ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం

ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల ‘బీ’ ఫారాల జారీకి సంబంధించిన విధివిధానాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ వివరించనున్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ‘ఎ’ ఫారాలు మరియు ‘బి’ ఫారాలు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి అందచేస్తారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశావహుల జాబితాలు రెడీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆ జాబితాను అధినేత కేసీఆర్‌కు అందజేయనున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ గతంలోనే ఎమ్మెల్యేలతో ఒకసారి సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం ఎమ్మెల్యేలతో రెండోసారి సమావేశం కాబోతున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం మున్సిపల్ ఎన్నికలపై మరోసారి సర్వే చేయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి.. అపోజిషన్ పార్టీల కంటే రెబల్స్‌తోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుందని సీఎంకు రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. దాంతో రెబల్స్‌తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గులాబీ బాస్ ఇప్పటికే ఆయా నేతలను ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా రెబల్స్‌ను బుజ్జగించాలని.. వీలు కాకపోతే ఉపసంహరణ గడుపులోపైనా వారందరిని సెట్ రైట్ చేయాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా..పార్టీలోకి వచ్చిన కొత్త నేతలకు మరియు పాత నేతలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రెబల్స్ గొడవలు మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా బొడుప్పల్‌లో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్నవాళ్లను కాదని.. నాయకుల భార్యలకు టిక్కెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తాండూరులోనూ రెబల్స్ బెడద తప్పేలా లేదు. అక్కడ మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య పొసగడంలేదు. దాంతో మంత్రి తలసాని వారి పంచాయితీని సెట్ చేసే పనిలో పడ్డారు. ఇద్దరు నేతలను తెలంగాణ భవన్‌కు పిలిపించి ఆయన మాట్లాడారు.

మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు సమక్షంలోనే మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి తమవారికే ఇవ్వాలంటూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఆ విషయంలోనే మంత్రి, మాజీ ఎమ్మెల్యే వేదికపైనే హరీష్ రావు ముందే గొడవపడ్డారు. ఈ గొడవ గురించి బాస్ కేసీఆర్ వారిద్దరిని పిలిచి మందలించారు. అయినా కూడా వివాదం సమసిపోలేదు. అటు జిల్లాల్లోనూ.. చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో అవగాహన కుదరటంలేదు. అందువల్ల గురువారం నాటి సమావేశంలో.. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటూ.. రెబల్స్ బెడద లేకుండా చూడటంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.