నా రాజీనామా దెబ్బకు గట్టుప్పల్ మండలం ప్రకటించిండు

నా రాజీనామా దెబ్బకు గట్టుప్పల్ మండలం ప్రకటించిండు

నా జీవిత లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీని ఓడించడమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తప్పుడు పనులు చేసి, దొంగపనులు చేసి జైలుకు పోయినోళ్ళు చెప్పితే మేము వినాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫున్ లను పంపించి చెల్లని కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తుండని దుయ్యపట్టారు. ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తుండని, కావాలని కేసీఆర్ రెచ్చగొడుతుండని తెలిపారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ‘‘2018 లో టీఆర్ఎస్ గాలి ఉన్నా..  మునుగోడు ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను మునుగోడు ప్రజల ఇష్యూస్ పై అసెంబ్లీ లో మాట్లాడాను’’ అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు కూడా కేసీఆర్ మునుగోడు లీడర్లతో మాట్లాడుతుండని, సర్పంచ్ లకు కార్లు పంపి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కోరుకుంటే ఉప ఎన్నిక రాదన్న రాజగోపాల్ రెడ్డి... ప్రజలు కోరుకుంటే వస్తదని తెలిపారు. ప్రజల కోసం కావాలంటే ఏ త్యాగానికైనా సిద్ధమని.. అవసరమైతే రాజకీయంగా దూరంగా ఉండమంటే ఉంటానని ఛాలెంజ్ చేశారు. రేపు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగినట్లన్నారు. సమయం వస్తే మా ప్రజలు బుద్ది చెప్తారని, కేసీఆర్ పతనం మునుగోడుతోనే మొదలవుతదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

వాల్లే నాకు హై కమాండ్...

గతంలో నేను బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది వాస్తవమే.. కానీ తాను ఎప్పుడూ రాజీనామా చేస్తానని చెప్పలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ఓ న్యూస్ పేపర్ లో వార్తలు వచ్చాయన్న ఆయన... వాటిని ఖండిస్తున్నానని చెప్పారు. రాజకీయాలు, రాజీనామా గురించి అమిత్ షా వద్ద మాట్లాడలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న నియంత పాలనపై వివరించానన్నారు. తాను మాజీ ఎంపీగా మాత్రమే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అమిత్ షాను కలిశానని రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే భువనగిరి, మునుగోడు ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని, వాల్లే తనకు హై కమాండ్ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ వాళ్ళతోనే కేసీఆర్ ను కొట్టడం, బొందపెట్టడం సాధ్యమవుతదని చెప్పానన్న ఆయన... మోడీ, అమిత్ షా అనుకుంటే అది అవుతుందని అన్నానని వ్యాఖ్యానించారు.  

అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చిండు..

తన రాజీనామా దెబ్బకు కేసీఆర్ గట్టుపల్లి మండలాన్ని ప్రకటించిండని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికకు కావాల్సిన హంగామా చేస్తుండన్న ఆయన.. అందుకే గట్టుపల్లి మండలాన్ని ఇచ్చిండన్నారు. ఇంటెలిజెన్స్, పోలీస్ వాళ్ళను మునుగోడుకు పంపి హడావిడి చేస్తున్నారని చెప్పారు. హుజురాబాద్ వద్ద పడిపోయిన గ్రాఫ్ ను.. మళ్లీ పెంచుకోడానికి టీఆర్ఎస్, కేసీఆర్ భావిస్తుందని చెప్పారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు పైనే ఫోకస్ పెట్టిండని, కేసీఆర్ కు నిద్రపడ్తలేదని కామెంట్స్ చేశారు.  మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని...  అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చిండని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. 

అలా చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థిని నేనే గెలిపిస్తా...

తన రాజీనామా తోనే మునుగోడు అభివృద్ధి అవుతదనుకుంటే.. ఆ పదవిని త్యాగం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే చెప్పాను.. దళిత బంధు తోపాటు బీసీ, మైనార్టీ బంధు ఇవ్వండని... అలా చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థిని నేనే గెలిపిస్తానని ఆయన సవాలు విసిరారు. నా రాజీనామా డ్రామాతోనే కేసీఆర్ దిగొచ్చి..మునుగోడు పై రివ్యూ చేస్తుండన్నారు. మునుగోడు తెలంగాణాలో లేదా..  సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ వాళ్లే పోరాటం చేసిండ్రా అని నిలదీశారు. ఎన్నికల్లో గెలిచేందుకు నీచాతి నీచంగా పనులు చేస్తడన్న ఆయన.. ప్రతిపక్ష పార్టీ సభ్యులను కొని దుర్మార్గంగా నియంతగా పాలన చేస్తున్నది నిజం కాదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

కేసీఆర్ ను ఎదిరించాలని కోరుకుంటున్నా..

ఇక ఇటీవల కాంగ్రెస్ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థికే తాను ఓటు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొన్ని తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లో వుందన్న ఆయన... తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తినని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆవేశంతో కాంగ్రెస్ పై కామెంట్స్ చేశానని, కానీ మొదటి నుంచీ పార్టీలో వున్న వారిని కాకుండా కొత్తగా వచ్చిన వారిని ముందు పెట్టడం బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఎదిరించాలని కోరుకుంటున్నా.. కానీ కాంగ్రెస్ అలా పోరాటం చేయడం లేదన్నారు.