ఎలక్షన్స్ రాగానే ఆగమాగం కావొద్దు.. మోసపోతే గోసపడుతాం : కేసీఆర్

ఎలక్షన్స్ రాగానే ఆగమాగం కావొద్దు.. మోసపోతే గోసపడుతాం : కేసీఆర్

సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, ప్రజలెవరూ నమ్మొద్దన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. 

ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమకు ఒక అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు మంత్రులుగా పని చేశారని, సూర్యాపేటను వాళ్లు ఏనాడైనా అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా..? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి..? అని అడిగారు. 

కాంగ్రెస్ నేతలు రైతుల కష్టాలు తీర్చాలని ఏనాడైనా ఆలోచించారా..? అని అడిగారు. రూ.4 వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో నీతి ఉంటుందా..? అని అన్నారు. తాము కూడా పింఛన్లు తప్పకుండా పెంచుతామన్నారు. పింఛన్లు ఎంతకు పెంచుతామన్న విషయాన్ని త్వరలోనే చెబుతామన్నారు.

తమకు కులం, మతం, జాతి లేదన్నారు సీఎం కేసీఆర్. అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులను చిన్నచూపు చూశారని చెప్పారు. సర్కార్ ను నడిపించాలంటే సంసారం నడిపించాన్నట్లే ఉంటుందన్నారు. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు మాత్రం తమకు ఒక అవకాశం ఇవ్వండని అడుగుతున్నారంటూ మండిపడ్డారు. 

ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడని, మరో పార్టీ నాయకుడేమో 3 గంటల కరెంటు చాలంటాడని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని చెప్పారు. కర్నాటకలోని చాలా గ్రామాల్లో, బెంగళూరు సిటీలోనూ కరెంటు కోతలు విధిస్తున్నారని చెప్పారు. కేవలం 7 గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం పడ్డ బాధలే ఇప్పుడు కర్నాటక వాళ్లు పడుతున్నారని చెప్పారు. గతంలో మాదిరిగా వ్యవసాయ పొలాలు, బావుల వద్ద పాములు, తేళ్లు కరిచి చచ్చిపోయే పరిస్థితులు మనకు రావాల్నా..? 24 గంటల కరెంటు ఇలాగే ఉండాలో ఆలోచించుకోండి అని అన్నారు. 

ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ధరణిలో ఒకసారి పేరు ఎక్కిందంటే ఆ పేరును తొలగించే అవకాశం తనకు కూడా లేదన్నారు. మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మండలాఫీసుల వద్ద పైరవీకారులదే రాజ్యం అవుతుందన్నారు. 
 
ఓట్లు అనేది మన తలరాతను మనం రాసుకునే గొప్ప ఆయుధం అని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ  విజయంపై ఎలాంటి అనుమానమే లేదన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఐదారు సీట్లు ఏక్కువే వస్తాయని చెప్పారు. తాము చెప్పేవి కట్టు కథలు.. పిట్టకథలు కావన్నారు.