ఆంధ్రాలో బీఆర్​ఎస్.. తెలంగాణ భవన్​లో పురుడు..  

ఆంధ్రాలో బీఆర్​ఎస్.. తెలంగాణ భవన్​లో పురుడు..  

దేశంలోనే తొలి రాష్ట్ర శాఖ ఏపీలో ఏర్పాటు
తోట చంద్రశేఖర్​ను అధ్యక్షుడిగా ప్రకటించిన కేసీఆర్​
అట్టహాసంగా ఆంధ్రా లీడర్ల జాయినింగ్​ ప్రోగ్రామ్.. 
దగ్గరుండి పర్యవేక్షించిన తెలంగాణ లీడర్లు
జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడెవరో ఇంకా తేలలే

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ భవన్​ వేదికగా ఆంధ్రప్రదేశ్​ బీఆర్​ఎస్​ శాఖ పురుడు పోసుకుంది. ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్​ను కేసీఆర్​ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్​లో ఏపీ లీడర్ల జాయినింగ్ కార్యక్రమం అత్యంత ఆర్భాటంగా సాగింది. బీఆర్‌‌ఎస్‌‌లో ఏపీ నేతల చేరికల ప్రక్రియ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులే మానిటర్​ చేశారు. ఏపీ నేతల పేర్లతో హోర్డింగ్‌‌లు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటు సహా అన్నిటినీ తెలంగాణ లీడర్లే పర్యవేక్షించారు. హైదరాబాద్​లో పెద్ద ఎత్తున హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఏపీలోని పలు ప్రాంతాలకు ఆదివారమే 200 కార్లు పంపి అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలను హైదరాబాద్‌‌కు రప్పించారు. ఏపీ నుంచి వచ్చిన నేతలకు తెలంగాణ భవన్‌‌లోనే డిన్నర్‌‌ ఏర్పాటు చేశారు.

తెలంగాణ అధ్యక్షుడెవరో తేల్చకుండానే..!

తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌‌ఎస్‌‌ను కేసీఆర్‌‌ అక్టోబర్‌‌ 5న బీఆర్​ఎస్​గా మారుస్తూ తీర్మానం చేశారు.  ఇందుకు డిసెంబర్‌‌ 8న సెంట్రల్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ అనుమతివ్వడంతో ఆ మరుసటి రోజు (డిసెంబర్​ 9న) పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణ భవన్​లో అట్టహాసంగా నిర్వహించారు. త్వరలోనే పార్టీ విధివిధానాలు, జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఆ సందర్భంగా కేసీఆర్‌‌ తెలిపారు. 

ఢిల్లీలోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ కార్యాలయాన్ని డిసెంబర్‌‌ 14న  ప్రారంభించారు. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం రోజే బీఆర్‌‌ఎస్‌‌ కిసాన్‌‌ సెల్‌‌ అధ్యక్షుడిగా హర్యానాకు చెందిన గుర్నామ్‌‌ సింగ్‌‌ చడూనీని నియమించారు. ఆయన తప్ప బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ కార్యవర్గంలో ఇంకో నేత లేరు. అసలు బీఆర్‌‌ఎస్‌‌ జాతీయాధ్యక్షుడెవరో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకవేళ బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌‌ అయితే.. తెలంగాణ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే దానిపైనా స్పష్టత లేదు. టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​ వరకు పార్టీ పుట్టిపెరిగిన తెలంగాణలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరో తేల్చకుండా, జాతీయ అధ్యక్షుడిని కూడా ప్రకటించకుండా ఏకంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ప్రకటించడంపై బీఆర్​ఎస్​ లీడర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్​ను నియమించడంతో దేశంలోనే బీఆర్​ఎస్​ తొలి రాష్ట్ర శాఖ ఏపీలో ఏర్పాటైంది. 

పార్టీ కార్యకలాపాలు ఏపీ నుంచి మొదలు 

బీఆర్‌‌ఎస్‌‌ కార్యకలాపాలు మహారాష్ట్ర, కర్నా్టక నుంచే మొదలవుతాయని అప్పట్లో ప్రకటించారు. కానీ, దానికి విరుద్ధంగా ఏపీ నుంచే ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. బీఆర్‌‌ఎస్‌‌ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌‌ను నియమిస్తున్నట్టు కేసీఆర్‌‌  తెలంగాణ భవన్​లో ఏపీ నేతల చేరికల వేదికపై నుంచే ప్రకటించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్‌‌ బాబుకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా మీడియాను కూడా అనుమతించలేదు. ప్రింట్​ మీడియా రిపోర్టర్లను మాత్రమే అనుమతిస్తామని కాసేపు చెప్పిన నిర్వాహకులు.. ఆ తర్వాత అందరినీ బయటికి పంపించారు. కెమెరామెన్‌‌లు, ఫోటో గ్రాఫర్లను అనుమతించకుండా చివరికి రిపోర్టర్లను కవరేజీకి పిలిచారు. బీఆర్‌‌ఎస్‌‌లో ఏపీ నేతల చేరికను చూసేందుకు వచ్చిన పలువురు ఉద్యమ నాయకులను భవన్‌‌ నుంచి బయటికి పంపించారు.

‘జై తెలంగాణ’ వినిపించలే 

ఏపీ నేతల జాయినింగ్స్​ కార్యక్రమాన్ని ‘‘జై బీఆర్​ఎస్​.. జై భారత్’’​ నినాదంతో కేసీఆర్​ ముగించారు. ఎప్పుడూ ‘జై తెలంగాణ’ నినాదంతో ముగించే ఆయన ఈ సారి ఆ నినాదాన్ని వాడలేదు. వైజాగ్​కు ఎప్పుడు వస్తారని కేసీఆర్​ను ఓ కార్యకర్త అడుగగా.. ‘అది ఓ కథ. మళ్లా చెప్పుకుందాం’ అని దాటవేశారు. కార్యక్రమంలో కొందరు ‘ జై బాలయ్య’ నినాదాలు చేశారు.