ఆర్టీసీ కార్మికులతో రేపు సీఎం లంచ్​

ఆర్టీసీ కార్మికులతో రేపు సీఎం లంచ్​
  • మధ్యాహ్నం 12 గంటలకల్లా రావాలని సూచన..
  • ప్రతి డిపో నుంచి ఐదుగురు ఎంపిక
  • అందులో ఇద్దరు మహిళా సిబ్బంది
  • భేటీలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై వివరణ
  • కార్మికులకు బ్యాలెన్స్ షీట్  రిపోర్టులు
  • నష్టాల నుంచి గట్టెక్కే మార్గాలపై చర్చ
  • డిపోల నుంచి సమావేశానికి వచ్చే ‘ఐదుగురే’ ఇక ముందు కీలకం
  • సమస్యలపై వారితోనే నేరుగా మాట్లాడనున్న మేనేజ్​మెంట్​
  • కొత్తగా అద్దె బస్సులు తీసుకోవడంపై పునరాలోచిస్తున్నామన్న అధికారులు

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్  నుంచి పిలుపు అందింది. ఒక్కో డిపో నుంచి ఐదుగురి చొప్పున రాష్ట్రంలోని 97 డిపోల కార్మికులు రావాలని ఆహ్వానించారు. డిసెంబర్ 1న మధ్యాహ్నం ప్రగతిభవన్లో ఈ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా కార్మికులను తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులను, రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం, సమ్మె కారణంగా వాటిల్లిన నష్టం తదితర అంశాలను సీఎం కార్మికులకు వివరిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తారని తెలిపాయి. యూనియన్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసే అవకాశముందని పేర్కొన్నాయి. సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్​ కార్మికులతో కలిసి భోజనం చేయనున్నారు.

సంస్థపై రిపోర్టు సిద్ధం

ప్రస్తుతం ఆర్టీసీ ఎదుర్కోంటున్న ఆర్థిక ఇబ్బందులు కార్మికులకు అర్థమయ్యేలా ఓ రిపోర్టు తయారు చేశారని, రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇప్పటివరకు లాభనష్టాలను వివరాలను, సర్కారు చేసిన సాయాన్ని అందులో చేర్చారని సమాచారం. ‘‘సంస్థ ఆర్థిక స్థితి అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ప్రింట్ చేశారు. ప్రగతి భవన్ మీటింగ్లో సీఎం కార్మికులకు అన్ని వివరాలు చెప్తారు. సంస్థ మూసే పరిస్థితి ఉన్నా.. మళ్లీ ఎందుకు ఆర్థిక సాయం చేస్తున్నదీ వివరిస్తారు. కార్మికుల మీద ప్రేమ ఉందని, వాళ్లు బాగుండాలనే మీటింగ్​ పెట్టామని వివరిస్తారు..” అని ఓ అధికారి చెప్పారు.

తాను రవాణా మంత్రిగా సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి ఎలా తీసుకెళ్లానన్నది సీఎం వివరిస్తారని, ఇప్పుడు కూడా ఏం చేస్తే లాభాలు వస్తాయన్నది వివరిస్తారని అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ నష్టాల ఊబిలోకి వెళ్లడానికి యూనియన్లే కారణమని సీఎం బలంగా నమ్ముతున్నారని, అందుకే సమ్మె టైంలో యూనియన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ప్రగతిభవన్ లో జరిగే సమావేశంలో కూడా యూనియన్లను తప్పుపట్టే అవకాశం ఉందని, యూనియన్ల వెంట వెళ్లొద్దని సూచిస్తారని చెప్తున్నారు.

ఇక ‘ఆ ఐదుగురే’ కీలకం

ప్రగతిభవన్ లో సీఎంతో జరిగే సమావేశానికి ఎవరెవరిని పిలవాలనే దానిపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో శుక్రవారం ట్రాన్స్ పోర్టు ఆఫీసులో ఆర్టీసీ ఇన్​చార్జీ ఎండీ సునీల్ శర్మ, ఈడీల సమావేశం జరిగింది. ఇందులో డిపోల వారీగా ఎవరెవరిని ఆహ్వానించాలో గుర్తించారు. యూనియన్ల కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, డ్యూటీలో చురుకుగా ఉండే వారిని ఎంపిక చేశారని, ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు ఉన్నారని ఓ సీనియర్​ అధికారి చెప్పారు. ఇకముందు ఆ ఐదుగురే కీలకంగా మారుతారని.. డిపోలో ఎలాంటి సమస్యలు వచ్చినా మేనేజ్ మెంట్ నేరుగా వారితోనే మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. ‘‘యూనియన్ నేతల స్థానాన్ని ఇక నుంచి ఆ ఐదుగురు కార్మికులు భర్తీ చేస్తారు. డిపోలో సమస్యలు, కార్మికుల సమస్యలు కూడా వారే మేనేజ్​మెంట్ కు చెప్తారు. ఇక నుంచి యూనియన్లు కనిపించవు..’’ అని వివరించారు. డిపోల్లో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సీఎం ప్రగతిభవన్ మీటింగ్ లో అడిగి తెలుసుకోనున్నట్టు చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా కార్మికుల కోసం వంద కోట్లు విడుదల చేశానని సీఎం వివరించనున్నారని.. కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పే అవకాశముందని తెలిపారు. గూడ్స్ రవాణా, బస్ స్టేషన్లలో మరిన్ని దుకాణాల ఏర్పాటు, నగర, పట్టణాల్లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను వివరిస్తారని చెప్పారు.

అద్దె బస్సులకు బ్రేక్!

సమ్మె సమయంలో 1,200 అద్దె బస్సులను తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మంది అప్లై చేశారు. అయితే కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలోకి తీసుకోవడంతో ఇక అద్దె బస్సులను తీసుకోవద్దని సర్కారు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అద్దె బస్సులు నడిపించేందుకు ముందుకొచ్చిన వారితో అగ్రిమెంట్ చేసుకోవద్దని సీఎం ఆదేశించారని సమాచారం. త్వరలో ఫిట్ నెస్ కోల్పోయే బస్సులను గుర్తించి ఇప్పట్నించే రిపేర్లు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించినట్టు తెలిసింది.