ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆర్టీసీలో 1200 మంది లోపే సిబ్బంది మిగిలారన్నారు సీఎం. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని అధికారును ఆదేశించారు. ఆర్టీసీ నష్టాల్లో వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్ లో సమ్మకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదనే తేల్చి చెప్పారు కేసీఆర్.
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవాణాశాఖ మంత్రితోపాటు.. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్, ఆర్టీసీ యాజమాన్యంతో ఆయన ఐదు గంటలకు పైగా సమీక్ష నిర్వహించారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని ఆదేశించారు. కండీషన్లతో కూడిన రిక్రూట్ మెంట్ ఉంటుందన్నరు. కొత్తగా వచ్చే సిబ్బంది.. యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలన్నారు. ఏఏ విభాగాలకు చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో.. ఆయా విభాగాల్లో ఉద్యోగులను భర్తీ చేస్తామన్నారు. ఇకపై ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యం బస్సులుంటాయని రివ్యూలో నిర్ణయించారు. 15 రోజుల్లో ఆర్టీసీని పూర్వస్థికి రావాలని అధికారులను ఆదేశించారు సీఎం. తాము తీసుకున్న నిర్ణయాలతో రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందన్నారు సీఎం.
ఆర్టీసీపై తీసుకున్న తీసుకున్న నిర్ణయాలపై చర్చించి నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వీరు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు.
