మైనార్టీలకు లక్ష సాయం.. మంత్రి చెప్పినోళ్లకే

మైనార్టీలకు లక్ష సాయం.. మంత్రి చెప్పినోళ్లకే
  • మైనార్టీలకు లక్ష సాయం.. మంత్రి చెప్పినోళ్లకే
  • అర్హులైన క్రిస్టియన్ల నుంచీ అప్లికేషన్లు
  • ఇన్ చార్జ్ మంత్రి అప్రూవల్​ఇస్తేనే ఆర్థిక సాయం 
  • దశలవారీగా అమలు చేస్తమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు లక్ష రూపాయల సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం జీవో రిలీజ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జిల్లా ఇన్ చార్జ్ మంత్రికి అప్పగించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీ/ స్ర్కీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. ఆ లిస్ట్​పై సంబంధిత జిల్లా మంత్రి ఆమోదం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక సెలక్షన్ లిస్ట్​ అనేది దశలవారీగా డిస్​ప్లే చేసి.. ఫేజ్​ల వారీగానే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకుని అందులో అర్హులైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

 క్రిస్టియన్ల కోసం తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీమ్​ను అమలు చేయనున్నారు. అర్హులైన క్రిస్టియన్ల నుంచి కొత్తగా అప్లికేషన్లు తీసుకోనున్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ ఆర్థిక సాయానికి అర్హులు కావాలంటే జూన్ 2వ తేదీ 2023 నాటికి 21 ఏండ్ల నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి. ఇన్​కమ్ విషయానికొస్తే రూరల్ ఏరియాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ.2 లక్షలు పరిమితి విధించారు. 

మైనార్టీల్లో పేదరికం తొలగిస్తం: సీఎం

కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని జీవో రిలీజ్​ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నదన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.