ప్రాంతీయ పార్టీలతో కలిసి రావాలన్న కేసీఆర్

 ప్రాంతీయ పార్టీలతో కలిసి రావాలన్న కేసీఆర్

లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలతో సీఎం కేసీఆర్

  •  ప్రాంతీయ పార్టీలతో కలిసి రావాలని సూచన 
  • సీపీఎం, సీపీఐ లీడర్లతో వేర్వేరుగా భేటీ

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర మూడో ప్రత్యామ్నాయ ఫ్రంట్​ ఏర్పాటు కోసం కలిసి పని చేద్దామని సీపీఎం, సీపీఐ జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. శనివారం ప్రగతి భవన్ లో సీపీఎం, సీపీఐ లీడర్లతో సీఎం వేర్వేరుగా భేటీ అయ్యారు. రెండు పార్టీల లీడర్లకు ఆయన స్వాగతం పలికారు. హైదరాబాద్ లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, ప్రకాశ్ కారత్, బాలకృష్ణన్, ఎంఏ బేబీ... ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ  పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ బినయ్ విశ్వం, కేరళ మంత్రి రాజన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చించారు. సీపీఎం కేంద్ర కమిటీ నేతలతో కలిసి భోజనం చేశారు. కేసీఆర్ తో ఫ్రూట్ ఫుల్ ఇంటరాక్షన్ జరిగిందని పినరయి విజయన్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎదిగే పరిస్థితుల్లేవ్... 
పోయిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించిన కేసీఆర్... ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో ఉన్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగే పరిస్థితులు కనిపించడం లేదని.. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు, ముఖ్యంగా సీపీఎం ప్రాంతీయ పార్టీలతో కలిసి రావాలని కేరళ సీఎం విజయన్​కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. దేశంలో కాంగ్రెస్ కు మించి ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని, వాటితో కమ్యూనిస్టు పార్టీలు కలిస్తే మరింత బలం చేకూరుతుందని విజయన్ అన్నట్లు సమాచారం. దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీని కర్నాటక దాటి రానివ్వొద్దని, దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని, బీజేపీకి చాన్స్​ ఇవ్వొద్దని చర్చించుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలపై కొట్లాడుదామని లెఫ్ట్ పార్టీలను కేసీఆర్ కోరినట్లు సమాచారం. పంజాబ్ లో ప్రధాని సెక్యూరిటీ ఫెయిల్యూర్ వెనుక రాజకీయ కోణం, యూపీ ఎన్నికలపై చర్చించుకున్నట్లు తెలిసింది. త్వరలో లెఫ్ట్ పార్టీల అనుబంధ సంఘాలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళనలు చేయడంపై చర్చించినట్లు సమాచారం.