మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఆయనేమన్నారంటే.. ‘‘ఫ్లాట్ ఫాంల మీద స్పీచ్‌లు దంచడం వేరు.. రియాల్టీ వేరు.. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నరు. కేంద్రం బడ్జెట్ సెషన్‌లో మోటార్ వెహికిల్ యాక్ట్ –2019 బిల్లును పాస్ చేయలేదా? అక్కడ ఓటేసి ఇక్కడ డ్రామా చేస్తరా.. నితిన్ గడ్కరీ ఈ చట్టం సభలో ప్రవేశపెట్టిన రోజు వీళ్లు సభలో లేరా .. మీరు పవిత్రులైతే ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? మీరు దానిలో భాగస్వాములా కాదా.. స్పీచ్‌లు వేరు.. వాస్తవాలు వేరు.. మైక్ ఇస్తే మూడు గంటలు నేను కూడా మాట్లాడుతా. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం ఇది.. వీళ్లు ఆర్చేవాళ్లా తీర్చేవాళ్లా.. కార్మికుల కుటుంబాలు రోడ్డున పడితే వీళ్లు ఏం చేస్తారు బై బై చెప్పి వెళ్లిపోతారు. మధ్యప్రదేశ్‌లో ఉమాభారతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆర్టీసీని రద్దు చేశారు. బీజేపీ ఎంపీలు చేసిన దుర్మార్గానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాళ్లు ఏం నైతికతతో మాట్లాడుతరు. ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నరు. కాంగ్రెసోళ్లకు కూడా ఏం నైతికత ఉంది. వాళ్ల రాష్ట్రాల్లో విలీనం చేసిండ్రా? రుణమాఫీ అన్నరు.. చేసిండ్రా?
యూనియన్లు, ప్రతిపక్ష పార్టీలే హంతకులు
యూనియన్లు, ప్రతిపక్ష పార్టీలే హంతకులు.. దురదృష్టం వాళ్లు(కార్మికులు) చచ్చిపోయి ఉండకూడదు.. హండ్రెడ్ పర్సెంట్ వాళ్లే బాధ్యులు. 67 శాతం జీతాలు పెంచిన తర్వాత ఇంకేం డిమాండ్లు అండీ.. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకే 16 శాతం ఐఆర్ ఇచ్చినం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు. అయినా ఇంగితం లేకుండా, అహంకారపూరితంగా మీరు సమ్మెకు పోయి కొందరి ఆత్మహత్యకు కారకులై ఎవరి మీద పెడతారు బద్నాం? వాళ్లే నేరస్తులు.
ఐదేండ్లలో రూ.4,550 కోట్లు ఇచ్చినం..
మొన్న హైకోర్టులో ఏం జరిగిందండీ.. ఇష్టమొచ్చిన అబద్ధాలు మాట్లాడిండ్రు. దీంతో మేం కోపానికి వచ్చేసి ఫైనాన్స్ సెక్రటరీతోని అఫిడవిట్ ఫైల్ చేసినం. ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి పైసాకు ఆడిట్ ఉంటది. గతంలో ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీకి 712 కోట్లు ఇస్తే. మేం ఒక్క సంవత్సరంలోనే రూ. 900 కోట్లు ఇచ్చినం. మా ఐదేండ్ల పాలనలో రూ. 4,550 కోట్లు ఇచ్చినం. దీన్ని ఎట్ల అర్థం చేసుకోవాలి. పాజిటివ్‌గా తీసుకోవద్దా.
కోర్టు ఆ అధికారం లేదు
ప్రభుత్వం తప్పుడు లెక్కలు ఇచ్చిందని కోర్టు ఎక్కడా అనలేదు.. అనదు. అవతల పక్క అడ్వకేట్ ఏదో మాట్లాడి ఉంటడు. ఆయన ఏదో తప్పుడు మాటలు మాట్లాడిండు. కోర్టు మాత్రం అట్ల అనలేదు. హుజూర్నగర్ ప్రజలకు నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వంపై కామెంట్ చేయడానికి హైకోర్టుకు అధికారం లేదు. నిధులివ్వడం ప్రభుత్వ నిర్ణయం.
ఆర్టీసీ దివాలా తీసిందని నేనెప్పుడూ అనలే
ఆర్టీసీ దివాలా తీసిందని నేను ఎప్పుడూ అనలేదు. బ్యాంకులకు కిస్తీ కట్టకపోతే ఎన్‌పీఏ అవకాశముంటదని చెప్పిన. అట్ల కాకుండా ఉండేందుకే ఇవ్వాళ పాలసీ డెసిషియన్ తీసుకున్నం. ఆర్టీసీ దగ్గర మిగిలేది సొంత బస్సులే. అవీ ఐదు వేలే. 2,100 హైర్ బస్సులు ఏవైతే ఉన్నయో వాళ్లకు కూడా ప్రైవేట్ రూట్లు ఇస్తాం. దే విల్ బి నో మోర్ విత్ ఆర్టీసీ. ఆర్టీసీకి ఐదువేలు ఉంటయి.. ప్రైవేట్‌కు ఐదు వేలు ఉంటయి.
కేంద్ర వాటా 31 శాతం ఉంది
చాలా మందికి తెలియని విషయం ఏందంటే రవాణా శాఖ కింద ఉండే ఆర్టీసీ నైంత్ షెడ్యూల్‌లో ఉంది. ఆర్టీసీ విభజనపై మేం కేంద్రాన్ని అడిగినం. విభజన అనేది పెండింగ్‌లో పెట్టుకుని, ఎవరి కార్పొరేషన్ వాళ్లు స్టార్ట్ చేసుకోమని చెప్పిండ్రు. మేం స్టార్ట్ చేసుకున్నం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్‌తోని బైఫర్‌కేషన్ జరిగింది. ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 31 పర్సంటేజీ ఉందన్నరు. ఉన్నది కూడా. వాళ్ల డైరెక్టర్లు కూడా ఉంటరు. ఆర్టీసీకి డబ్బులు ఇయ్యాలని మమ్ములను హైకోర్టు అడిగినప్పుడు మేం కేంద్రాన్ని అడిగే చెప్తామని చెప్పినం. కేంద్ర ప్రభుత్వం 31 శాతం వాటా ఉంటదంటదిగానీ ఎప్పుడూ ఏది పంచుకుంటలేదు. ఇప్పుడు మేం కేంద్రాన్ని అడుగుతం. మేం గత ఐదేళ్ల నుంచి ఇంతింత నష్టాలు ఉన్నయి.. మీరు కూడా పంచుకోవాలని అంటం. భర్తీ చేయాలని అడుగుతం. అప్పుడు కేంద్రం ఏం చెప్తదో.. దాన్ని బట్టి మా నిర్ణయం ఉంటది. వాళ్లు యాండ్స్ వాష్ చేసుకుని మాకు వాటా లేదని వెళ్లిపోతారా ? ఉంటరా ? ఏం చెప్తారని చూడాలె. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికిల్ యాక్ట్ –2019కు సవరణ చేసింది. దాన్నిప్పుడు ఇంప్లుమెంట్ చేస్తున్నం. ఈ విషయాన్ని కేంద్రానికి ఇన్ఫాం చేస్తాం. కేంద్రం మమ్మల్ని అప్రిషిషేట్ చేస్తది. రాష్ట్ర భవిష్యత్ కోసం ఇది ఎప్పుడైనా తీసుకోవాల్సిన నిర్ణయమే.
జీహెచ్‌ఎంసీ రూ.14 కూడా ఇచ్చేది లేదు.
ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.1400 కోట్లు కాదు కదా 14 రూపాయలు కూడా ఇచ్చేది లేదు. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మేమే ఇన్షియేట్ తీసుకుని… మీ దగ్గరే లాస్ ఎక్కువ వస్తుంది మీరు కూడా షేర్ చేసుకోమ్మని జీహెచ్‌ఎంసీని అడిగినం. వాళ్లు రూ.330 కోట్లు ఇచ్చిండ్రు. నెక్ట్స్ ఇయర్ వీళ్లేం చేసిండ్రు రూ. 480 కోట్లు ఇవ్వాలని పెట్టిండ్రు. దీంతో వాళ్లు తట్టపార కిందపెట్టిండ్లు. ఇరగబడితే ఇస్తరా. దానిని అలుసుగా చేసుకుని ఒకటే సంవత్సరంల రూ.480 కోట్లు ఇవ్వమని పోయిండ్లు. అది జరుగుతదా. ఏదైనా ఆరో తారీఖున మళ్లీ మాట్లాడుకుందాం.’’
