తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికంగా ఉన్నప్పటికీ, నిరుద్యోగ యువతకు నిరాశ ఎదురవుతోంది. అభివృద్ధి కోసం చేసిన కోట్ల రూపాయల అప్పు తెలంగాణ బిడ్డలకి భారం కానుంది. నేటికీ యువత కూలీలుగా, ఉపాధి హామీ పనివారుగా, స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్లుగా, తాత్కాలిక ప్రాతిపదికగా కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు. రైతులు, గ్రామీణ జనాభా కొంతమేరకు లాభపడినప్పటికీ అప్పుల భారం భవిష్యత్తు తరాలపై రాష్ట్ర ఖజానాపై పడింది.
అప్పుల వేగం ఆదాయ వృద్ధి కన్నా ఎక్కువగా ఉంది. నిర్మాణం చేసిన సాగునీటి ప్రాజెక్టుల ఆర్థిక ప్రయోజనాలపై నేటికీ స్పష్టత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రయోజనాలు సమానంగా అందడం లేదు. వేగంగా విస్తరించిన ఐటీ రంగంలో తెలంగాణయేతరులకే ఎక్కువ మందికి ఉపాధి లభించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు దశాబ్దాలకుపైగా విద్యావ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగాలను పొందటంలో తెలంగాణ ప్రజలు వెనకబడిపోయారు.
ప్ర భుత్వం ఇస్తున్న కాంట్రాక్టులు, వివిధ నిపుణుల సలహా కమిటీలలో , రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టులు అన్నిట్లల్లో నేటికీ ప్రాంతీయేతరులదే ఆధిపత్యం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సింహభాగం నేటికీ పరాయి హస్తాలలోనే ఉంది. ఉద్యోగ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం నేటికీ నిమిత్త మాత్రమే ఉండడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకుసాగింది.
అప్పులతో అభివృద్ధి
మౌలిక వసతుల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను సమీకరించింది. ఇందులో భాగంగా అప్పులు కీలకపాత్ర పోషించాయి. అయితే, ఈ అప్పులతో సాధించిన అభివృద్ధి ఎవరి పాలైంది? దాని లాభాలు ఎవరికీ చేరాయి? అన్న ప్రశ్నలు ఆర్థిక, సామాజిక పరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా అప్పులు తీసుకోవడం తప్పు కాదు.
ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు అప్పులు తీసుకుని వాటి ద్వారా భవిష్యత్తులో ఆదాయం, ఉపాధి, ఉత్పాదకత పెరుగుతుందని ఆశిస్తాయి. సాగునీటి రంగంలో భారీ ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ విస్తరణ, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి రంగాల్లో అప్పులు వినియోగించడం జరిగింది.
కాళేశ్వరం వంటి మెగా సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ఈ విధానానికి ఉదాహరణలు.
రెట్టింపు వేగంతో అప్పులు
అభివృద్ధి ఫలితాలు కొన్ని వర్గాలకు ప్రత్యక్షంగా చేరాయి. రైతులకు సాగునీటి సౌకర్యాలు, రైతుబంధు వంటి ఆదాయ సహాయ పథకాలు కొంత భద్రతను కల్పించాయి. పేద, వృద్ధులకు ఆసరా పింఛన్లు సామాజిక భద్రతను అందించాయి. అదే సమయంలో, పట్టణాభివృద్ధి కార్యక్రమాల వల్ల నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు వేగంగా ఎదిగాయి.
ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, సగటు వార్షిక వృద్ధిరేటు సుమారు 12 శాతంగా నమోదైంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, సేవలు, పట్టణీకరణ వంటి రంగాల్లో నిరంతర వృద్ధిని సూచిస్తోంది. అయితే, ఇదే కాలంలో రాష్ట్రం మొత్తం పెండింగ్ అప్పులు సుమారు 23 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.
అంటే, రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న వేగానికి దాదాపు రెట్టింపు వేగంతో అప్పులు పెరిగినట్లవుతుంది. ఈ పరిస్థితి ప్రత్యక్ష ప్రతిఫలం..అప్పులు– జీఎస్డీపీ నిష్పత్తిలో
స్పష్టంగా కనిపిస్తుంది. గత దశాబ్ద కాలంలో ఈ నిష్పత్తి సుమారు 2.5 రెట్లు పెరిగింది.
విద్యుత్ సబ్సిడీల భారం
సాధారణంగా, ఆర్థికంగా ఆరోగ్యకరమైన రాష్ట్రంలో అప్పుల వృద్ధి రేటు, జీఎస్డీపీ వృద్ధిరేటుకు సమీపంగా ఉండాలి. కానీ, తెలంగాణలో అప్పుల వృద్ధి, ఆదాయ వృద్ధిని గణనీయంగా మించిపోయింది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక స్థిరత్వంపై దీర్ఘకాలిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో విద్యుత్ సబ్సిడీల భారం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగి ఆర్థికస్థిరత్వంపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తోంది.
2014–15లో రైతులకు రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్ (సుమారు 19 లక్షల పంప్‌సెట్లు) అందించగా, విద్యుత్ సబ్సిడీ వ్యయం రూ.2,400 కోట్లు ఉండి, డిస్కంల పెండింగ్ అప్పులు రూ.11,926 కోట్లుగా నమోదయ్యాయి. అయితే 2024–25 నాటికి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ (సుమారు 25 లక్షల పంప్‌సెట్లు)తో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టడంతో సబ్సిడీ వ్యయం రూ.10,085 కోట్లకు పెరిగింది.
అంటే, దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల. దీనితోపాటు డిస్కంల పెండింగ్ అప్పులు రూ.46,127 కోట్లకు చేరడం, సబ్సిడీ భారం ప్రభుత్వ ఆదాయాల కంటే వేగంగా పెరుగుతోందని, అలాగే ప్రస్తుత విద్యుత్ సబ్సిడీ విధానం ఆర్థికంగా స్థిరంగా లేనిదిగా మారుతోందని స్పష్టంగా సూచిస్తోంది.
పెండింగ్ అప్పులు రూ.7,95,045 కోట్లు
2024–25 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పుల ప్రొఫైల్‌ను పరిశీలిస్తే ఆఫ్ బడ్జెట్ అప్పులు, పెండింగ్ బిల్లుల వల్ల ఆర్థిక బాధ్యతలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం రుణాల కింద ఉన్న అధికారిక పెండింగ్ అప్పులు రూ.4,51,203 కోట్లు ( జీఎస్డీపీలో 28%) కాగా, కాంటింజెంట్ లయబిలిటీస్ మొత్తం రూ.3,43,842 కోట్లు (21%)గా ఉన్నాయి.
వీటిలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.1,17,109 కోట్లు, అలాగే పెండింగ్ బిల్లులు రూ. 42,358 కోట్లుగా అంచనా. ఈ రెండింటినీ కలుపుకుని రాష్ట్రం మొత్తం పెండింగ్ అప్పులు రూ.7,95,045 కోట్లు, అంటే జీఎస్డీపీలో సుమారు 49శాతంకు చేరాయి. ఇది 15వ ఆర్థికసంఘం నిర్దేశించిన 32.8% అప్పు– జీఎస్డీపీ పరిమితిని, అలాగే రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం లక్ష్యమైన 25%ను గణనీయంగా మించిపోయింది, తద్వారా తెలంగాణలో అప్పుల నిర్వహణ పారదర్శకతపై, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన విధానపరమైన ఆందోళనలను కలిగిస్తోంది.
నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలు స్వీకరించాలి
ఆఫ్ బడ్జెట్ అప్పులపై వడ్డీ చెల్లింపులను బడ్జెట్‌లో పూర్తిగా చూపకపోవడం వల్ల తెలంగాణలో వ్యయం, ఆదాయ లోటు తక్కువగా చూపడమైనది. ఉదాహరణకు 2024–25లో బడ్జెట్‌లో చూపిన ఆదాయ మిగులు రూ.5,889 కోట్లుగా ఉన్నప్పటికీ ఆఫ్ బడ్జెట్ అప్పులపై రూ.21,810 కోట్ల వడ్డీని చేర్చిన తరువాత వాస్తవ ఆదాయ లోటు రూ.44,712 కోట్లకు పెరుగుతుంది.
ఇదే ధోరణి గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ రాష్ట్ర ఆర్థికస్థితిపై పారదర్శకత లోపం, దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరతను స్పష్టంగా సూచిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, పారిశ్రామిక ఫలాలు ప్రజలకు చేరాలంటే విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. యువత నైపుణ్యాలను పెంచి ఉపాధి మార్గానికి పెద్దపీట వేయాలి. తెలంగాణ ప్రాంతంలోని నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలను కూడా స్వీకరించి ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా కృషి చేయాలి.
రాష్ట్ర అప్పులు తీర్చే సామర్థ్యాన్ని రాష్ట్ర యువతకు అందించగలగాలి. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో పనిలోనూ, ప్రగతిలోనూ, పథకాల్లోనూ, వనరుల్లోనూ, నిర్మాణాత్మక పాత్ర పోషించే అవకాశాన్ని అందించాలి. అలా జరిగితేనే తెచ్చిన అప్పులతో జరుగుతున్న అభివృద్ధిలో సమన్యాయం జరుగుతుంది.
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్సీయూ
