది. అంతేతప్ప ప్రభుత్వానికి విద్యాశాఖపై, నిరుద్యోగులపై ఎలాంటి ప్రేమ లేదు. 
-
 బండి రమేశ్​, తపస్​ రాష్ర్ట అదనపు ప్రధాన కార్యదర్శి