త్వరలోనే గల్ఫ్ దేశాలకు వెళ్తా : CM KCR
తెలంగాణలో ఉన్న అవకాశాలను స్వయంగా వివరిస్తానని కామెంట్
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, గల్ఫ్ దేశాల్లో పర్యటనపై సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పరిస్థితులు మారిపోయాయని… పనికోసం ఇతర దేశాలకు వెళ్లే అవసరం లేదని .. కార్మికులు తిరిగి తెలంగాణకు, హైదరాబాద్ కు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
“ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ, గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతా చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.” అన్నారు సీఎం.
“తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి నాక్ లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళతాను’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

