
అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ..ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా చేరుకుందని చెప్పారు. హైదరాబాద్ లోని డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏ రోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు రూ. 105 కోట్ల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.