మేం భయంకరమైన ఉద్యమకారులం.. ఎంతకైనా తెగిస్తం

మేం భయంకరమైన ఉద్యమకారులం.. ఎంతకైనా తెగిస్తం

హైదరాబాద్‌‌, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని వెంటాడుతామని,  వేటాడుతామని సీఎం కేసీఆర్‌‌ హెచ్చరించారు. తాము భయంకరమైన ఉద్యమకారులమని, ఎంతకైనా తెగిస్తామని, వెనుకకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని తాను కేంద్రాన్ని  అడిగితే 50 రోజులుగా ఉలుకూ పలుకూ  లేదని మండిపడ్డారు.  మంగళవారం తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ ఎల్పీ మీటింగ్​ అనంతరం కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం అంటుంటే.. ఇక్కడి బీజేపీ మాత్రం వరి వేయాలని చెప్తోందని, ఇది ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏడాదిలో ఎంత వరి ధాన్యం తీసుకుంటుందో ఎఫ్​సీఐ చెప్పాలని డిమాండ్​ చేస్తూ  గురువారం ఇందిరాపార్క్​ వద్ద రాష్ట్ర కేబినెట్​ ధర్నా చేస్తుందని ఆయన ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ ధర్నాలో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీఎంఎస్​ చైర్​పర్సన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ధర్నా తర్వాత రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి మెమోరాండం అందజేస్తామన్నారు. ధర్నా తర్వాత రెండు రోజులు చూస్తామని, అయినా కేంద్రం వడ్ల సేకరణపై స్పష్టత ఇవ్వకపోతే  ఈ యాసంగిలో ఏ పంట వేయాలనే దానిపై పాలసీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో, పార్లమెంట్​లో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటం. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడాటానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా ప్రశ్నిస్తం. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుంటే... బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లడంలో ఉన్న పరమార్థం ఏంది? యాసంగిలో వరి వేయాలని బండి సంజయ్​చెప్పింది నిజం కాదా? అట్ల చెప్పడం తప్పు అని ఒప్పుకుని రైతులకు క్షమాపణ చెప్పాలి” అని కేసీఆర్​ డిమాండ్​ చేశారు.

పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం

కొనుగోలు సెంటర్ల దగ్గరకు వెళ్తున్న బండి సంజయ్​ను  రైతులు నిలదీస్తున్నారని, వారిపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని కేసీఆర్​ ఆరోపించారు. ‘‘రైతులపైనే రకరకాల పద్ధతిలో దాడులు చేస్తున్నరు. ఇదేం సంస్కారం. రైతులను కొడుతున్నరు. ఎవరైనా ఎదురు మాట్లాడి ప్రశ్నిస్తే దేశ ద్రోహులైతున్నరు” అని బీజేపీపై మండిపడ్డారు. ‘‘టీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలకు పొలాలు ఉండవా ? వడ్లు పండయా ? వాళ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు అమ్ముకునేందుకు రారా? టీఆర్ఎస్ కు 66 లక్షల మంది సభ్యులు ఉన్నరు. వారంతా తప్పకుండా బీజేపీ తీరును నిలదీస్తరు. బండి సంజయ్​ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నరు.   రైతులపై దాడి విషయంలో క్షమించేది లేదు. అనవసరమైన పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం. సీరియస్​గా తీసుకుంటం’’ అని హెచ్చరించారు. తాము వడ్లు కొంటుంటే కొనుగోలు సెంటర్ల వద్దకు బీజేపీవాళ్లు వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని, కొనుగోలు కేంద్రాల దగ్గరకు పోవడం పతనమే తప్ప.. లాభం జరగదని, అక్కడ రంకుతనం చేస్తామంటే కుదరని హెచ్చరించారు. వానాకాలం వడ్లు మొత్తం కొనేదాకా కేంద్రంతో తలపడుతామని, యుద్ధం చేసి కొనిపిస్తామన్నారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్​ రైస్​కొనబోమందని, రా రైస్​ ఎంత కొంటుందో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. కేంద్రం బాధ్యత విస్మరిస్తోందని దుయ్యబట్టారు.

కోతలు మొదలు కాలే.. నారు పోసే టైం దగ్గరపడ్డది

రాష్ట్రంలో ఇంకా వానాకాలం వరి పంట కోతలు మొదలు కాలేదని సీఎం కేసీఆర్​ అన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల టన్నుల వడ్లు కొన్నామని, ఒక పూట అటు ఇటు తాము వడ్లు కొంటనే ఉన్నామని చెప్పారు. ఈ నెలలోనే అనురాధ కార్తె  మొదలవుతుందని, రైతులు నారుమళ్లు పోస్తారని ఆయన అన్నారు. నార్లు పోసిన తర్వాత వద్దంటే రైతులు నష్టపోతారని, అందుకే నాలుగు రోజులు ఆగి యాసంగిలో ఏ పంట వేసుకోవాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.  ఇప్పటికే బాయిల్డ్​ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని, ఇప్పుడు రైతులు వరి పంట వేసి మునిగిపోవద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలనే వేయాలని చెప్పారు. కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉంటే  రైతులతో తానే వరి వేయిస్తానని కేసీఆర్​ తెలిపారు. పెట్టుబడికి, నీళ్లకు ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని స్థిరీకరించుకున్నామన్నారు.  యాసంగి పంటకు టంచన్​గా రైతుబంధు ఇస్తామన్నారు. కేంద్రం చేతగాని తనాన్ని తమ మీద రుద్దుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

ప్రధానికి లెటర్​ రాస్త

ఏడాదికి రాష్ట్రం నుంచి ఎంత రా రైస్​ సేకరిస్తారనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఫుడ్ సివిల్​ సప్లయ్స్​మంత్రికి బుధవారం లెటర్​ రాయనున్నట్లు కేసీఆర్​వెల్లడించారు. కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించే వరకు రభస నడుస్తూనే ఉంటుందన్నారు. పంజాబ్​లో ధాన్యం కొన్నట్లుగా తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొంటదా కొనదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘కేంద్రం ఒకటి చెప్తది.. మేమొకటి చెప్తం అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటే వాళ్లే బలైతరు” అని మండిపడ్డారు. పోయిన యాసంగిలోని 5 లక్షల టన్నులు బియ్యం తీసుకుంటారో లేదో కేంద్రం చెప్పాలని డిమాండ్​ చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం ఉల్కం పల్కం అంటే ప్రజలే తేల్చుకుంటారని, ఏ వేదిక మీద వెంటాడాలో అక్కడ వెంటాడుతామన్నారు.

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తం

వ్యవసాయ, విద్యుత్​ చట్టాలను ఔట్​రైట్​గా వ్యతిరేకించినట్లు సీఎం కేసీఆర్​ చెప్పారు. తమకు స్టాండ్​ లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తల, తోక లేకుండా మాట్లాడేది రాష్ట్ర బీజేపీ, కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. కరెంట్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో  తీర్మానం చేసి పంపామని, అగ్రి చట్టాల మీద కూడా తీర్మానం చేసి పంపుతామన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులపై దాడి చేశారని బీజేపీ నేతలపై చాలా కేసులు నమోదయ్యాయని, వారిపై కోర్టులు, న్యాయం ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారని మీడియా ప్రశ్నించగా.. అన్నీ తామే గెలుస్తామని, ఇక అభ్యర్థులను ప్రకటించాల్సిన అక్కరేమి ఉందని ప్రశ్నించారు.