రెబల్స్ మాట వినకపోతే.. వేటు తప్పదు

రెబల్స్ మాట వినకపోతే.. వేటు తప్పదు

తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ఎమ్మెల్యేలతో పాటు.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు కూడా హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రెబల్స్‌ వ్యవహారంపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. రెబల్స్ విషయంలో కఠినంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఎమ్యెల్యేలకు సూచించారు. రెబల్స్‌ను ముందుగా బుజ్జగించాలని… భవిష్యత్‌లో చాలా అవకాశాలు వస్తాయని చెప్పాలని నేతలకు సూచించారు. అప్పటికీ వినకపోతే హెచ్చరించాలని కూడా అన్నారు. రెబల్స్ మాట వినకపోతే పార్టీ నుంచి బషిష్కరించటంతో పాటూ.. భవిష్యత్తులో మళ్లీ పార్టీలోకి తీసుకునేదిలేదని చెప్పాలని సీఎం అన్నారు.

మరోవైపు పార్టీలో ఇంటర్నల్ గలాటా జరుగుతోందని.. నాయకులందరూ జాగ్రతగా ఉండాలని సీఎం హెచ్చరించారు. రెబల్స్ విషయంలో నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. కాగా.. కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. సీఎం కేసీఆర్ చేరుకున్న తర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తూనే ఉన్నారు. దాంతో భేటీకి ఆలస్యంగా వచ్చిన నేతలపై సీఎం సీరియస్ అయ్యారు. నేతలు ఆలస్యంగా వస్తారని తెలిసే.. నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌.. ఢిల్లీ షెడ్యూల్ ఉండటంతో మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.