కేసీఆర్‌, జగన్‌ నవ్వులు.. ముచ్చట్లు

కేసీఆర్‌, జగన్‌ నవ్వులు.. ముచ్చట్లు

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌  చాలా రోజుల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మనుమరాలి పెండ్లి వీరి భేటీకి వేదికైంది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇదే మొదటిసారి. పెండ్లి వేడుకకు ముందే చేరుకున్న జగన్‌.. కేసీఆర్​కు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ కనిపించారు. కలిసే వధూవరులను ఆశీర్వదించారు. కలిసి భోజనం చేశారు. 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. 

ఇద్దరు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చలు జరిపారు. నీటి వివాదాలు, ప్రాజెక్టులకు అనుమతులు, ఏపీ అసెంబ్లీ నుంచి చంద్రబాబు వెళ్లిపోవడం.. ఆ తర్వాతి పరిణామాలపైనా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌‌‌‌ ఢిల్లీ టూర్‌‌‌‌పైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. రైతు చట్టాల రద్దు, ధాన్యం కొనుగోలు వ్యవహారంపైనా చర్చించినట్టు తెలిసింది. పోచారం శ్రీనివాస్​రెడ్డి మనుమరాలు స్నిగ్దారెడ్డికి ఏపీ సీఎం జగన్‌‌‌‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌‌‌‌ రెడ్డి కుమారుడు రోహిత్‌‌‌‌రెడ్డికి ఆదివారం శంషాబాద్‌‌‌‌లో వివాహం జరిగింది. ఈ పెండ్లికి తెలంగాణ గవర్నర్​ తమిళిసై, హర్యానా గవర్నర్‌‌‌‌ దత్తాత్రేయ, రెండు రాష్ట్రాల సీఎంలు, స్పీకర్‌‌‌‌లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ వివాహ వేడుకలో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. 

మొన్నటి దాకా మాటల యుద్ధం

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్‌‌‌‌ సీఎం అయ్యాక కేసీఆర్​, జగన్​ మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రగతి భవన్‌‌‌‌కు జగన్​ వచ్చి కేసీఆర్‌‌‌‌ను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన కేసీఆర్‌‌‌‌.. ఏపీతో స్నేహబంధం కొనసాగుతుందని అప్పట్లో ప్రకటించారు. గోదావరి నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల సీఎంలు పలుమార్లు భేటీ అయ్యారు. గోదావరి –- కృష్ణా –- పెన్నా నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రులు, సెక్రటరీలు, ఇంజనీర్ల స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయి. తెలంగాణతో స్నేహంగా ఉంటూనే జగన్‌‌‌‌ శ్రీశైలం నీళ్లన్నీ రాయలసీమకు మళ్లించేందుకు సంగమేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో దీనిని చూసీచూడనట్టు వదిలేసిన కేసీఆర్‌‌‌‌.. ఈ ఏడాది జూన్‌‌‌‌ తర్వాత ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. తాను గోదావరి నీళ్లను మళ్లించాలని సూచిస్తే జగన్‌‌‌‌ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపి తీరుతామని కేసీఆర్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే..  ఆంధ్రోడు ఆంధ్రోడే”అంటూ జగన్‌‌‌‌ సర్కారుపై తెలంగాణ మంత్రులు ధ్వజమెత్తారు. కేంద్రం దగ్గర జగన్‌‌‌‌ భిక్షమెత్తుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఏపీ మంత్రుల నుంచి అదే స్థాయిలో ఎదురుదాడి కొనసాగింది. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా, గోదావరి బోర్డులు, సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు, ప్రధానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి చేస్తోందని అన్ని వేదికలకు ఏపీ ఫిర్యాదులు చేసింది. ఏకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఇట్లా రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు పెరిగాయి. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ను ఏపీ స్వాగతించగా, తెలంగాణ మాత్రం ప్రాజెక్టులు ఇచ్చేది లేదని తేల్చిచెప్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, ఇతర అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఈ టైంలో ఇద్దరు సీఎంలు పెండ్లిలో కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.