ఫలించిన రైతుల మూడేండ్ల పోరాటం

ఫలించిన రైతుల మూడేండ్ల పోరాటం
  • సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీలో కేసీఆర్​ ప్రకటన
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో 40 వేల ఎకరాలు మునక
  • మార్కెట్​ రేటు ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు ఇయ్యాలంటున్న రైతులు
  • వివేక్ ఆధ్వర్యంలో బాధితుల పోరు


పెద్దపల్లి/మంచిర్యాల, వెలుగు: మూడేండ్ల పోరాటం తర్వాత కాళేశ్వరం బ్యాక్ వాటర్​సమస్యలపై రాష్ట్ర సర్కార్​  దిగొచ్చింది. బ్యాక్​వాటర్​తో పంటలు మునిగి నష్టపోతున్న రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్​రేటు ప్రకారం తమ భూములు సేకరించాలని, పంటలు నష్టపోయిన మూడేండ్ల కాలానికి పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మూడేండ్లుగా చేసిన పోరాటం ఫలించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరదను సరిగా లెక్కించక

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన సమయంలో రాష్ట్ర సర్కార్​ గోదావరి ఇన్​ఫ్లోను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. క్యాచ్​మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరదను లెక్కలోకి తీసుకోలేదు. అంతేగాకుండా ఎఫ్​టీఎల్ వరకే సర్వే చేసి ముంపు భూములను సేకరించారు. కానీ వరదలు వచ్చినప్పుడు ఎంటీఎల్ (మాగ్జిమమ్ ట్యాంక్ లెవల్)తో మునిగిపోయే భూములను గుర్తించలేదు. దీంతో నాలుగేండ్లుగా పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగుండం, వెల్గటూరు మండలాల్లోని 20 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో మరో 20 వేల ఎకరాలు చొప్పున మొత్తంగా 40 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి.

ఏండ్లుగా పోరాటం 

రైతుల సమస్యను తెలుసుకొని అన్నారం బ్యారేజీ కింద మునిగిన పంటలను వివేక్​ వెంకటస్వామి పరిశీలించారు. తర్వాత మంథని చౌరస్తాలో బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. సర్కారు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. రాజ్​భవన్​ వెళ్లి గవర్నర్​కు, ఢిల్లీ వెళ్లి కేంద్ర జల వనరుల మంత్రికి ఫిర్యాదు చేయడం ద్వారా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచారు. దీంతో దిగొచ్చిన సీఎం కేసీఆర్, బ్యాక్​ వాటర్ బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ కలెక్టరేట్ వరకు చేసిన మూడు రోజుల పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు.

మార్కెట్ ​రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలె..

ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమని, అయితే ఈ ప్రాంతంలో ఉన్న మార్కెట్​ రేటు ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు పరిహారంగా ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. అలాగే మూడేండ్లుగా ఆరు పంటలను కోల్పోయామని, ఒక్కో ఎకరానికి ఫసల్​కు రూ.20 వేల చొప్పున ఐదు ఫసళ్లకు కలిపి రూ.లక్ష చొప్పున పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించక ముందు రూ.2 లక్షలు ఖర్చు చేసి బోర్లు వేయించుకున్నామని, అవన్నీ మునిగిపోయినందున వాటిని సైతం పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.

ఎకరానికి రూ.20 లక్షలు ఇయ్యాలె

ముంపు బాధితులతో కలిసి మూడేండ్లుగా చేస్తున్న పోరాటంతో సీఎం కేసీఆర్ దిగివచ్చి అసెంబ్లీలో ప్రకటన చేసిండు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవాలె. అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా మార్కెట్ రేటు ప్రకారం ఎకరానికి రూ. 20 లక్షలు ఇయ్యాలె. క్రాప్ హాలీడే కింద పడావు పెట్టిన మూడేండ్ల కాలానికి ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారంతో పాటు బోర్లకు రూ.2 లక్షల చొప్పున అందజేయాలే. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తం.
- వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

వివేక్ పోరాటంతోనే సాధ్యమైంది

ముంపు బాధితుల కోసం వివేక్ వెంకటస్వామి మొదటి నుంచీ పోరాడుతున్నడు. మునిగిపోయిన పొలాల సమస్యను బయట ప్రభుత్వానికి తెలిసేలా చేసిండు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి సమస్యను సర్కార్ దృష్టికి తీసుకుపోయిండు. మొత్తానికి సీఎం దిగివచ్చి, అసెంబ్లీలో ప్రకటన చేయడం సంతోషం. కాళేశ్వరం బ్యాక్ వాటర్​ముంపు బాధితులమంతా వివేక్​కు రుణపడి ఉంటాం.
- సుంకరి బాపూ, మల్లారం, పెద్దపల్లి జిల్లా