FRBM చట్ట పరిమితుల్లోనే తెలంగాణ అప్పులు 

FRBM చట్ట పరిమితుల్లోనే తెలంగాణ అప్పులు 

అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికం చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే..రాష్ర్ట ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ కొంతమంది మాట్లాడుతున్నారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019, 20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల మొత్తం 2 లక్షల 25 వేల 450 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75 వేల 577 కోట్ల రూపాయలు ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 49 వేల 873 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించిందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయని అన్నారు. జి.ఎస్.డి.పి లో తెలంగాణ అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం ఉందన్నారు. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితుల్లోనే ఉన్నాయని, ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. 

సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు 
కేంద్ర రాష్ర్టాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని, అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలని, అయితే.. ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోందని చెప్పారు. దీని ద్వారా రాష్ర్టాలకు 2022, 23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి కొడుతోందన్నారు. రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోందని, ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తోందని కామెంట్స్ చేశారు. 

రుణాల మీద కేంద్రం కోతలు
రాష్ట్రాలు FRBM (ఎఫ్.ఆర్.బి.ఎం) పరిమితిలో తీసుకొనే రుణాల మీద కూడా కేంద్రం కోతలు విధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ.. ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందంటూ కామెంట్స్ చేశారు. India is union of states అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని.. మళ్లీ రాష్ట్రాల నెత్తిన రుద్దుతోందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసిందని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో వెనక్కి తగ్గిందన్నారు. ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద హింసను ప్రయోగించటమే కాకుండా, వారిని దేశ ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టిందన్నారు. చివరికి రైతుల పోరాటానికి వెనక్కి తగ్గి నల్లచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చిందన్నారు. 

కేంద్రం తీరుతో కుంటుపడిన దేశ ఆర్థికాభివృద్ధి 
పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అనే పేరును తగిలించి అవమానిస్తోందన్నారు. కేంద్రం నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల  ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యనించారు. 

తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని, ఈ దుర్మార్గాన్ని చూసి స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు. ‘భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిచ్చు రేపాలని, శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని, అభివృద్ధిని ఆటంకపరచాలని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావి లోకం, యువకులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది’ అని సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశారు.