పట్టాలిచ్చినంక కేసులేంది?.. అదో జోక్​

పట్టాలిచ్చినంక కేసులేంది?.. అదో జోక్​

పట్టాలిచ్చినంక కేసులేంది?.. అదో జోక్​
పోడు రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తం: కేసీఆర్
వెంటనే కేసులు మాఫీ చేయాలని ఆదేశాలు ఇస్తున్న
‘మావ నాటే – మావ సర్కారు’ మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది
పోడు భూములకు ఈ సీజన్ నుంచే రైతుబంధు
ఆసిఫాబాద్‌‌లో 12 మంది పోడు రైతులకు పట్టాలు అందజేసిన సీఎం
వార్ధా నదిపై వంతెన కడ్తమని వెల్లడి

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేసినం. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగింది. కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ధరణి రద్దు కావాలో, కంటిన్యూ చేయాలో ప్రజలే చెప్పాలి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి చాలా బాగుంది. సర్పంచ్‌‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా కష్టపడి పని చేస్తున్నరు.

- సీఎం కేసీఆర్​

ఆసిఫాబాద్/ కాగజ్‌‌నగర్, వెలుగు : పోడు భూముల కోసం పోరాటం చేసిన రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘పోడు భూముల కోసం రాష్ట్రమంతా రైతులు ఆందోళనలు చేశారు. వాళ్ల మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు పోడు భూములను మనమే గుర్తించి, పట్టాలు ఇస్తున్నాం. ఇంకా రైతుల మీద కేసులు ఉండడంలో ఏం అర్థం ఉంటుంది. అదొక జోక్‌‌లా ఉంటుంది. అందుకే రైతుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తం. ఇందుకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి, ఫారెస్ట్ మినిస్టర్‌‌‌‌కు, ఇతర శాఖల ఆఫీసర్లకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తున్నా” అని చెప్పారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 12 మంది పోడు రైతులకు పట్టాలను సీఎం అందజేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్, కుమ్రంభీం, మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు విగ్రహాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో కేసీఆర్​ మాట్లాడారు. ‘‘స్వరాష్ట్రంలో పోడు భూముల కోసం పోరాటం చేసిన రైతులకు పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. అది కూడా జల్, జంగల్, జమీన్ కోసం కొట్లాడిన ఆదివాసీ వీరుడు కుమ్రంభీం పురిటిగడ్డలో పట్టాల పంపిణీ మొదలు పెట్టడం గర్వంగా ఉంది” అని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంతో దగ్గరి పోలిక

‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో తిరిగాను. అప్పుడు ‘మావ నాటే – మావ సర్కారు’ అంటూ గిరిజనులు చెప్పిన నినాదం నా మనసును తాకింది. తెలంగాణ ఉద్యమానికి, ఆదివాసీల నినాదానికి దగ్గర పోలిక ఉంది. అందుకే రాష్ట్రం సాధించిన తర్వాత గూడేలను, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, వాళ్లకే అధికారం కట్టబెట్టాం” అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేశామని, ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో లక్షా 57 వేల మంది రైతులకు 4 లక్షల మూడు వేల ఎకరాల పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ సీజన్ నుంచే రైతుబంధు సాయం కూడా అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతుల సాగు కోసం ఇప్పటికీ త్రీ ఫేజ్ కరెంటు కనెక్షన్లు లేని విషయం తన దృష్టికి వచ్చిందని, దీని పరిష్కారం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలని సూచించారు.

అన్ని రంగాల్లో తెలంగాణ టాప్

దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో టాప్‌‌లో ఉందని కేసీఆర్‌‌‌‌ అన్నారు. సంక్షేమ పథకాలు గొప్పగా అమలు అవుతున్నాయని చెప్పారు. కేంద్రం ప్రకటించే అవార్డుల్లో పదింట తొమ్మిది అవార్డులు రాష్ట్రానికి దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి చాలా బాగుందని, సర్పంచ్‌‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా కష్టపడి పని చేస్తున్నారని కితాబిచ్చారు. గతంలో ఊరిలో డెడ్‌‌బాడీ కాల్చేందుకు కూడా జాగా దొరికేది కాదని, ఇప్పుడు శ్మశాన వాటికలు కట్టుకున్నామని అన్నారు. రైతులకు నయా పైసా బిల్లు లేకుండా ఫ్రీగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

ధరణితో రైతులకు ఎంతో మేలు

తాము తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందని కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ధరణిని రద్దు చేస్తామని చెప్పడం దురదృష్టకరమన్నారు. మళ్లీ లంచాల రాజ్యం రావాలని, పైరవీకారుల వ్యవస్థ రావాలని వాళ్లు కోరుకుంటున్నట్లు ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ధరణి రద్దు కావాలో, కంటిన్యూ చేయాలో ప్రజలే చెప్పాలని కోరారు. గతంలో ‘మంచం పట్టిన మన్యం’ అనే  వార్తలు పేపర్లలో, టీవీల్లో వచ్చేవని, మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ మంచినీరు రావడంతో ఎక్కడా అలాంటి వార్తలు రావడం లేదని అన్నారు.

మహారాష్ట్రలోనూ కోరుకుంటున్నరు

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో రావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ అన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమావేశానికి వెళ్తే అక్కడి ప్రజా ప్రతినిధులు, నాయకులు తెలంగాణ పథకాలు అక్కడా పెట్టాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. మారుమూల కుమ్రంభీం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశామని, మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు ఫోర్ లైన్‌‌ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఈ అభివృద్ధిని స్వయంగా చూసేందుకు ఇదే రోడ్డు మీద తాను ప్రయాణం చేస్తానని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు అన్ని వర్గాల స్టూడెంట్ల మేలు కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని, ఫలితంగా దేశంలో ఏ ఎంట్రెన్స్ జరిగినా తెలంగాణ స్టూడెంట్స్ సత్తా చాటుతున్నారని చెప్పారు.

వార్ధా నదిపై రూ.75 కోట్లతో హైలెవల్ వంతెన

సిర్పూర్ నియోజకవర్గంలో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణం త్వరలోనే మొదలు కానుందని, దీని ద్వారా 76 వేల ఎకరాలకు సాగు నీరు అందించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విన్నపం మేరకు కౌటాల మండలం గుండాయి పేట వద్ద వార్ధా నదిపై మీద రూ.75 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికప్పుడు జీఓ కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు.